Mahatma Gandhi మహాత్మా గాంధీ (తొలిచూపు))

 బాపు తొలిచూపు!

గాంధీ ఆ పేరే పరమమంత్రమై స్వాతంత్య్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపింది. అభేద్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసింది..

సత్యాగ్రహం...
ఆ సూత్రం సామాన్యుల్ని అహింసా యోధుల్ని చేసింది. సత్యా నికి పరమోన్నత స్థానం కల్పించింది.

సత్యశోధన...
ఆ ఆత్మకథ ఎన్నో జీవితాల్ని మార్చింది, ఎందరి ఆలోచనల్నో సరిదిద్దింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో 'మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్' ఒకటి.

ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో, వేదికల మీదో వ్యక్తిగత చర్చల్లోనో- ప్రతి నిమిషం...ఏదో ఓచోట, ఎవరో ఒకరు మహాత్ముడిని తలుచుకుంటూనే ఉంటారు. టైమ్స్ పత్రిక 'ఈ శతాబ్దపు స్ఫూర్తిప్రదాత' ఎవరని ప్రశ్నించినప్పుడు ...ప్రపంచం చెప్పిన తొలి రెండు పేర్లలో ఒకటి - గాంధీజీ!

ఆరేడు దశాబ్దాల తర్వాత కూడా... ఆయన పేరూ, ఆయన బోధనలూ, ఆయన రచనలూ ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయంటే - నేరుగా చూసిన వారు ఇంకెంత సమ్మోహితులై ఉండాలి!

జీవితాన్ని మార్చే భేటీ అది, కర్తవ్యాన్ని తట్టిలేపే కరచాలనం అది, పరుసవేది లాంటి పలకరింపది, చూపులైతే స్ఫూర్తి తరంగాలే! నెహ్రూ, పటేల్, వినోబా...ఆ అదృష్టం ఏ కొద్దిమందికో దక్కింది. అయితేనేం, వారివారి ఆత్మకథల్లో అధ్యాయాలు గానో, డైరీల్లో పేజీలుగానో... చదివి తరించే అవకాశాన్ని మనకిచ్చింది
------------------------
నమ్మకం కలిగింది!
సరోజినీ నాయుడు:
'గాంధీగారు లండన్ వస్తున్నారట' - ఎవరో చెప్పారు. మరుక్షణమే, నా చూపులు క్యాలెండరు మీదికి వెళ్లాయి. ఎలాగైనా ఆయన్ని కలవాణి, మాట్లాడాలి. ఎన్నాల్లో వేచిన ఉదయం రానేవచ్చింది. నేరుగా ఓడరేవుకే వెళ్లామనుకున్నా, కుదర్లేదు. ఏదో ముఖ్యమైన పని అడ్డు తగిలింది. సాయంత్రానికంతా ఆయన బస చేసిన లాడ్జీకి బయల్దేరా. అదేమంత ఖరీదైన ప్రాంతం కాదు. గదులు కూడా ఇరుకుగా అనిపించాయి. మెట్లెక్కి పైకెళ్లగానే... ఎదురుగా గాంధీజీ! జైళ్లలో ఖైదీలకిచ్చే నల్లటి బొంతలానిటి దానిమీద కూర్చుని ఫలహారం చేస్తున్నారు. ఫలహారమంటే, అవేవో కమ్మని గుజరాతీ రుచులు కాదు. టమాటా ముక్కలూ, ఆలివ్ నూనె, పల్లీలూ, ఇంకేవో కలుపుకుని తింటున్నారు. అలికిడికి తల పైకెత్తారు. 'మిసెస్ నాయుడు కదూ!' - ముందే సమాచారం పంపడంతో, సులభంగానే గుర్తుపట్టారు. తన ముందున్న చెక్క గిన్నెను నా వైపు జరిపారు 'తీసుకో...' అంటూ! మొహమాటంతో 'అబ్బే... వద్దండీ!' అన్నా. అయినా వదల్లేదు. రెండు ముక్కలు నోట్లో వేసుకున్నా. రుచించలేదు. ప్రపంచ రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం అనడం కంటే, వింటూ కూర్చున్నా అంటేనే బావుంటుందేమో! దూదాపుగా నాది ప్రేక్షకపాత్రే! ఆయన ఆలోచనల్లో చాలా స్పష్టత ఉంది. అహింస మీద అపారమైన విశ్వాసం ఉంది. దక్షిణాఫ్రికాను ప్రయోగశాలగా చేసుకుని, సత్యాగ్రహశక్తిని నిరూపించారు కూడా. తొలి సమావేశంలోనే... భారత స్వాతంత్య్ర పోరాటాన్ని లక్ష్యం వైపు తీసుకెళ్లగల శక్తి ఆయనకు ఉందన్న నమ్మకం కలిగింది. అప్పటికే చీకటిపడటంతో 'నమస్తే.. వెళ్లొస్తాను' అంటూ చేతులు జోడించాను. మరొక్కసారి, ఆ చెక్కగిన్నెను నాముందు పెట్టారు. ఎందుకో, ఈసారి ఆ ఫల హారం మహాద్భుతంగా అనిపించింది. ఆ కొద్ది గంటల వ్యవధిలో నాలో వచ్చిన మార్చునకు అది ప్రతీక కావచ్చు.

