Gandhi- My Experiments with Truth (ఆత్మకథ లేక సత్యశోధన)

 మోహన్ దాస్ కరమ్ చంద్ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా మహాత్ముడిగా మారారు! 'నాకు సాధ్యమైంది. మీకూ సాధ్యమౌతుంది' అంటూ తన ఆత్మకథ ద్వారా మనల్ని సత్యశోధనకు ప్రోత్సహిస్తున్నారు గాంధీజీ.

విలువల వాచకం!


ఆత్మకథ లేక సత్యశోధన (మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్)


.ఈ పుస్తకాన్ని గాంధీజీ 1925 ప్రాంతంలో గుజరాతీలో రాశారు. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికి ముద్రణలూ పునః ముద్రణలు వస్తున్నాయి. గురువులు శిష్యులకూ కన్నవారు పిల్లలకూ కానుకగా ఇస్తున్నారు. చదివితీరాల్సిన పుస్తకంగా రేపటి మేనేజర్లకు సిఫార్సు చేస్తున్నాయి బిజినెస్ స్కూళ్లు. ప్రపంచంలోని వంద అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. ఏటా రెండు లక్షల కాపీలు సునాయాసంగా అమ్ముడవుతున్నాయి. అన్ని భాషలూ కలిపి, ఇప్పటిదాకా యాభై లక్షల ప్రతులు విక్రయించినట్టు అంచనా మేనేజ్మెంట్, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త పుస్తకాలు వస్తున్నా, 'టెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముని ఆత్మకథ. స్థానం మాత్రం చెక్కు చెదర లేదు.


ఎందుకింత ఆదరణ! 'సత్యశోధన'లో ఏం ఉంది?. వస్తు వైవిధ్యమా, అద్భుత శిల్పమా, సంచలనాత్మక వ్యాఖ్యలా, నాటకీయ మలుపులా, నరాలుతెగే ఉత్కంఠా... ఊహూ! ఏ ఒక్కటీ లేవు.  పైపైన తిరగేస్తే ఓ గంటలో అయిపోతుంది. ఏకబిగిన చదివేస్తే ఓ పూటలో పూర్తవుతుంది. అలా అని, 'సత్యశోధన చదివి పడేయాల్సిన గ్రంథం కానేకాదు. ఇదో సైన్సు పాఠ్యపుస్తకం లాంటిది. ముందు శ్రద్ధగా చదవాలి, ఆతర్వాత ఆ సూత్రాల్ని ఆకళింపు చేసుకోవాలి. మలి దశలో, మనల్ని మనం గాజునాళికగా మలుచుకుని సత్యంతో ప్రయోగాలు చేయాలి. సత్య ప్రయోగాలతో రాటుదేలిన వ్యక్తి మహాత్ముడు కావచ్చు, కాకపోనూవచ్చు. కానీ పరిపూర్ణుడైన మనిషి అవుతాడు. బిడ్డగా, తండ్రిగా, భర్తగా, ఉద్యోగిగా, వ్యాపారిగా విలువల వెలుగులు పంచుతాడు.


'అయినా, ఎనిమిది దశాబ్దాల నాటి ఆత్మకథను ఇప్పుడెందుకు చదవాలి? నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు.. 'అని ప్రశ్నించేవారూ ఉన్నారు. నిజమే. కాలం మారింది, సమాజం మారింది. రాజకీయాలు మారాయి ఒకటేమిటి ప్రపంచమే మారిపోయింది. కానీ, సత్యం మారలేదు, మారదు కూడా. సూర్యుడిలా, చంద్రుడిలా... సత్యానికి కాలదోషం లేదు. కాబట్టే, అప్పుడెప్పుడో గాంధీజీ సత్యశోధన ద్వారా ఆవిష్కరించిన నిరాహారదీక్షలూ పాదయాత్రలూ సహాయ నిరాకరణలు నేటికీ ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊతమిస్తున్నాయి. గాందేయసూత్రాలే ఇతివృత్తంగా తీసిన 'అగేరహో మున్నాబాయ్', 'సత్యాగ్రహ' వంటి చిత్రాలు అపార ప్రేక్షకాదరణ పొందాయి. మహాత్ముడి విలువల సూత్రాల్ని వ్యాపార ప్రపంచమూ సవినయంగా స్వీకరించింది -కార్పొరేట్ సామాజిక బాధ్యత, గ్రామీణ మార్కెట్పై దృష్టి, ఖాతాదారుల పట్ల గౌరవం... ఇవన్నీ గాంధేయ సూత్రాల్లో భాగమే. గ్లోబల్ సీయీవోల సర్వేలో ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకడిగా మహాత్ముడికి ఓటేశారు అగ్రశ్రేణి చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, యువతరం గాంధీజీ బోధనలతో కొత్త స్ఫూర్తిని పొందుతోంది.


