బెండమూరి లంక - వంశీకృష్ణ
బెండమూరి లంక ప్రొద్దున్నే నిద్ర లేవటం అనేది అప్పట్లో బొత్తిగా అలవాటు లేని పని. కానీ ఇక్కడ తప్పక లేవాల్సిన పరిస్థితి. నిద్ర లేచి కాలకృత్యాలు అయ్యిన తర్వాత చేసే పని బలే ఇష్టంగా ఉండేది . అదే బయట పెరట్లో నీళ్లు కాచుకోవటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి . ఈ ప్రదేశం కోనసీమ కావటం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దైనందిన జీవితంలో ఏ పని అయినా కొబ్బరి చెట్టు నుంచి వచ్చే సరకులతోనే జరిగేవి . మచ్చుకి కొబ్బరి కాయల పైన ఉండే కొబ్బర్తి డొప్పలతో మరియు ఎండబెట్టిన కొబ్బరి చిప్పలతో నీళ్లు కాచుకోవటం . అముజూరులో కూడా ఈ నీళ్లు కాచుకునే కార్యక్రమం ఉండేది కానీ నిత్యం ఉండేది కాదు . ఇక్కడ నిత్యం ఉండేది . అప్పటి కాలం శీతకాలమేమో ప్రొద్దున్నే లేచి పొయ్యి ఎదురుగుండా కూర్చుంటే భలే వెచ్చగా ఉండేది. కొబ్బరి దొప్పలతో వచ్చే మంట గురుంచి పెద్దగా చెప్పేది ఏమి ఉండేది కాదు కానీ కొబ్బరి చిప్పలు మండుతున్నప్పుడు వాటి మధ్యనుంచి ఒక నీలి మంట సర్రు మని వచ్చేది . ఆ శబ్దం మరియు కాంతి చూడటానికి భలే ఉండేది . అచ్చం గ్యాస్ పొయ్యిమీద వచ్చే నీలి రంగులా ఉండేది . అది చూసి నేను గ్యాస్ సిలిండర్ లో ఉండే పదార్థానికి , కొబ్బరి చిప్పలకి ఏదో...