బెండమూరి లంక - వంశీకృష్ణ
బెండమూరి లంక
ప్రొద్దున్నే నిద్ర లేవటం అనేది అప్పట్లో బొత్తిగా అలవాటు లేని పని. కానీ ఇక్కడ తప్పక లేవాల్సిన పరిస్థితి. నిద్ర లేచి కాలకృత్యాలు అయ్యిన తర్వాత చేసే పని బలే ఇష్టంగా ఉండేది . అదే బయట పెరట్లో నీళ్లు కాచుకోవటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి . ఈ ప్రదేశం కోనసీమ కావటం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దైనందిన జీవితంలో ఏ పని అయినా కొబ్బరి చెట్టు నుంచి వచ్చే సరకులతోనే జరిగేవి . మచ్చుకి కొబ్బరి కాయల పైన ఉండే కొబ్బర్తి డొప్పలతో మరియు ఎండబెట్టిన కొబ్బరి చిప్పలతో నీళ్లు కాచుకోవటం . అముజూరులో కూడా ఈ నీళ్లు కాచుకునే కార్యక్రమం ఉండేది కానీ నిత్యం ఉండేది కాదు . ఇక్కడ నిత్యం ఉండేది . అప్పటి కాలం శీతకాలమేమో ప్రొద్దున్నే లేచి పొయ్యి ఎదురుగుండా కూర్చుంటే భలే వెచ్చగా ఉండేది. కొబ్బరి దొప్పలతో వచ్చే మంట గురుంచి పెద్దగా చెప్పేది ఏమి ఉండేది కాదు కానీ కొబ్బరి చిప్పలు మండుతున్నప్పుడు వాటి మధ్యనుంచి ఒక నీలి మంట సర్రు మని వచ్చేది . ఆ శబ్దం మరియు కాంతి చూడటానికి భలే ఉండేది . అచ్చం గ్యాస్ పొయ్యిమీద వచ్చే నీలి రంగులా ఉండేది . అది చూసి నేను గ్యాస్ సిలిండర్ లో ఉండే పదార్థానికి , కొబ్బరి చిప్పలకి ఏదో అవినాభావ సంబంధం ఉందని అనుకునేవాడిని . అనుకోవటమే కాదు కొబ్బరి చిప్పల తోనే గ్యాస్ తయారు చేసి సిలిండర్ లోకి ఎక్కిస్తారని కన్ఫర్మ్ కూడా చేసేశాను.
ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ తినటమంటే రోజులో ఏదో పెద్ద విషయమేదో కోల్పోతున్నట్టు ఒక ఫీలింగ్. అందువల్ల అముజూరులో ఒక్కో రోజు ప్రొద్దున్న టిఫిన్ దగ్గర చాలా గొడవాలు జరిగేవి ఎందుకంటే తాతగారి గురించి ఇంచుమించు ప్రతీ రోజు ఇడ్లీ వేసేవారు. కానీ ఇక్కడ మారు మాటాడకుండా తినేసి బడికి వెళ్లిపోయేవాడిని. మధ్యాహ్నం ఇంతకు ముందు చెప్పినట్టు ట్యూషన్ కి మాస్టారి ఇంటికి వెళ్లి వచ్చేవాడిని . ఒక రెండు రోజులు అలా వెళ్లిన తర్వాత నాతో ఉండే పిల్లలు నేను వెళ్లే దారి దూరమని, ఒక దగ్గర దారి ఉందని అటు తీసుకు వెళ్లారు . ఈ అడ్డ రూటు ఒక పెద్ద జీడి మామిడి తోటలోంచి వెళుతుంది . అప్పటి వరుకు పెళ్లిళ్లలో జీడి పప్పు, ములక్కాడ కూర తినటం తెలుసు కానీ జీడి పప్పు అసలా ఎలా వస్తుంది అన్న విషయం తెలీదు. నాకు అదే మొదటి సారి జీడీ మామిడి తోటలోంచి వెళ్ళటం. అలా వెళ్ళేటప్పుడు చెప్పారు.. కాదు కాదు.. చూపించారు జీడి మామిడికాయని దాని కింద ఉన్న జీడి పప్పుని, నాకు భలే ఆశ్చర్యమనిపించింది. అప్పుడు వాళ్లు నాతో నేను కింద పడిన ఒకటి లేదా రెండు ఇంటికి తీసుకువెళ్లొచ్చని , అంతకు మించి తీసుకెళ్లవద్దని, చెట్టు మీద నుంచి అసలా ఎప్పడు కోయద్దని. ఎందుకంటే అక్కడ కాపలా ఉండే అతను అంత మంచోడు కాదని.