------------------------
ఆ ప్రశ్నే జీవితాన్ని మార్చింది!
- బాబు రాజేంద్రప్రసాద్

త్యాగాలకు సిద్ధంగా ఉన్నావా?' -తొలి సమావేశంలోనే గాంధీజీ సూటిగా అడిగిన ప్రశ్న ఇది. ఎదుటివాళ్లను ప్రశ్నలతో ఇరుకున పెట్టడమే నాకు తెలుసు. అలాంటి నేనే ముద్దాయిలా తడబడాల్సి వస్తుందని ఊహించలేదు. అప్పటికే పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నిలదొక్కుకున్నా. రాబడి బాగానే ఉంది. ఇంకా కష్టపడాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి... అన్న ఆరాటం ఉండేది. నా వృత్తే నా ప్రపంచం, కాంగ్రెస్ కార్యక్రమాల్ని మాత్రం నిశితంగా గమనిస్తూ ఉండేవాడిని. గాంధీజీ మీద ప్రత్యేకించి ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడలేదు. సరిగ్గా అప్పుడే, చంపారన్ రైతుల ఉద్యమం మొదలైంది. వాళ్లను కలవడానికి గాంధీజీ వస్తున్నారని తెలిసింది. ఆయనకు హిందీ ఓమోస్తరుగానే తెలుసు. సహాయకులు ఉంటే బావుంటుందని ... నన్నూ మరికొందరు న్యాయవాదుల్నీ సాయంగా వెళ్లమన్నారు. కాదనడానికి కారణం కనిపించలేదు. ఆయనా బారిస్టరే కాబట్టి, తొలి పరిచయంలో ఏవైనా చట్టపరమైన విషయాలు చర్చకు వస్తాయేమో అనుకున్నా. ఆయన మాత్రం అనూహ్యమైన ప్రశ్నను. సంధించారు. ఏం జవాబు చెప్పాలి? అంతకుముందే ఒకరిద్దరు నాయకులు రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. ప్రస్తుతానికి వీలుపడ దని కచ్చితంగా చెప్పేశాను. గాంధీగారి దగ్గర మాత్రం అంత నిర్మొహమాటంగా వ్యవహరించలేకపోయాను.

గతంలో ఓసారి బాపూజీని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమ యానికి ఆయన ఏదో సమావేశంలో ఉన్నారు. బయటి ఊల్లో నాకూ కోర్టు పనులు ఉండటంతో వేచి చూడకుండా, డకుండా, వెళ్లిపోయాను. గాంధీ జీతో వచ్చిన ఓ స్నేహితుడు, నేను ఊళ్లోనే ఉన్నాననుకుని మా బంగళాకు తీసుకొచ్చాడు. ఆ ముతక గుడ్డలూ బోడిగుండూ చూసి, మా నౌఖరు గాంధీగారిని ఏ పల్లెటూరి కక్షిదారో అనుకున్నాడు. పెరట్లోని పాత సామాన్ల గదిలో కూర్చోమని చెప్పాడు. ఆ విషయం తెలిసిన ఓ కాంగ్రెస్ నాయకుడు, పరుగుపరుగున వచ్చి తనింటికి తీసుకెళ్లిపోయాడు. ఆతర్వాత తెలిసింది ఇదంతా! నౌబరును చడామడా తిట్టేశాను. అయినా, బాధ వదల్లేదు. వీలైనంత తొందరగా మహాత్ముడికి క్షమాపణలు చెప్పాలని తీర్మానించుకున్నాకే.. మనసు కాస్త కుదుటపడింది. కొన్నాళ్లకి ఆ సంగతే మరచిపో యాను. ఓ సమావేశంలో తనే, 'మీరు లేరనుకుంటా, మీ ఇంటి కొచ్చానోసారి... అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంత నిర్మల హృదయం ఆయనది.

