అరవింద సమేత వీరరాఘవ చిత్ర సమీక్ష
జీఆర్ మహర్షి 13-Oct-2018 అరవింద సమేత సినిమా చూశాను. ఉదయం ఆట టికెట్లు దొరకలేదు. (ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్టామినా ఇది). మధ్యాహ్నం ఆటకి దొరికాయి. బయటకు వచ్చేసరికి అందరూ రివ్యూలు రాసేశారు. కొత్తగా ఏం రాయాలో అర్థంకాలేదు. ఆలోచిస్తే రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అనిపించింది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ రుచి చూసినవాన్ని. ఫ్యాక్షన్ గురించి రాసిన వాన్ని. ఫ్యాక్షన్‌కి సమీపంలో జీవించినవాన్ని. ఈ సినిమాలో హీరో పేరు వీరరాఘవరెడ్డి, వూరు కొమ్మద్ది. ఈ వూరు కడపజిల్లా వీరపునాయునిపల్లి మండలంలో ఉంది. తెరపైన ఎన్టీఆర్ ను చూసినపుడు నేను 26 ఏళ్ల క్రితం కొమ్మద్దిలొ కలుసుకున్న గంగిరెడ్డి గుర్తుకొచ్చాడు. ఆయన ఇంట్లో ఒకరిద్దరు కాదు ఆరుగురు హత్యకు గురయ్యారు. “పోయిన వాళ్లంతా పోయారు. ఉన్నవాళ్లు జైల్లో ఉన్నారు. ఇకచాలు… శాంతి కావాలి” అన్నాడు ఆయన. ప్రత్యర్థుల ఇంటికి వెళితే ఆ ఇంట్లో కూడా ఆరుగురు లేరు. ఒక మహిళకు బాంబు దాడిలో చెయ్యిపోయింది. ఆ ఇల్లు, ఈ ఇల్లు బాధని మోస్తూ జీవించింది. కాలం అనేక గాయాల్ని కడుగుతూ ప్రవహించింది. గంగిరెడ్డి ఇప్పటికీ అదే ఊళ్లో ఉన్నాడు. ఆయన పిల్లలు కడపలో ...