జీడిపండు తిని చూస్తే మొదట చాలా బాగుంది తీపిగా. నేను అదేపనిగా తినేస్తుంటే, ఎక్కువ తినొద్దని వాళ్లు చెప్పినా వినలేదు. పైగా చేతిలో ఉన్నా రెండోది కూడా కక్కుర్తి పడి తినేశానేమో ఇంటికి వెళ్ళేటప్పటికి గొంతు అంతా మొత్తం దురద కింద వచ్చేసి బొంగురు పోయినట్టు అయిపోయింది . అసలు ఫన్ యాక్టివిటీ ఏంటంటే ఏరుకొచ్చిన రెండు జీడీ పప్పులని ప్రొద్దున్న నీళ్ళు కాచుకుంటునప్పుడు కాల్చుకుని తినటం. జీడిగింజని పొయ్యిలో వెయ్యగానే గుప్పుమని వచ్చే ఆ వాసన చెప్పనలవి కాదు. స్వయానా వాసన పీల్చాల్సిందే . బాగా కాలిన తర్వాత పైన షెల్ ని బద్దలు కొడితే అందులో యమ్మీ జీడిపప్పు ఉంటుందన్నమాట. అది నోట్లో వేసుకుంటే వచ్చే అనుభూతి అనిర్వచనీయం. అయితే అర్థమయ్యినదేమిటంటే జీడిపప్పుని గుట్టుగా కాల్చుకుని తినటం అలవికాని పని అని .
సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సర్వ సాధారణంగా కరెంటు ఉండేది కాదు . చెప్పటం మరిచాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అత్తయ్యతో పాటు పద్మక్క ఉంది . తర్వాత కొన్ని రోజులకి వాసు అన్నయ్య కూడా వచ్చాడు . అన్నయ్య బాల్కి అనే చోట ఇంజనీరింగ్ చదివాడని గుర్తు . ఆ పేరు అలా గుర్తుండి పోయింది విచిత్రంగా ఉండటం వల్ల . అప్పటి వరుకు నాకు తెలియని ఒక విషయం ఏంటంటే కుటుంబం అంతా ఒక చోట కూర్చుని మాటాడుకోవటం . మావయ్యగారు రేడియో పెట్టేవారు .మేమందరం ఆ సమయంలో పక్కనే కూర్చుంటే, ఆ రోజు అసెంబ్లీ లో జరిగిన చర్చాగోష్టి గురించి క్లుప్తంగా చెపితే మావయ్యగారు కొన్ని విషయాలు చెపుతూ ఉండేవారు . అదే సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ ఇండియా టూర్ కి వచ్చి మనల్ని ఏకి పారేసింది . అప్పట్లో నాకు గిరజాల జుట్టు ఉండటం వల్ల నేను వెస్ట్ ఇండీస్ వెళితే అందరూ నా రంగు చూసి ఎంత తెల్లగా ఉన్నాడో అనుకుంటారని, నేను అక్కడ పెద్ద అట్రాక్షన్ అయిపోతానని ఆట పట్టించేవారు. పైగా నన్ను అక్కడకి పంపించేస్తానని అనేవారు సరదాగా. నేను మొదట్లో ఉడుక్కునేవాడిని . కానీ పోను పోనూ నేను కూడా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ముఖ్యంగా పెద మావయ్యగారిని నవ్వుతుండగా చూడటం చిన్నప్పుడు చాలా అరుదు . మావయ్యగారు నవ్వు నాకు చాలా బాగా నచ్చేది . ఎందుకంటే అందరిలా నవ్వేవారు కాదు.