గాంధీజీతో కలసి చంపారన్లో పర్యటించిన రోజులు నా జీవి తంలో అతి ముఖ్యమైనవి. ఒకట్రెండు రోజులకని వెళ్లినవాడిని.. నెలలు గడుస్తున్నా అక్కడే ఉండిపోయాను. పోరాటం ఓ కొలిక్కి వచ్చాకే తిరుగుప్రయాణం అయ్యాను. అదీ అన్యమనస్కంగానే. వెళ్లాక కూడా, మనసంతా మహాత్ముడి చుట్టే తిరిగేది. కేసులూ కోర్టులూ సంపాదనా చాలా చిన్న విషయాల్లా అనిపించాయి. పూర్తి స్థాయిలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. మరో ఆలోచన లేకుండా, సహాయ నిరాక రణ ఉద్యమంలోకి దూకేశాను.

గాంధీజీలోని నిరాడంబరత నన్ను బలంగా ప్రభావితం చేసింది. భారత తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు... ఓ ప్రజా సేవకుడికి అంత జీతం అవసరమా అనిపించింది. అందులో సగం కంటే తక్కువే తీసుకోవాలని తీర్మానించాను. అది త్యాగం కాదు, బాధ్యత, గాంధీజీ సాహచర్యంలో అలవడిన సంస్కారం: మహాత్ముడు నా జీవితంలో తారసపడకపోయి ఉంటే, నేను ఓ మామూలు న్యాయవాదిగా మిగిలేవాడినేమో.


------------------------
అపోహ తొలగించారు
-చార్లీ చాప్లిన్

కాసేపట్లో గాంధీజీ వచ్చేస్తారని ప్రకటించారు. నేను కూర్చున్న గదిలో కోలాహలం మొదలైంది. దాంతో పాటే నా మనసులోనూ. గాంధీజీతో భేటీ ఖరారైన రోజు నుంచీ ఓ ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఆయనతో ఏం మాట్లాడాలి? దక్షిణాఫ్రికాలో వివక్ష గురించా, భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం గురించా, అహింసా విధానం గురించా, లేకపోతే... యంత్రాల పట్ల ఆయన వ్యతిరేకత గురించా? నేనేం మేధావిని కాదు. నా చిన్నిబుర్రకు ఇంతకు మించి ఏమీ తట్టడం లేదు. అంతలోనే గాంధీజీ వచ్చారు. నేరుగా నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఆత్మీయంగా కరచాలనం చేశారు. ఆ నవ్వులో ఏదో మహత్యం ఉంది. 'భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల నాకు సానుభూతి ఉంది. నా మద్దతు మీకే...' అని హృదయపూర్వకంగా చెప్పాను. కృతజ్ఞతగా నవ్వారు. 'కానీ, యంత్రాల్ని మీరు దయ్యాల్లా భూతాల్లా చూడటమే నాకు నచ్చడం లేదు...' ఫిర్యాదు చేస్తున్నట్టుగా మాట్లాడాను.

'కాదుకాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను యాంత్రికశక్తికి వ్యతిరేకం కాదు. ఆ యంత్రాల్ని అడ్డం పెట్టుకుని మానవశక్తిని గెలవాలనుకునే సామ్రాజ్య వాద శక్తులకే నేను వ్యతిరేకం. మనిషి శ్రమను తగ్గించే యంత్రమంటే నాకెప్పుడూ గౌరవమే' అంటూ నా సందేహం తీర్చారు. నిజమే, ఇప్పటిదాకా నేను ఆలోచించని కోణమిది.

నిజానికి, నేను షూటింగ్ లతో తీరికలేకుండా ఉన్నా. ఓ దశలో అయితే, సమావేశాన్ని రద్దు చేసుకోవాలన్న ఆలోచనా వచ్చింది. ఎందుకో, చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఇక్కడికొచ్చా. గాంధీజీని కలవకపోయి ఉంటే, ఓ మహావ్యక్తిని మరోలా అర్థం చేసుకుని ఉండేవాడిని. ఒకానొక అపోహ జీవాతాంతం వెంటాడేది.