సర్వోదయ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ ప్రదర్శనలో, గాంధీజీ ఆత్మకథను కొన్నవారిలో 70 శాతం మంది 30 ఏళ్లలోపు యువతీ యువకులే www.mkgandhi.in వెబ్ సైటుకు రోజూ మూడువేల క్లిక్కులు వస్తే... అందులో 90 శాతానికి పైగా యువతమే నైతికతలేని సినీతారలూ బెట్టింగుల క్రికెటర్లూ అవినీతి రాజకీయ నాయకులూ ఏ ఒక్కరిలోనూ ఆదర్శమూర్తిని వెదుక్కోలేకపోయిన యువత, ఆ బోసినవ్వుల తాతయ్యలోనే నవతరం నాయకుడ్ని గుర్తించిందేమో అనిపిస్తుంది. ఈ సందడంతా చూస్తుంటే! అపనమ్మకాలు, విశ్వాసఘాతుక చర్యలు, స్వార్థం, అర్థంలేని వస్తు వ్యామోహం- ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు గాంధీజీ ఆత్మకథలో పరిష్కారం ఉంది. విద్యార్హతలూ, హోదా, సంపాదనా, ఆస్తి పాస్తులూ ఓ మనిషిని గౌరవించడానికి ఇవేవీ కొలమానాలు కావంటారు గాంధీ.


ఎదుటి మనిషిని ఆత్మరూపంగా, సత్య స్వరూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవరచుకోగలిగితే మానవ సంబంధాలతో ముడిపడిన తొంభై శాతం సమస్యలు పరిష్కారం అయినట్టే అహం మంచులా కరిగిపోయినట్టే.


ప్రగతి ప్రచురణ సంస్థ సంపాదకుడు పి.రాజేశ్వరరావు నాలుగు దశాబ్దాల క్రితం మహాత్ముని ఆత్మకథను చదివారు. జీవితకాల ప్రభావాన్ని నింపిందా పుస్తకం. అప్పట్నుంచీ ఎంతోమందితో కొనిపించారు. ఎంతోమందితో చదివించారు. విశాలాంధ్ర తరపున లక్ష కాపీలు విక్రయించారు. వేమూరి రాధాకృష్ణమూర్తి అనువాదాన్ని కొన్ని మార్పులతో పునఃముద్రించారు. 'గాంధీజీ ఆత్మకథలో విద్యార్థులూ ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ సామాజిక కార్యకర్తలూ రాజకీయ నాయకులూ... తమతమ జీవితాలకు అన్వయించుకుని, లోపాల్ని సరిదిద్దుకోడానికి ఉపయోగపడే ఎన్నో అంశాలున్నాయి. సమాజంలో మంచిని పెంచాలనుకునే వారంతా తప్పక చదవాల్సిన పుస్తకమిది' అని సిఫార్సు చేస్తారాయన.


సంక్షిప్త సారం...