భోజనం చేసిన తర్వాత రాత్రికి తొందరగానే పడుకునే వాడిని . అక్కడకి వచ్చిన రెండు రోజుల తర్వాత పద్మక్క చెప్పింది ఒక తేలు రాత్రి పడుకున్నప్పుడు పెద్ద అత్తయ్య మీద పడి కుట్టిందని .వీలైతే దుప్పటి బాగా కప్పుకుని పడుకోమని. ఆ దెబ్బకి అప్పటి వరుకు దుప్పటి మీద పెద్దగా దృష్టి పెట్టని నేను పైనుంచి క్రింద వరుకు దుప్పటి కప్పి , రెండు చివరల అంటే కళ్ల కింద, తల కింద లాక్ చేసి పడుకునేవాడిని . ఆల్మోస్ట్ మమ్మీ లెక్క. ఇది ఎంత భయ్యాన్ని క్రియేట్ చేసిందంటే అర్ధరాత్రి కరెంటు పోయి, ఉక్కపెట్టి, చెమట పట్టినా దుప్పటి మాత్రం తీసేవాడిని కాదు. ఇప్పటికీ నేను దుప్పటి మొత్తం కప్పుకుని పడుకోపోతే అదో విధమైన ఇబ్బంది. ఈ మధ్యనే కొంచెం ఈ అలవాటు పోగొట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అంత వీజీ కాదు.
—————————————
బెండమూరి లంక - పాఠశాల పాలిటిక్స్
ముందే చెప్పినట్టు ఒక పూట బడికి వెళ్లేవాడిని. బడిలో ఆల్మోస్ట్ రాయల్ ట్రీట్మెంట్ ఉండేది. కాకపోతే మావయ్యగారి దగ్గర ఉన్నప్పుడు లేదా మిగతా టీచర్లు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే . ఇది కొత్తగా బయట నుంచి వచ్చి చేరినప్పుడు పైగా ఒక ప్రివిలేజ్ తో జాయిన్ అయ్యినప్పుడు ఎవరికైనా ఒక విధమైన ఫ్రిక్షన్ ఉంటుంది మిగతా పిల్లలతో. ఏ స్కూల్ లో అయినా . ఇక్కడా అలాగే జరిగింది. నాకు ఒక్కోసారి ఏమి అనిపించేదేమిటంటే మావయ్యగారి మీద ఉండే భయం అంతా వీళ్లు నన్ను బయటివాడిలా ట్రీట్ చేయటం ద్వారా తీర్చుకుంటున్నారని.
ప్రతీ తరగతిలోనూ వయసుకి పైబడి ఏపుగా పెరిగిన ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. అలాగే అక్కడ కూడా ఉండేవాడు . వాడే గ్యాంగ్ లీడర్. నేనంటే వాడికి ఇష్టం లేదని నాకు చాలా త్వరగా తెలిసింపోయింది. అవకాశం వచ్చినప్పుడల్లా అది చూపించేవాడు. ప్రొద్దున ఇంటర్వెల్ లో లేదా ఉదయం తొందరగా వెళితే కబడ్డీ ఆడుతూ ఉండేవారు. నేను అముజూరులో కబడ్డీ ఆడేవాడిని కానీ మరీ అంత కాదు . నా సమయం అంతా క్రికెట్ కు, షటిల్ కి కేటాయించేవాడిని. నాకు ఎందుకో ఫిజికల్ గా ఒకరిని ఒకరు తోసుకుంటూ ఆడే ఆటలంటే అస్సలా నచ్చేది కాదు. పైగా ఆట దగ్గరికి వెళ్లినప్పుడలా రెచ్చగొట్టినట్టు మాటాడేవారు ఆడమని. ఆడితే స్పాట్ పెడతారని అర్థమయ్యేది కానీ వాళ్లు అలా రెచ్చగొడుతుంటే ఎమోషన్స్ అలలులా పైకి కిందకి ఎగిసిపడేవి. ఒక వారం రోజులు ఆటని బాగా గమనించి, సేఫ్ గా ఈ ఆట ఎలా ఆడచ్చో లెక్కవేసుకుని ఒక పది రోజుల తర్వాత బరిలోకి దిగాను .