------------------------
ఆయనొక హిమశిఖరం...
- వినోబా భావే
నాకు హిమాలయాలంటే ఆరాధనాభావం. బెంగాల్ అంటే గౌరవం. ఒకటి ప్రశాంతతకు ప్రతిరూపం, మరొకటి విప్లవాల గడ్డ.

గాంధీజీని తొలిసారిగా చూసినప్పుడు... ఒకేసారి, ఆ రెండూ నాకళ్ల ముందు మెదిలాయి. ఆయనో ప్రశాంత విప్లవం! సత్యాగ్రహానికి సంబంధించి నాకు కొన్ని సందేహాలు ఉండేవి. నా మనసులోని ఆలో చనలతో ఓ ఉత్తరం రాశాను. 'కొన్ని ప్రశ్నలకు సమాధానం లేఖల్లో లభించదు. వీలుచూసుకుని రండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం' అని జవాబిచ్చారు. లేఖతో పాటు ఆశ్రమ నిబంధనల్ని తెలిపే కరప త్రాన్ని జతచేశారు. రైలుబండిలో అహ్మదాబాద్ బయల్దేరాను. తెల్లారే లోపు ఆశ్రమానికి చేరుకున్నాను. స్నానం ముగించుకుని బాపూ దర్శనానికి వెళ్లాను. నేను వెళ్లే సరికి కూరగాయలు తరుగుతూ కూర్చున్నారు. ఓ జాతీయ నాయకుడిని అలా చూడటం ఎంతగా అనిపించింది. గదిలోకి వెళ్లగానే పలకరింపుగా నవ్వారు. నా చేతికీ ఓ కత్తి ఇచ్చారు. బొత్తిగా తెలియని వ్యవహారమది. అయినా ప్రయ త్నించాను. ఫర్వాలేదు, కాసేపటికి పనిమీద పట్టు వచ్చింది. ఆశ్చర్యం! అప్పటి దాకా మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. 'ఇక్కడి వాతావరణం నచ్చిందా? నీ జీవితాన్ని దేశసేవకు అంకితం చేస్తావా?' అంటూ తనే సంభాషణ ప్రారంభించారు. నేను మౌనంగా తలూపాను. అంతలోనే ఎవరో రావడంతో, సంభాషణ మ రోవైపు మళ్లింది. ఆశ్రమంలో బాపూ అప్పగించిన ప్రతి పనినీ శ్రధ్ధగా చేసే వాడిని. నా దృష్టిలో పాకీ పని అయినా, ప్రార్ధన అయినా ఒకటే. ప్రార్ధనలో నన్ను నేను మరచిపోయినట్టే. పాయిఖానాల్ని శుభ్రం చేస్తున్నప్పుడూ ఆ పనిలో తాదాత్మ్యం చెందేవాడిని, వంటశాలలోనూ చురుకైన పాత్ర నాదే. ఆ సమయంలో పొడిపొడి మాటలు తప్పించి, మహాత్ముడితో సుదీర్ఘ సంభాషణలేం జరగలేదు. ఓ ప్రార్ధన సమా వేశంలో నన్ను వేదిక మీదికి పిలిచి.. అన్ని మతాల్లోని మంచినీ వెలికి తీయమని ఆదేశించారు. దీంతో నా అరకొర సంస్కృత పాండిత్యానికి మెరుగులు పెట్టుకున్నాను. వేదాల్నీ ఉపనిషత్తుల్నీ లోతుగా అధ్య యనం చేశాను. అనువాదాల మీద ఆధారపడకుండా ఖొరాన్ చదవాలన్న ఉద్దేశంతో అరబిక్ నేర్చుకున్నాను. బాపూ మాట నిజమే! ప్రతి ధర్మం ఓ విజ్ఞాన భాండాగారమే.