'గాంధీ కుటుంబం వారు మొదట కిరాణా సరుకులు అమ్ముకునేవారని ప్రతీతి. కానీ మా తాతగారి పూర్వులు కథియవాడుకు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పని చేశారు'... అన్న తాత ముత్తాతల పరిచయంతో గాంధీజీ ఆత్మకథ మొదలవుతుంది. కస్తూరీ బాయితో పెళ్లి, తండ్రి మరణం, ఇంగ్లండ్ ప్రయాణం, దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తి, జాతివివక్ష వ్యతిరేక ఉద్యమం, భారత దేశానికి రాక చంపారన్ పోరాటం, సహాయ నిరాకరణ, నాగపూర్ కాంగ్రెస్ సమావేశం 1921 దాకా మహాత్ముడి జీవితానికి సంబంధించిన కీలక మలుపులన్నీ ప్రస్తావనకు వచ్చాయి.


'ఆ తరువాత, నా జీవితం పూర్తిగా ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియనిదంటూ ఏమీ మిగల్లే'దన్నారు. తన జీవిత కథంతా పూసగుచ్చినట్టు ప్రపంచానికి చెప్పాలన్న తహతహ ఆయనకు లేదు. తన గుణగణాల్ని వర్ణించుకోవాలన్న తపనా లేదు. ఏ ఒక్కటీ దాచుకోకుండా, తన సత్య ప్రయోగాలను వివరించాలన్నదే గాంధీజీ ఉద్దేశం, ఆత్మకథ లక్ష్యం కూడా. 'అహింస వినమ్రతకు పరాకాష్ఠ, వినమ్రతను అలవరచుకోనిదే ముక్తి లభించదు. ఆ వినమ్రత కోసం ప్రార్థిస్తూ అందుకు విశ్వ సహాయాన్ని యాచిస్తూ ముగిస్తున్నాను.... హరే రామ్' అంటూ తన ఆత్మకథను ముక్తాయించారు.


సత్యాలతో ప్రయోగం


సత్యానికి కట్టుబడి ఉండాలంటే, సత్యహరిశ్చంద్రుడే కానక్కర్లేదు. మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ లాంటి సామాన్యుడికైనా అది సాధ్యమే. అయితే బలమైన సత్యసంధత ఉండాలి. త్రికరణశుద్ధిగా సత్యవ్రతాన్ని స్వీకరించాలి. మద్యం ముట్టను, మాంసం తినను, స్త్రీల జోలికి వెళ్లను - అని కన్నతల్లికి మూడు వాగ్దానాలు చేస్తారు గాంధీ. మాంసం అనేది జీవన విధానంలో ఓ భాగమైన ఇంగ్లండు లాంటి దేశంలో ఆ మాటను నిలబెట్టుకోవడం కష్టం. దాదాపు అసాధ్యం కూడా. కానీ ఆయన కట్టుబడే ఉన్నారు. ఆకలిని భరించారు. అవమానాల్ని ఎదుర్కొన్నారు. మద్యం విషయంలో, మగువ విషయంలోనూ అలాంటి నిగ్రహమే. గాంధీజీ దృష్టిలో సత్యం అంటే... మాటకు సంబంధించింది. మాత్రమే కాదు. ఆలోచనలతో ఆచరణతో ముడిపడింది. కూడా. అహింస అయినా, బ్రహ్మచర్యమైనా, శాకాహారమైనా ఆ పరమసత్యంలో భాగాలే. సత్యం సూర్యుడైతే, ఇవన్నీ కిరణాలు.


సత్యం ఒకటే. పండితులు పరిపరి నిర్వచ నాలిస్తారు. ఆ సత్యాన్ని తెలుసుకోడా నికి కొందరు అడవులకెళ్తారు. కొందరు హిమాలయాలకు ప్రయాణం అవుతారు, ఇంకొందరు గురువుల చుట్టూ గుడుల చుట్టూ తిరుగుతారు. గాంధీజీ ప్రయోగ మార్గాన్ని ఎంచుకున్నారు. భోజన విధానంతో, అహింసతో, సత్యాగ్రహంతో, బ్రహ్మచర్యంతో రకరకాల ప్రయోగాలు చేశారు. వైఫల్యాల్ని సమీక్షించుకుంటూ లోపాల్ని అధిగమించు కుంటూ ముందుకెళ్లారు.


