కర్తవ్యబోధ... కర్మ యోగం
కర్తవ్యబోధ... కర్మ యోగం
లక్ష్యాన్ని తేల్చుకోలేకా, మార్గాన్ని ఎంచుకోలేకా, మంచిచెడుల్ని బేరీజు వేసుకోలేకా, జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోలేకా ఉక్కిరిబిక్కిరైపోతున్న ఆధునిక మానవుడికి భగవద్గీత ఓ కర్తవ్య దీక్ష ఉపదేశం. ఐటీ కొలువులు చేస్తూనే, బిజినెస్ పరుగులు తీస్తూనే, అమెరికా కలలు కంటూనే ఓ యోగిలా ఎలా జీవించవచ్చో పరమాత్మ బోధించాడు. హృదయమే వాటికగా జరిగే మనోయజ్ఞం గీతాకృష్ణుడి కర్మయోగం.
ఎందుకంత కష్టపడతావ్? ఎన్నాళ్లని శ్రమిస్తావ్? ఎన్ని వందనోట్లు పోగేస్తే కోటి రూపాయలు కావాలి? దొడ్డిదారి ఎంచుకో, లంచాలు తీసుకో, దందాలు చేసుకో, నమ్మిన వాళ్లను నట్టేట ముంచెయ్. దొంగ లెక్కలు చూపించైనా సరే వ్యాపారవేత్తగా ఎదిగిపో ఎలా గెలిచావో ఎవరిక్కావాలి, గెలిచావా లేదా? ఏ గడ్డి తిన్నావో ఎవరు చూస్తారూ," సంపాదించావా లేదా?
ఇది కలిపురుష గీత దుర్యోధన దృక్పథం. దుశ్శాసన భావజాలం. అనేకానేక ప్రభావాలతో... మనలోని మానవత ధృతరాష్ట్రుడిలా గంతలు కట్టుకుంటోంది. కర్ణుడిలోని దాతృత్వకోణాన్ని దుర్జన సాంగత్యమనే విష ప్రభావం మింగేసినట్టు... సమాజంలో ఏమూలనో బిక్కు బిక్కుమంటున్న మంచిని భావ కాలుష్యం కబళిస్తోంది. సమకాలీన వ్యవస్థలో పెచ్చుమీరిన అవినీతికైనా; హద్దులు దాటిన హింసకైనా, అర్థంలేని అసహనానికైనా, బంధాల బీటలకైనా కౌరవతత్వమే కారణం.
అర్జునుడు ఆయుధాన్ని జారవిడిచిన్నట్టు... ఆధునిక మానవుడు ఆత్మవిశ్వాసాన్నీ ఆశావాదాన్నీ వదిలేసుకుంటున్నాడు. భ్రమల ఊబిలో చిక్కుకుంటున్నాడు. భయాల బంది ఖానాలో ఖైదీ అవుతున్నాడు. ఇంకెంత కాలమీ అజ్ఞాన అరణ్యవాసం. మనసును ధర్మక్షేత్రంగా మలుచుకుని, కురుక్షేత్ర సంగ్రామానికి శంఖం పూరించాల్సిందే. ఆత్మ విశ్వాసం అనే పాశుపతం తో అంతఃశ్శత్రువులను తరిమి కొట్టాల్సిందే.
విరాట్ స్వరూపంలో కృష్ణభగవానుడదిగో... ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... మనిషిని మనిషిగా బతికించడానికి తానూ ఓ మనిషై పుట్టిన మహాదేవుడు!
కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా.... కృష్ణా!
అజ్ఞానం మమ్మల్ని కమ్మేసింది. ఏది ధర్మమో, ఏది ఆధర్మమో తేల్చుకోలేకపోతున్నాం. మాకు మంచిని బోధించు, శ్రేయస్కరమైన మార్గాన్ని చూపించు అని వేడుకుందాం. పాండవుల్ని గెలిపించినట్టే, మనల్నీ ఒడ్డునపడేస్తాడు. అర్జునుడి రథాన్ని సత్ మార్గంలో నడిపించినట్టే, మన బతుకు బండినీ దార్లో పెడతాడు. తామరాకు మీద నీటి బిందువులా... నిత్య జీవితంలో ఒడుపుగా నెట్టుకురావడమెలాగో నేర్పుతాడు.
భగవద్గీత... మూడో అధ్యాయం.... కర్మయోగం...