గాంధీజీ సాహచర్యం, ఆశ్రమ జీవితం... నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. కాలినడకన దేశమంతా చుట్టిరావాలన్న సంకల్పానికి అదే ప్రేరణ. వందల మైళ్ల ప్రయాణంలో ఎంతోమందిని కలుసుకున్నాను. ఎన్నో కష్టాల కథలు తెలుసుకున్నాను. తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో దళితుల బాధలు విన్నప్పుడు 'భూదానోద్యమ' భావన ప్రాణం పోసుకుంది. పేదల జీవితాల్ని మార్చేశక్తి జానెడు నేలకు మాత్రమే ఉందని స్పష్టమై పోయింది. ఓ కొత్త నినా దంతో నా ప్రయాణం మొదలైంది. ఆ ఆలోచనకూ అంకురం అతడే, మహాత్ముడే!


------------------------
స్థితప్రజ్ఞుడు...
-పరమహంస యోగానంద
స్వాగతం... - అక్షరాలు కుదురుగా లేవు. కానీ, ప్రేమగా రాసి నట్టు ఉన్నాయి. ఆరోజు సోమవారం. గాంధీజీ మౌనవ్రతంలో ఉంటారు. ఏం చెప్పాలనుకున్నా రాతల్లోనే. చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాను. ఆశ్రమ సిబ్బంది మమ్మల్ని విడిది గదికి తీసుకెళ్లారు. బడలిక తీర్చుకునేలోపు భోజనానికి పిలుపు వచ్చింది. చపాతీలూ, ఉడకబెట్టిన కూరగాయలూ, ఒకట్రెండు పండూ వడ్డిం చారు. గాంధీజీ వేపాకులు వడ్డించుకున్నారు. నా పళ్లెంలోనూ కొన్ని వేశారు. ఆ చేదును ఆయన చాలా ఇష్టంగా ఆస్వాదించారు. ప్రజా జీవితం అంటే కత్తిమీద సాము. మన చర్యల్ని ప్రశంసించే వారు ఉంటారు, విమర్శించేవారూ ఉంటారు. అన్నింటినీ సమా నంగా స్వీకరించాలి. చేదునైనా సంతోషంగా మింగాలి. వేపాకును నమిలినట్టు. ఆ స్థితప్రజ్ఞత గాంధీజీలో పరిపూర్ణంగా కనిపించింది. సాయంత్రానికి మౌనదీక్ష విరమించారు. మేమిద్దరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. సెలవు తీసుకుని నా గదికి వస్తుంటే, వేపనూనె లాంటిదేదో చేతిలో పెట్టారు, 'ఎందుకైనా మంచిది ఒంటికి రాసుకోండి. వార్ధాలోని దోమలకు అహింసా సూత్రాలు తెలియవు' అంటూ. చక్కని హాస్యస్పృహ! 'హాస్యాన్ని ప్రేమించే గుణం లేకపోతే, నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని' అని ఆయనే చెప్పినట్టు గుర్తు. మరుసటి రోజు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు.. 'సెలవు స్వామీజీ!' అంటూ నిండుగా నవ్వారు. తొలి పరిచయంలోనే, మహాత్ముడిలోని అచ్చమైన మనిషి నన్ను అమితంగా ఆకర్షించాడు.