తీవ్రమైన వస్తు వ్యామోహం, ఆ వ్యామోహాన్ని తీర్చుకోడానికి క్రెడిట్ కార్డు వాడకాలు, స్థోమతకు మించిన వాయిదా చెల్లింపులు -ఆధునిక జీవితాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెలకు లక్షరూపాయలు సంపాదించే ఐటీ ఉద్యోగులూ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గాంధీజీ కూడా దాదాపుగా అలాంటి మోహంలోనే పడ్డారో దశలో. అదెంత తప్పో సత్యశోధనలో తెలుసుకున్నారు. రెండు గదుల నుంచి ఒంటిగదికి మారారు. హోటలు భోజనం నుంచి స్వయం పాకానికి వచ్చారు. 'జీవితం సరళం కావడం వల్ల సమయం మిగిలింది... నా జీవితం సత్యమైంది, నాకు ఆత్మతృప్తి మిగిలింది' అని సంతోషంగా చెప్పారు. వస్తు వ్యామోహం అనేది ఉప్పునీటి దాహం లాంటిది. తీర్చు కున్నకొద్దీ దప్పిక పెరుగుతుందే కానీ, తగ్గదు.


గాంధీజీ ఆహారంతో చేసిన ప్రయోగాలు నేటి సమాజాన్ని వేధిస్తున్న జీవనశైలి అనారోగ్యాలకూ ఊబకాయ సమస్యలకూ చక్కని పరిష్కారం. నిజానికి నాలుకకు రుచీపచీ తెలియదు. మెదడు నుంచి అందే సంకేతాల్ని బట్టే ప్రవర్తిస్తుంది. మెదడేమో మన ఆలోచనల్ని బట్టి స్పందిస్తుంది. అంటే, ఆలోచనే అసలు సిసలు రుచి! దృఢమైన సంకల్పంతో జిహ్వచాపల్యాన్ని జయించవచ్చని నిరూపించారు గాంధీజీ, 'ఇంటి నుంచి తెప్పించిన చిరుతిండ్లూ ఊరగాయలూ తినడం మానేశాను. మనసు మారినందువల్ల వాటిపై విరక్తి కలిగింది. నిన్న మొన్నటి దాకా నా జిహ్వకు చప్పగా ఉన్న మసాలా లేని బచ్చలి ఆకు, ఇప్పుడు మహారుచిగా ఉంది' అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. 


సత్యం ఆత్మదృష్టిని ప్రసాదిస్తుంది. దీనివల్ల బుద్ధి వికసిస్తుంది, ఆలోచనలు సువిశాలం అవుతాయి. దక్షిణ ఆఫ్రికాలోని మారిట్జ్బర్గ్ రైల్వేస్టేషన్లో ఎదురైన అవమానాన్ని మరొక రైతే... వ్యక్తిగతంగా తీసుకునేవారు. కానీ గాంధీజీ, దాన్ని ఒకానొక మహారోగానికి బాహ్య చిహ్నంగా భావించారు. ఆ సత్య శోధన కారణంగానే, మనసులో సత్యాగ్రహ బీజం మొలకెత్తింది. వివక్షకు వ్యతిరేకంగా అహింసా పోరాటం మొదలైంది. ఆ ధైర్యం, నాయకత్వ సామర్థ్యం, సమ్మోహకశక్తి - పరమ సత్యం ప్రతిబింబాలే.