నన్ను ఎప్పడు గ్యాంగ్ లీడర్ వాళ్ళ టీమ్ లో ఆడనిచ్చేవాడు కాదు. రోజులు గడిచే కొద్దీ పెద్దగా రిస్క్ లేకుండా నేను కూడా బాగానే ఆడటం మొదలుపెట్టాను . నెమ్మదిగా ఫ్రెండ్స్ అవ్వటం మొదలుపెట్టారు. కానీ వీడు మాత్రం ఏదో తగాదా ఉన్నట్టే చూసేవాడు. ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత నేను కూతకి వెళ్లినప్పుడు నన్ను పట్టుకుని నేను దొరికిపోయిన తర్వాత కూడా నా రెండు కాళ్లు పట్టుకుని బర బరా లాగేశాడు మ. ఇక్కడ సమస్య ఏంటంటే నేను కింద కూర్చుంటే ఎక్కడ బట్టలు దుమ్ము కొట్టుకు పోయి , చిరిగిపోతాయేమోనని అరచేతులు రెండూ నేల మీద ఆనించి వాడు కాళ్లు వదిలేవరుకు చేతులతోనే నడిచాను. ఇది అంతా కేవలం లిప్తపాటు కాలంలో జరిగిపోయింది. లెగిచి చూసుకునేటప్పటికీ అరచేతులు రెండూ కొట్టుకుపోయాయి. జరిగింది అర్థమయ్యి వాడికి చెమటలు పట్టాయి . ఇది కనుక మావయ్యగారి వరుకు వెళితే విషయం మామూలుగా ఉండదని తెలుసు.
ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. మావయ్యగారికి కూడా. ఆ తర్వాత రెండు రోజులు వాడు స్కూల్ కి రాలేదు. మూడో రోజు వచ్చి అంతా నార్మల్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఉంటాడు. ఆ రోజు నుంచి నాతో అలా ఉండటం మానేశాడు . పైగా నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులలోనే మంచి ఫ్రెండ్ కింద అయిపోయాడు . కానీ ఆరోజు నుంచి నన్ను ఎవరు కబడ్డీ ఆడదామని పిలవలేదు . నేను కూడా వెళ్లి ఆడలేదు. అది నాకు జీవితంలోనే ఒక పెద్ద గుణపాఠం అయ్యింది. అందువల్ల ఈ అనుభవం తర్వాత చదువుల్లో నాకు ఎవరు బద్ధ శత్రువులు అనేవారు లేకుండా చేసింది. మొదట్లో నాతో ఎవరు ఎలా ఉన్నా, సమయం ఇస్తే అన్నీ చక్కదిద్దుకుంటాయని తెలియటం వల్ల, అలాగే చేసేవాడిని. అన్నీ అలాగే అయ్యినాయి కూడా.
చివరిగా కొసమెరుపు ఏమిటంటే అరచేయి కొట్టుకుపోయినా ఒక్క అన్నం మెతుకు, చారు చుక్క, మసాలా ముద్ద అర చేతికి తగలకుండా కేవలం వేళ్ళతో ఒక వారం రోజులు తిన్నప్పుడు ప్రొఫెషనల్ ఈటర్ గా నాకు మంచి భవిష్యత్తు ఉండబోతుందని చూచాయగా తెలిసింది.