------------------------
ఏదో ప్రత్యేకత కనిపించింది!
-జవహరలాల్ నెహ్రూ

అప్పుడు జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. నాన్న మోతీలాల్ వెంట నేనూ బయల్దేరాను. నా దృష్టిలో నాయకు డంటే నాన్నే! వందమందిలో అయినా గుర్తించగలిగేంత స్ఫుర ద్రూపం. ఉపన్యాసశైలి కూడా మహాగంభీరంగా ఉండేది. సమావేశ మందిరం దగ్గర నాన్న నన్ను గాంధీజీకి పరిచయం చేశారు. అదే తొలిసారి కలుసుకోవడం. అప్పటికి నా వయసు ఇరవై ఏడు, ఆయన వయసు నలభై ఏడు. దక్షిణాఫ్రికాలో పోరాటాన్ని అందరూ ప్రశంసించారు. నేను కూడా అలాంటి మొక్కుబడి మాటలేవో మాట్లాడాను. తొలిచూపులోనే, 'ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది' అనిపించింది. ఆ ప్రత్యేకత ఏమిటన్నది తెలియడానికి మాత్రం చాలా సమయం పట్టింది. గాంధీజీ పరిచయమైన సమయానికి నేను ఓరకమైన అయోమయంలో ఉన్నాను. 'భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే పోరాటం తప్పనిసరి. కానీ, అది ఏ 'మార్గంలో ఉండాలి?' అన్న విషయంలో నాకు ఓ స్పష్టత రాలేదు. బాంబు దాడులూ హింసాత్మక చర్యలూ ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేవని నా విశ్వాసం. అంతిమంగా ఆయన బోధించిన సత్యాగ్రహ మారం మీద గురికుదిరింది. మరో ఆలోచన లేకుండా గాంధీజీ వెనకాలే నడిచాను. ఆ బంధం... ఒక్కరోజులో బలపడింది కాదు. మాట్లాడుతున్నకొద్దీ, దగ్గరవుతున్నకొద్దీ అర్థమవుతూ వచ్చారు. భర్తృహరి ఓ మాట అంటారు - సజ్జను లతో స్నేహం సాయంకాలపు ఎండలా... ఆలస్యంగా మొదలైనా స్థిరంగా ఉంటుంది. మా అనుబంధమూ అలాంటిదే.
------------------------
ఎవరితోనూ పోల్చలేం!
- లార్డ్ మౌంటుబాటెన్ 
'ప్రియ నేస్తమా...' ఎంత చక్కని పిలుపు! ఆ మాట నన్ను కట్టి పడేసింది. ఆ చిన్న సంబోధనతో నేను గాంధీజీని ఆత్మీయుల జాబితాలో చేర్చేశాను. మీడియా మా తొలి సమావేశం మీద చాలా ఆశలే పెట్టుకుంది. దేశ భవిష్యత్తును మార్చే భేటీ అంటూ కథనాలు రాసింది. నిజానికి, అలాంటిదేం జరగలేదు. చాలా సాధారణ విషయాలు చర్చించుకున్నాం. ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు అతనిలోని 'లోపలి వ్యక్తి'ని అంచనా వేయడం నా అలవాటు. గాంధీజీ విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదు. ఆయన బయటికి ఎలా కనిపిస్తారో, లోపలా అలానే ఉంటారు. మహాత్ముడిని సాధారణ రాజకీయ నాయకులతో జతకలపలేం. 

ఆయనో పరిపూర్ణ సాధువు. మరుసటిరోజు మళ్లీ కలుసుకున్నాం. ఈసారి ఓ ప్రతిపాదన నా ముందు ఉంచారు. మహ్మద్ ఆలీ జిన్నాకు పాలన బాధ్యతలు అప్పగిస్తే అయినా దేశ విభజన ఆగిపోతుందేమోనని ఆయన ఆరాటం. గాంధీజీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. 'కాంగ్రెస్ ” ను ఒప్పించగలరా?' అని అడిగాను. అది అసాధ్యమని ఆయనకూ తెలుసు. ఆ నిమిషంలో నాకెందుకో, యుద్ధం అనివార్యమని తెలిసినా రాయబారానికి వెళ్లిన కృష్ణుడు గుర్తుకొచ్చాడు. ఫలాలతో నిమిత్తంలేని కర్మయోగమది. సాయంత్రణ జరిగిన తేనీటి విందులో... అంతా వేడివేడి టీ రుచిచూస్తుంటే, ఆయన మాత్రం తనతో తెచ్చుకున్న మేకపాల పెరుగును గిన్నెలో పోసుకుని తిన్నారు. నాకూ కొంత ఇచ్చారు. నా జీవితంలో చాలామంది నాయకులే తారసపడ్డారు. గాంధీజీని మరొకరితో పోల్చలేం ...దేశంలోనూ, ప్రపంచంలోనూ!