శ్రీకృష్ణపరమాత్మ అడవులకెళ్లిపోయి తపస్సు చేసుకోమని ఆదేశించడు. బంధాల్ని వదిలేసుకుని కాషాయం కట్టుకోమని సలహా ఇవ్వడు. పూజలూ వ్రతాలూ ఉపవాసాలూ హోమాల ప్రస్తావన తీసుకురాడు.
బతుకు బుద్భుదప్రాయమని పెదవి విరిచేయడు. సంసారం దుఃఖసాగరమని నిరాశపరచడు. ఆనందవిషాదాల నడుమే, గెలుపోటముల మధ్యే ఓ యోగిలా బతకడం సాధ్యమేనంటాడు. ఏం ఫర్వాలేదు. నువ్వో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే ప్రోగ్రామింగే నీ ముక్తి మార్గం. నువ్వో బ్యాంకు ఉద్యోగి అయితే, డెబిట్-క్రెడిట్లే నీ జపతపాలు. నువ్వు గృహిణివైతే వంటిల్లే నీ ధ్యానకేంద్రం అని ధైర్యం చెబుతాడు. హృదయాన్ని వాటికగా చేసుకుని కర్మల్ని ద్రవ్యాలుగా సమర్పించి మనోయజ్ఞం చేయమంటాడు. భక్తితోనో, జ్ఞానంతోనో, వైరాగ్యంతోనో సాధించగలిగే ఆధ్యాత్మిక ప్రగతి... 'కర్మయోగ' జీవన శైలితోనూ సాధ్యమేనని ప్రకటిస్తాడు.
కర్మ... పనిచేయడం.
అకర్మ... ఏపనీ చేయక పోవడం.
సకామ కర్మ...ప్రతి ఫలాన్ని ఆపేక్షించి పని చేయడం
నిష్కామ కర్మ. ఎలాంటి ఫలాపేక్షా లేకుండా పనిచేయడం.
- ఈ నాలుగు అంశాల చుట్టే కర్మయోగమంతా పరిభ్రమిస్తుంది. నడవడం ఓ కర్మ, తినడం ఓ కర్మ, నిద్రపోవడం ఓ కర్మ. జీవిత మంటే అనేకానేక శారీరక, మానసిక కర్మల సమాహారం. కర్మ మనిషి సహజ స్వభావం.
'న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ 'కృత్' -
కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేం. చేస్తూ ఉండాల్సిందే. కర్మ ఎటూ తప్పదు కాబట్టి, ఆ చేసేదేదో మంచి కర్మలు చేయమంటాడు. ఎంత మంచి కర్మలైనా కాస్తోకూస్తో ఫలాపేక్ష ఉంటుంది. ఆ ఆసక్తి'ని తుంచేసుకోమంటాడు, 'ఆ బంధాన్ని' వదిలేసుకోమంటాడు.
విద్యుత్ సరఫరాలో ఏదో సమస్య వస్తుంది. ఇల్లంతా చీకటి. నేరుగా వెళ్లిపోయి ఫ్యూజ్ బాక్సులో చేయి పెడతామా? కరెంటు కరిచేయదూ! అలా అని వెలుతురును కోరుకోకుండానూ ఉండలేం. చేతికి రబ్బరు తొడుగు వేసుకుని పని మొదలు పెడతాం. ఆపాటి జాగ్రత్త ఉంటే, విద్యుదాఘాతాలు మనల్నేమీ చేయలేవు. అదే నైపుణ్యమంటే! నిత్య కర్మ ల్లోనూ అంతటి కౌశలాన్ని ప్రదర్శించు. యోగః కర్మసు కౌశలం.
నియతం కురు కర్మత్వం... పని చేయి. కష్టపడి పనిచేయి. మహా నైపుణ్యంగా పనిచేయి. అదే ప్రపంచమన్నట్టు పనిచేయి. ఎవరూ వేలెత్తి చూపనంత గొప్పగా పనిచేయి. ఎవరూ అజమాయిషీ చేయాల్సిన అవసరమే లేకుండా పనిచేయి. ఆ పన్లోనే ఆనందాన్ని అనుభవించు. అంతే, అంతవరకే నీ బాధ్యత.