"నేను న్యూజెర్సీలో పనిచేస్తున్నప్పుడు... మా సంస్థలో కొందరి మాటతీరూ స్వభావం ఇబ్బందికరంగా అనిపించేది. ఓ దశలో అయితే, మరో శాఖకు బదిలీ చేయించుకోవాలని అనుకున్నాను. అప్పుడే, ఆ బృందం లోని ఓ వ్యక్తి కాస్త దగ్గర అయ్యాడు. పేరు చాడ్. పరిచయం పెరిగాక, భారతదేశం గురించీ గాంధీజీ గురించీ చాలా ప్రశ్నలు అడిగాడు. నాకు తెలిసినంత మేరా చెప్పాను. చదవమంటూ నా దగ్గరున్న మహాత్ముని ఆత్మకథ ఇచ్చాను. మరుసటిరోజు నుంచి ఛాడ్ ఆఫీసుకు రావడం మానేశాడు. 'నీ పుస్తకం గోవిందా!' అంటూ సహోద్యోగులు ఆటపట్టించారు. ఏదో ఒకరోజు చాడ్ వస్తాడనీ, నా పుస్తకం నాకు తిరిగిస్తాడనీ గట్టిగా నమ్మాను. అది నా మీద నాకున్న నమ్మకం కాదు, పుస్తకం మీదున్న విశ్వాసం. ఆరునెలల తర్వాత... ఓరోజు ఇంటికి బయ ల్దేరుతుంటే, ఎవరో పేరుపెట్టి పిలుస్తున్నట్టు అనిపించింది. దగ్గరగా వెళ్లిచూస్తే ఛాడ్! మనిషిలో చాలా మార్పు వచ్చింది. శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు. కళ్లలో కొత్త కాంతి. తన భార్యాపిల్లల్ని పరిచయం చేశాడు. 'ఇంట్లో పిల్లాడికి పాలులేకపోయినా సరే, ఈయనకు మాత్రం మద్యం ఉండాల్సిందే. ఆ అలవాటుకు అంత బానిసై పోయాడు. నా మీద చేయి చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మీరు ఇచ్చిన పుస్తకంలో ఏం ఉందో నాకు తెలియదు... కానీ ఏదో ఓ గొప్ప సత్యం ఉందని నా నమ్మకం. అదే ఆయన్ని పూర్తిగా మార్చేసింది. మీకు కృతజ్ఞతలు. మీ పుస్తకానికీ కృతజ్ఞతలు' అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఛాడ్ భార్య. మహాత్ముని ఆత్మకథను అపురూపంగా అప్పగిస్తున్న ఆ యువకుడిని చూస్తుంటే '...సబ్ కో సన్మతి దే భగవాన్' అనిపించింది"- హంస అనే ప్రవాస భారతీయురాలి అనుభవం ఇది.


సత్యాన్ని మించిన భగవంతుడు లేడంటారు గాంధీజీ. మనం సత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు... లోలోపలి సత్యదేవుడు మనతో సంభాషించడం ప్రారంభిస్తాడు. అంతరాత్మ ప్రబోధం అంటే అదే. ఇక, ప్రలోభాలూ ఊరింపులూ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఏ నిర్ణయం తీసుకున్నా సత్యమే ప్రమాణం అవుతుంది. ధర్మమే కొలమానంగా నిలుస్తుంది.


నిక్కమైన నిజాయతీ

వ్యక్తి కథలు వేరు, ఆత్మ కథలు వేరు. ఆత్మకథ లుగా వస్తున్నవాటిలో చాలావరకూ వ్యక్తి కథలే. వ్యక్తి కథల్లో 'నేను' అన్న అహం ఉంటుంది. 'నాదీ' అన్న స్వార్థం ఉంటుంది. నిజమైన ఆత్మకథ అంతరాత్మ కేంద్రంగానే సాగుతుంది. రచయిత తననుతాను ఓ పాత్రగానే భావించుకుంటాడు. ఆ పాత్ర పట్ల మమకారమో వ్యామోహమో ఉండదు. ఓ విమర్శకుడిలా, పరిశీలకుడిలా తన చర్యల్ని తానే బేరీజు వేసుకుం టాడు. 'ఆత్మకథలో నా గురించి నేను తీర్పు చెప్పుకునే సమయంలో కాస్త కఠినంగానే వ్యవ హరించాను. పాఠకులూ అలానే వ్యవహరించా లని కోరుకుంటాను' అన్నారు గాంధీజీ. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా... సత్యశోధనలో ఎక్కడా సుదీర్ఘ సమాసాలూ సంక్లిష్ట ఉపమానాలూ ఉండవు. శైలి సాదాసీదాగా ఉంటుంది. అదే సమయంలో పదునుగానూ ఉంటుంది. మన మాటలో సత్యం ఉన్నప్పుడు, మన స్వరంలో స్పష్టత వస్తుంది. దానికి గాంభీర్యమూ తోడవుతుంది. అప్పుడిక 'హౌటు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్' వగైరా కృతక వికాస పుస్తకాల అవసరం ఉండదు. మనం సహజ నాయకులం అవుతాం.