---------------------
బెండమూరి లంక - హారీ పోటర్
చిన్నతనంలో ఉండే ఒక గొప్ప వరం ఏంటంటే పరిస్థితి ఎలాంటిది అయినా దానికి తగ్గట్టుగా మన దినచర్యని మార్చేసుకుని ఆనందాన్ని చవిచూడటమే . ఎందుకంటే క్రికెట్ ఉధృతంగా ఆడుతున్నప్పు చేతిలో బాట్ తీసేసుకున్నారు , ఎప్పుడూ ఉండే స్నేహితులు లేరు , షటిల్ కోర్ట్ లేదు అయినా సరే నా లెవెల్లో నేను కొన్ని సర్దుబాట్లు చేసుకుని నెమ్మదిగా రొటీన్లో పడటానికి ప్రయత్నించాను . సఫలమయ్యాను కూడా . అదే ఆదివారం సాయంత్రం లేదా సెలవరోజు సాయంత్రం జనాల్ని పోగేసి ఆడే ఏడు పెంకులాట .
ఇది ఏడు పెంకులాట గురించి తెలియని వారికి . చాలా సింపుల్. దీనికి ఒక బాల్ (బాలు ఎంత మెత్తగా ఉంటే ఆట అంత ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట), ఏడు పెంకులు (పెంకులంటే అసలు పెంకులు కాదు.. ఆ పెంకులు ముక్కలైతే వచ్చే పెంకు ముక్కలు), రెండు జట్లు. రెండు జట్లు అటు ఇటు నిలబడి మధ్యలో ఏడు పెంకులు ఒక దానిమీద ఒకటి పేరుస్తారు . ఒక జట్టు బాలుతో పెంకులు పడగొడుతుంది. ఎవరైతే పడగొట్టారో ఆ జట్టు మళ్ళీ పెంకులన్నీ యధావిధిగా పెట్టాలి. రెండో జట్టు వాళ్లు కొట్టిన బంతిని పట్టుకుని, ఎదుటి జట్టు పెంకులన్నీ పెట్టక ముందే ఎదుటి జట్టులో వాడిని బాలుతో కొట్టాలి. కొడితే వాళ్లు నెగ్గినట్టు. కొట్టకముందే పెంకులన్నీ పెట్టేస్తే రెండో జట్టు నగ్గినట్టు . ఇందులో అంతులేని స్ట్రాటజీస్ ఉన్నాయి. చిన్నతనంలో ఒక సింహ భాగం ఈ ఆటలోనే గడిపేసి ఉంటాను. అంత రక్తి కట్టించే ఆట.
ఆట మన ఇంటి బయట మెయిన్ రోడ్ పక్కనే. ఒక్క బెండమూరి లంక బస్ తప్ప పెద్దగా పట్టించుకునే వాహనాలేమీ వచ్చేవి కావు. ఆట మొదలయ్యింది. మేము పెంకులు పెట్టాలి . నాకు దగ్గరలోనే బాల్ వచ్చేసింది. వాడు బాలుతో ఎక్కడ వీపు విమానం మోగిస్తాడో అని వెనక్కి చూస్తూ పరుగు పెడతా ముందుకి తిరిగేటప్పటికీ మంచి క్యాస్ట్ ఐరన్ తో పూత పోసిన ఐరన్ పోల్. బ్రేక్ వేద్దామన్న పెద్దగా ఫలితం లేని సిట్యుయేషన్. మరుక్షణం నా నుదురు పోలుకి పిడక లెక్క అంటుకుపోయింది . మొట్ట మొదటి సారిగా ఒక చెప్పనలవి కాని అనుభూతి. ఒక పెద్ద శబ్దం బుర్ర అంతా వ్యాపించింది. అది కూడా బుద్దిస్ట్ మాంక్ దగ్గర ఉండే బొచ్చు మీద ఒక కర్రతో కొట్టి, చుట్టు తిప్పుతా ఉంటే శబ్ద తరంగాలు అలా వ్యాపిస్తున్నట్టు (ఈ వివరణ అప్పట్లోది కాదు . రాజేష్ దగ్గర మొన్నామధ్యన చూసినప్పుడు “ఓ ఇదే కదా బెండమూరి లంకలో ఆ సౌండ్ “అని ఠక్కున గుర్తుకు వచ్చింది). కళ్లు మూసుకుంటే నక్షత్రాలు కనపడటం అనేది కూడా ఆ రోజే తెలిసింది. టామ్ అండ్ జెర్రీలో లాగా. కానీ స్పృహ ఉంది. పోలుని గుద్దుకున్నానని తెలుస్తుంది . కాకపోతే ‘ఏం పర్లేదు.. ఏం పర్లేదు’ అన్నా స్టేజీ లో ఉన్నా. ఈ అంత సేపు కళ్ళు మూసుకునే ఉన్నాను. కళ్లు తెరిచి చూసేటప్పటికి వేసుకున్నా తెల్లటి చొక్కా ఎర్రగా మారిపోయింది. చిక్కని రక్తం నోట్లోకి వెళ్లిపోయి నోరు అంతా ఉప్ప ఉప్పగా అయిపోయింది . ఇంకో రక్తపు ధార కుడి చేయి మీదుగా, కుడి చేతి చివర నుంచి వాటర్ ఫాల్ లాగా కిందకి జల జలా పారుతోంది. అంత రక్తాన్ని అలా చూసేటప్పటికి కళ్లు తిరిగాయి.
ఎవరు చెప్పారో తెలీదు కానీ పెద్ద అత్తయ్య బయటికి పరిగెత్తుకుని వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, అందరినీ పిలుస్తూ ఏడవటం మొదలుపెట్టింది. అత్తయ్యని అలా చూసేటప్పటికి నాకు చాలా భయ్యం వేసింది. అందరూ సపర్యలు చేసారు . గుడ్డ కట్టారు. శరీరంలో ఉన్న కె విటమిన్ దాని పని చేయటం మొదలుపెట్టింది. మొత్తానికి రక్తం గడ్డ కట్టింది. సెలవులకి వచ్చిన వాసు అన్నయ్య ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్లాడు. వార్త అందింది. సైకిల్ మీద నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు . డాక్టర్ గారు చూసి కుట్లు వేసేద్దామన్నారు. అప్పటి వరుకు మా ఊరి పంచయితీ బోర్డు దగ్గర టైలర్ షాపులో ఖాజా కట్టడం చూసిన అనుభవం ఉందేమో, అలా కుట్టేస్తారామోనని టెర్రర్ మొదలు అయ్యింది. డాక్టర్ కుట్లు వేస్తే మచ్చ పడదు అని , వేయటం మంచిదని చెప్పాడు. నేను ఇంక వాసు అన్నయ్యని “దొరా..నీ కాళ్లు మొక్కుతా “అన్న లెవెల్లో ప్రాధేయ పడితే భయపడుతున్నానని నీ ఇష్టం అని వదిలేశాడు. హమ్మయ్య అని కుదుట పడ్డాను. తర్వాత ఏమయ్యిందో, ఎలా తగ్గిందో కొంచెం మాత్రం కూడా గుర్తు లేదు.
కుట్లు వేయకపోవటం వల్ల పడిన ఆ మచ్చ హ్యారీ పాటర్ లెక్క నా నుదుటి మీద బెండమూరి లంక గుర్తుగా ఉండిపోయింది. సాధారణంగా నా మొహం నేను అద్దంలో ప్రత్యేకించి చూసుకోను. కానీ ఎప్పుడైనా చూసుకుంటే తప్పకుండా ఈ మచ్చని ఒకసారి చూసుకుని కూడా, ఇంకా బెంగ కలిగితే ఒక సారి వేళ్ళతో తడుముకుంటాను. ఒలింపిక్ మెడలే ఉండక్కరలేద్దు చూసుకోవటానికి. ఇలాంటివి ఒకటి రెండు ఉంటే చాలు అనిపిస్తుంది.
Comments
Post a Comment