జీవితాన్ని యుద్ధతో పోల్చాడు భగవానుడు. అక్కడా పోరాటం తప్పదు. ఇక్కడా పోరాటం తప్పదు. యుద్ధస్వ - యుద్ధం చెయ్. విగత జ్వరః - ఎలాంటి అలజడీ లేకుండా.. జీవన యుద్ధాన్ని నిర్భయంగా, నిశ్చలంగా కొనసాగించమంటాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? 'మయి సర్వాణి కర్మాణి సంన్యస్య' - నీ కర్మలన్నీ నాకు వదిలి పెట్టు, నేనే చూసుకుంటా ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. అని భరోసా
యజ్ఞార్థాత్ కర్మణాః అన్యత్ర లోకః
అయమ్ కర్మ బద్ధనః ... మిగతా కర్మలన్నీ బంధ హేతువులే. ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా, ఓ యజ్ఞంలా పనిచేయడమే కర్మయోగం అని నిర్వచిస్తాడు గీతాచార్యుడు. ఫలాన్నో ప్రసాదాన్నో సమర్పించి 'సర్వం కృష్ణార్పణమస్తు' అని ఎలా అంటామో.. అలానే, మనం చేసిన కర్మల్ని పరమాత్మకు నైవేద్యంగా ఇచ్చేయాలి. నైవేద్యమనేది ఎంత కమ్మగా ఉన్నా, మనం ఎంత ఆకలిమీదున్నా ... మొత్తం తినేయం! ఆత్మీయులతో పంచుకుంటాం. 'ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఇదే.
'సమర్పణ' చేయగానే కర్మ మీద మనకు ఎలాంటి అధికారమూ ఉండదు. ఆ ఫలితం మనది కాదు, ఆ ప్రభావం మనల్నేమీ చేయదు దీనివల్ల మరింత సమర్థంగా, మహా ప్రశాంతంగా కర్మల్ని నిర్వర్తిస్తాం. ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుంది. పని వేగవంతం అవుతుంది. దానివల్ల నీకూ మంచిది, నీ సంస్థకూ మంచిది, సమాజానికి కూడా మంచిది.
-------------------------------
సమస్త ప్రాణుల్లోని ఆత్మా, తన ఆత్మా ఒకటేనని తెలుసుకోగలిగితే... ఏ కర్మలూ బంధించ లేవు. అలాంటివారి మనసు శుద్ధంగా ఉంటుంది. ఇంద్రియాలు కూడా ఏమీ చేయలేవు. ఆ మనో వికాసమే కర్మయోగానికి తొలిమెట్టు.
ధర్మబద్ధంగా నీ కర్మని నువ్వు నిర్వర్తించకపోతే స్వధర్మం నుంచి పారిపోయినట్టే. దీనివల్ల కీర్తి నశిస్తుంది, జనం నీవైపు వేలెత్తిచూపుతారు. ఆ పరిస్థితి మరణం కంటే బాధాకరం.
కోపంలోంచి అవివేకం పుడుతుంది. అవివేకం కారణంగా మతిమరుపు మొదలవు తుంది. ఆ ప్రభావంతో బుద్ధి నశిస్తుంది. దీంతో మనిషి పతనం సంపూర్ణం అయినట్టే.
భగభగ మండుతున్న నిప్పు, కట్టెలని ఎలా బూడిద చేస్తుందో, జ్ఞానమనే అగ్ని కూడా సమస్త కర్మల్నీ భస్మం చేస్తుంది. సృష్టిలో కర్మయోగానికి సమానమైంది లేదు.
కామం, క్రోధం, లోభం ఈ మూడూ. నరక ద్వారాలు. మనిషి పతనానికి కారణం అవుతాయి. వాటి నుంచి బయటపడిన మనిషి సర్వోన్నతుడు అవుతాడు.
నమ్రత, నిగర్వం, అహింస, ఓర్పు, నిజాయతీ, గురుసేవ, శారీరక-మానసిక శుభ్రత, ఇంద్రియ నిగ్రహం, అహంభావం లేకపోవడం, బంధాలకు అతీతంగా ఉండటం.. ఇవన్నీ వికాసానికి సోపానాలు.
శుభ్రత, నిరాడంబరత్వం... మొదలైనవి శారీరక తపస్సులు. సత్యాన్ని మాట్లాడటం, వికాసాన్ని కలిగించే సంభాషణలు జరపడం, ఉత్తమ గ్రంథాల అధ్యయనం ... వాక్కుతో చేసే తపస్సులు. ప్రశాంతమైన చిత్తం, మనో నిగ్రహం, చక్కని భావాలు. మానసికమైన తపస్సులు.
Beautiful and lovely 💐💐💐
ReplyDelete