మహాత్ముడు గొప్ప రచయిత కాదు. వకీలు వృత్తిలో ఉన్నప్పుడు, అర్జీలు రాయడానికి కూడా చేయి వణికిన సందర్భాలున్నాయి. అయితేనేం, కోట్లమంది ఆయన ఆత్మకథను చదివారు. గొప్ప ఉపన్యాసకుడు కూడా కాదు. రాజ్కోట్ హైస్కూలు వీడ్కోలు సభలో ముందే రాసుకొచ్చిన నాలుగు వాక్యాల్ని కూడా ధైర్యంగా పలకలేని వ్యక్తి.. గొప్పగొప్ప వేదికల మీద అనర్గళంగా మాట్లాడారు. ఆ ధైర్యానికి కారణం- సత్యమే!


నిష్పాక్షికత...

పెళ్లి, శోభనం, దాంపత్య జీవితం-ఏ ఒక్కటీ దాచుకోలేదు గాంధీజీ. శ్రవణుడి కథ, హరిశ్చంద్రుడి నాటకం తననెలా ప్రభావితుణ్ని చేసిందీ చెప్పుకున్నారు. ఓ దశలో మాంసాహారం అలవాటైంది. దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం అవసరమైంది. అప్పటికే ధూమపానాన్ని రుచి చూశారు. చిల్లర ఖర్చుల కోసం చేతివాటానికి అలవాటుపడ్డారు. వేశ్యావాటికలకు వెళ్లిన విషయాన్ని కూడా దాచుకోలేదు. తండ్రి చావుబతుకుల మధ్య ఉంటే, తాను కామకేళిలో మునిగిపోయిన సంగతీ ప్రకటించారు.


సత్యశోధన వెలువడే నాటికి గాంధీజీ మహాత్ముడిగా, జాతిపితగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తన జీవితంలోని ఇబ్బందికర సంఘటనల్ని చెప్పుకోవడం వల్ల... తన గౌరవానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయనకూ తెలుసు. అయినా తడబడకుండా చెప్పారు. కారణం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సత్యంతో ముడిపడిన ప్రతి విషయాన్నీ ఆత్మకథలో ప్రస్తావించితీరాలన్న నిబద్ధత. ఆ నిజాయతీ కారణంగా... ప్రపంచానికి బాపూ పట్ల గౌరవం రెట్టింపైంది.


పశ్చాత్తాపం...


నీటితో బురదను కడుక్కున్నట్టు... పశ్చాత్తాపంతో పాపాల్నీ లోపాల్నీ శుభ్రం చేసుకోవచ్చని నిరూపించారు గాంధీజీ. క్షమించలేనంత తీవ్ర అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ మహాత్ముడు... ఉత్తరాల రూపంలో సంబంధిత వ్యక్తుల్ని క్షమాపణ కోరారు. ధూమపానం కోసం, మాంసాహారం కోసం చేసిన అప్పుల్ని తీర్చడానికి అన్నయ్య చేతి బంగారు మురుగును కరిగించాల్సి వచ్చింది. ఆ దొంగతనం తర్వాత మనసులో ఓవిధమైన అలజడి మొదలైంది. తండ్రిని క్షమాపణ అడగాలనుకున్నారు. హృదయపూర్వకంగా ఓ ఉత్తరం రాశారు. ఆతర్వాత, ఇంగ్లాండులో తన పెళ్లి విషయం ఉద్దేశపూర్వకంగా దాచినప్పుడూ అలాంటి భావనే కలిగింది. ఆ వృద్దవనితకు కూడా సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ అనుభవాల్ని ప్రస్తావిస్తూ ‘నాలో ముదిరిన అసత్యమనే యీ వ్రణాన్ని తొలగించుకుని నయం చేసుకోగలిగాను' అని రాసుకున్నారో చోట.

