Salt Satyagraha
ఉప్పు సత్యాగ్రహం అనగానే ఆంగ్లేయులు అవహేళన చేశారు. పిల్లచేష్టలంటూ పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇదేం ఉద్యమమంటూ మహాత్ముడిని అనుమానించారు. వద్దని వారించారు. 61 ఏళ్ల ఆయన మాత్రం 388 కిలోమీటర్ల పాదయాత్రకు బయల్దేరారు. ఉప్పు ఉప్పెనలా మారితే... నవ్విన నోళ్లే మూతబడ్డాయి. వద్దన్నవారే వెంటవచ్చారు. గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా... సముద్రంలో ఓడలకు ప్రమాదాలు జరిగేవి. వీటిని నివారించటానికి భారత్లో విపరీతమైన మార్కెట్ ల ఉప్పును ఓడల్లో నింపి దిగుమతి చేయటం మొదలెట్టారు ఆంగ్లేయులు. లాభాలు ఆర్జించడానికి భారత్లో ఉప్పు తయారీ, అమ్మకాలపైనా ఆంక్షలు, అధిక పన్నులు వేశారు. సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టారు. గాలి, నీరు తర్వాత మనిషికి నిత్యావసరమైన ఈ ఉప్పునే బ్రిటిష్ పై తన ఆయుధంగా మలచారు గాంధీజీ! ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీజీ 1930 మార్చి 2న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు లేఖ రాస్తే ఆయన నవ్వుకొని పక్కనపడేశారు. బ్రిటిష్ పత్రికలు కూడా గాంధీ ఆలోచనలను ...