------------------------
ఆ సంఘటన కదిలించింది!
- సర్దార్ వల్లభభాయ్ పటేల్
న్యాయవాదిగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నా. ప్రతి వాదుల్ని ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తానన్న పేరు వచ్చేసింది. స్వతహాగా నాకు దూకుడెక్కువ. రోజూ సాయంత్రం గుజరాత్ క్లబ్కెళ్లి, కాసేపు బ్రిడ్జి అడేవాడిని. ఆట సాగుతున్నంత సేపూ చేతిలో సిగరెట్టు ఉండాల్సిందే. 'గాంధీజీ వస్తున్నారు. ఆయన ఉపన్యాసం వినడానికి రావట్లేదా? పక్కగది లోనే...'" అటుగా వెళ్తున్న ఓ పెద్దమనిషి అడిగాడు. 'ఉపన్యాసాలు వినే తీరిక నాకు లేదు కానీ, ఇంకో ఆట వేసుకుందాం రండి! అయినా, ఆయనేం చెబుతారో నాకు తెలుసులే!' అంటూ ఆ పెద్దాయన్ని ఆపబోయాను. చేతులు అడ్డంగా ఊపుతూ వెళ్లిపోయారు. నా ప్రయత్నం లేకుండానే, గాంధీజీ ఉపన్యాసం నా చెవుల్ని తాకింది. నా మనసుకూ ఎక్కింది. ఎంచుకున్న మార్గం మీద ఆయనకున్న నమ్మకం గొప్పగా అనిపించింది. క్రమక్రమంగా గాంధీజీ నా ఆలోచనల్లో భాగం అయ్యారు. భేడా జిల్లాలో వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయాయి. రైతులు వీధిపాలు అయ్యారు. అంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. భూమిశిస్తును రద్దు చేయాల్సింది పోయి, నయా పైసా కూడా తగ్గించేదిలేదని పట్టుబట్టి కూర్చుంది. యువకుడిగా నన్ను కదిలించిందా సంఘటన, నిజనిర్ధారణ సంఘం సభ్యుడిగా తోటి న్యాయవాదులతో కలసి అక్కడికెళ్లాను. గాంధేయమార్గంలో పోరాడమని రైతులకు సలహా ఇచ్చాను.

కూతవేటు దూరంలో ఉన్నా వెళ్లి కలవలేకపోయినవాడిని, పక్కనే ఉపన్యాసం జరుగుతున్నా వెళ్లి కూర్చోలేకపోయినవాడిని... దిశానిర్దేశం కోసం గాంధీజీని వెతుక్కుంటూ మైళ్లకు మైళ్లు వెళ్లాను. వెళ్తూవెళ్తూ.... సూటూ బూటుతో పాటూ అహాన్నీ వది లేశాను. ఖద్దరు దుస్తుల్లో, చేతులు జోడించి ఆయన ముందు. నిలబడ్డాను.

------------------------
1976. అచ్చుతప్పు కాదు. పందొమ్మిది వందలా డెబ్బై ఆరే! థామస్ బర్ అనే ఓ యువకుడు గాంధీజీని దర్శించుకున్నాడు.

ఒంటి మీద కొల్లాయి, ముతక ఖద్దరు కండువా, గుండ్రని కళ్లజోడు, బోడిగుండు, చేతిలో కర్ర... ఆ రూపం విచిత్రంగా అనిపించినట్టుంది. ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అందుబాటులో ఉన్న సాహిత్యమంతా చదివాడు. ఆసక్తి అధికమైంది. అధ్యయనం పెరిగింది. ఆతర్వాత, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. మహాత్ముడి మీద అనేక రచనలు చేశాడు. 'గాంధీ, గాంధీయిజం అండ్ ద గాంథియల్స్', 'గాంధీ యాజ్ డిసైపుల్ అండ్ మెంటార్'... ఆ జాబితాలో కొన్ని. ప్రపంచమంతా తిరిగి గాంధేయవాదం మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు.

...అతడు దర్శించుకుంది మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలోని మహాత్ముడి మైనపు బొమ్మని!

గాంధీజీ తన జీవితకాలంలో లక్షల మందిని పలకరించి ఉంటాడు. కోట్లమందికి దర్శనమిచ్చి ఉంటాడు. ఉపన్యాసాల ద్వారా మరెన్నో కోట్ల మందిని చేరి ఉంటాడు. కానీ, కొన్ని జీవితాలే ఎందుకు అపారంగా ప్రభావితం అయ్యాయంటే.. ఆ కొందరే ఆయనలోని దార్శనికుడిని చూశారు కాబట్టి! తొలిచూపు... కేవలం కళ్లకు సంబంధించిన వ్యవహారం కాదు... హృదయనేత్రంతో ముడిపడిన విషయం.

ఆ దృక్కోణం అలవడిన రోజున మైనపుబొమ్మలోనూ మహా త్ముడు కనిపిస్తాడు, బోసినవ్వులు నవ్వుతాడు, ప్రేమగా పలకరిస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు.


Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

రామాయణ దృక్పథం

బెండమూరి లంక - వంశీకృష్ణ