నిత్య జీవితంలో చాలా తప్పులే చేస్తుంటాం- జీవితభాగస్వామి విషయంలో, పిల్లల విషయంలో, కన్నవారి విషయంలో, స్నేహితుల విషయంలో, సహోద్యోగుల విషయంలో. అసత్య భారాన్ని ఎంతకాలమని మోస్తాం? పశ్చాత్తాపంతో ఆ మరకల్ని తొలగించుకోవచ్చు. ఉపవాసాన్ని ఒక బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా భావించారు. బాపూ పశ్చాత్తాపం ఓ కరడుగట్టిన నేరస్థుడిని సత్యప్రబోధకుడిగా మార్చింది. లక్ష్మణ్ తుకారామ్ గోలే దోపిడీ, దొంగతనాలూ, హత్యా ప్రయత్నాలూ... ఇలా రకరకాల నేరాలపై జైలు శిక్షలు అనుభవించాడు. అలా ఊచల వెనుక ఉన్నప్పుడే, కాలక్షేపానికి మహాత్ముడి ఆత్మకథను చదివాడు. గాంధీజీ తన తప్పుల్ని తాను నిజాయతీగా ఒప్పుకున్న తీరు అతనికి నచ్చింది. పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకునే సత్యమార్గం ఆ రాతిగుండెను కరిగించింది. మరునిమిషం నుంచే గాందేయ వాదిగా మారిపోయాడు. జైలు నుంచి విడుద లైన తర్వాత... దేశమంతా పర్యటిస్తూ ఖైదీ లకు సత్య సూత్రాలు బోధిస్తున్నాడు.


అహింసా మార్గం...

కట్నం కోసం ఓ భర్త భార్యను చంపుతాడు, వారసత్వ ఆస్తుల కోసం ఓ కొడుకు తండ్రిని హత్యచేస్తాడు, పదవుల కోసం ఓ నాయకుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు... సమాజంలో ఎటుచూసినా రక్తపు ధారలే. ఎందుకింత హింస! ఆ గాయాల్ని నయం చేసుకోలేమా? సత్యం అనే గమ్యాన్ని చేరుకోడానికి అహింసే ప్రధాన మార్గమని భావించాడు మహాత్ముడు. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆ మార్గాన్ని వీడలేదు. 'సత్యాన్ని పాటించడం వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం తగ్గిపోతాయి. రాగద్వేషాలున్న వ్యక్తి సరళ హృదయుడే అయినా, సత్యమే పలుకుతున్నా... శుద్ధ సత్యాన్ని దర్శించలేడు' అంటారు గాంధీజీ.


బాపూ రాజకీయాల్లోనూ సత్యశోధన జరిపారు. ... నేను పూర్తిగా ప్రజాసేవలో లీనమైపోయాను. అందుకు కారణం, ఆత్మ సాక్షాత్కారాభిలాషే. ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే విశ్వాసంతోనే నేనీ సేవాధర్మాన్ని స్వీకరించాను' అని చెప్పారు. సాక్షాత్తూ సత్యానికి ప్రతినిధి అయిన వ్యక్తి నాయకత్వం వహిస్తే...ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి, భారత స్వాతంత్ర్య ఉద్యమమే సాక్షి


సత్యాన్ని స్వాగతించడానికి ...మన హృదయ ద్వారాల్ని ఎప్పుడూ తెరిచే ఉంచాలి. గాంధీజీ చేసిందీ అదే. భగవద్గీతను అధ్య యనం చేశారు. బైబిల్ చదివారు, ఖురాన్ గురించి తెలుసుకున్నారు, అన్ని ధర్మాలవారితో స్నేహంగా ఉన్నారు, శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకగా ఫోనిక్స్ ఆశ్రమాన్ని నడిపారు, ప్రకృతి వైద్యం చేశారు, రాట్నం తిప్పారు, ఎంతోమంది మహావ్యక్తుల్ని కలుసుకున్నారు, మరుగుదొడ్లు శుభ్రం చేశారు, పుస్తకాలు రాశారు- ఎన్ని అనుభవాలు, ఎన్ని ప్రయోగాలు!


ప్రతి అనుభవం ఒక సత్య సూత్రమే. 

ప్రతి ప్రయోగం ఒక సత్యావిష్కారమే.


‘’నీ సేవా ధర్మం, ప్రేమభావం ఎక్కడబడితే అక్కడ పుట్టుకు రావడానికి పుట్టగొడుగులేం కాదు. అవి లోపలి నుంచి పొంగుకు రావాలి. అందుకు, సాధన అవసరం’’


“భగవద్గీత ఓ ధార్మిక నిఘంటువు. పదాల అర్థం తెలుసుకోడానికి నిఘంటువును చూసినట్టే, ఆచరణకు సంబంధిం చిన కష్టాలూ కొరుకుడు పడని సమస్యలూ వచ్చినప్పుడు గీత ద్వారా పరిష్కరించు కోవచ్చు”


'ఏ వస్తువుకూ ప్రత్యేకమైన విలువ ఉండదు. దాని మీద మనకున్న వ్యామోహాన్ని బట్టే ఆ విలువ ఏర్పడుతుంది. వ్యామోహ తీవ్రతను బట్టి పెరుగుతుందీ, తగ్గుతుందీ’


“ఎవరికి ఎలాంటి ఆలోచన కలుగుతుందో, అలాంటి ఫలితమే లభిస్తుంది’’


“ఎక్కడ ఉదారత, ఓర్పు, సత్యం ఉంటాయో అక్కడ...భేదాభిప్రాయాల వల్ల ఏ మాత్రం చెడు జరగదు. ఎంతోకొంత మంచే జరుగుతుంది’


‘’ఈశ్వర సాక్షాత్కారానికి సేవ చాలా అవసరమని నా సత్యశోధనలో వెల్లడైంది’’


“మనసు నిండా కరుణను నింపుకోవడం, అతి చిన్న ప్రాణికి కూడా హాని కలగకుండా జాగ్రత్తపడటం అహింసా పూజారి లక్షణాలు”


బాపూ బాటలో... 

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రజా పోరాటాలకూ శాంతి ఉద్యమాలకూ మహాత్ముడే మార్గదర్శి.


గాంధీజీ బోధనలే నాకు స్ఫూర్తి. ఆయనే లేకపోతే, నేను అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచం ముందు నిలబడేవాణ్ణి కాదేమో!

బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు


నాకు నోబెల్ పురస్కారం ప్రకటించినప్పుడు ఓ పత్రిక నన్ను 'బర్మా గాంధీ'గా అభివర్ణించింది. నోబెల్ కంటే గొప్ప ప్రశంస అది! - అంగ్సాన్ సూకీ, మయన్మార్ నాయకురాలు


నన్ను గాయపరచినవాడు నా ముందు నిలుచున్నా... ఆ సమయంలో నా చేతిలో తుపాకీ ఉన్నా... నేను హింసకు పాల్పడను. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతమే నాకు ఆదర్శం.

- మలాలా, ఐరాస శాంతి ప్రచారకురాలు


బాపూ అహింసా మార్గం నాకే కాదు. ప్రపంచానికంతా దారి చూపింది. - దలైలామా, బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు


మహాత్ముడి అహింసా మార్గాన్ని బలంగా విశ్వసించే సాధారణ మహిళను నేను. నా పోరాటానికి ఆయనే నాయకుడు - ఇరోమ్ షర్మిల, మణిపూర్ ఉద్యమకారిణి


అమెరికాలో పెరిగిపోతున్న అవినీతికీ తీవ్రమౌతున్న ఆర్థిక వ్యత్యాసాలకూ నిరసనగా మేం చేపట్టిన 'వాలెట్ ముట్టడి' ఉద్యమా నికి మహాత్ముడే స్ఫూర్తి. ఆయన ఆధ్యాత్మిక నాయకత్వంలోనే పోరాడాం. - మర్సియో, ఉద్యమ నాయకుడు




Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

రామాయణ దృక్పథం

బెండమూరి లంక - వంశీకృష్ణ