అరవింద సమేత వీరరాఘవ చిత్ర సమీక్ష
జీఆర్ మహర్షి
13-Oct-2018
అరవింద సమేత సినిమా చూశాను. ఉదయం ఆట టికెట్లు దొరకలేదు. (ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్టామినా ఇది). మధ్యాహ్నం ఆటకి దొరికాయి. బయటకు వచ్చేసరికి అందరూ రివ్యూలు రాసేశారు. కొత్తగా ఏం రాయాలో అర్థంకాలేదు. ఆలోచిస్తే రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అనిపించింది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ రుచి చూసినవాన్ని. ఫ్యాక్షన్ గురించి రాసిన వాన్ని. ఫ్యాక్షన్‌కి సమీపంలో జీవించినవాన్ని.
ఈ సినిమాలో హీరో పేరు వీరరాఘవరెడ్డి, వూరు కొమ్మద్ది. ఈ వూరు కడపజిల్లా వీరపునాయునిపల్లి మండలంలో ఉంది. తెరపైన ఎన్టీఆర్ ను చూసినపుడు నేను 26 ఏళ్ల క్రితం కొమ్మద్దిలొ కలుసుకున్న గంగిరెడ్డి గుర్తుకొచ్చాడు. ఆయన ఇంట్లో ఒకరిద్దరు కాదు ఆరుగురు హత్యకు గురయ్యారు.
“పోయిన వాళ్లంతా పోయారు. ఉన్నవాళ్లు జైల్లో ఉన్నారు. ఇకచాలు… శాంతి కావాలి” అన్నాడు ఆయన.
ప్రత్యర్థుల ఇంటికి వెళితే ఆ ఇంట్లో కూడా ఆరుగురు లేరు. ఒక మహిళకు బాంబు దాడిలో చెయ్యిపోయింది. ఆ ఇల్లు, ఈ ఇల్లు బాధని మోస్తూ జీవించింది. కాలం అనేక గాయాల్ని కడుగుతూ ప్రవహించింది. గంగిరెడ్డి ఇప్పటికీ అదే ఊళ్లో ఉన్నాడు. ఆయన పిల్లలు కడపలో స్థిరపడ్డారు. ప్రత్యర్థులు కూడా అదే గ్రామంలో ఉన్నారు.
చిన్న వయస్సులోనే తండ్రుల శవాల్ని చూసినవాళ్లు, భుజాల మీద ఎత్తుకు తిరిగిన మేనమామల శవాల్ని మోసినవాళ్లు , తెగిపడిన శవాల్ని మూటకట్టుకుని తెచ్చుకున్న వాళ్లు ఇంకా ఉన్నారు. గాయం మానిపోయి మచ్చగా మిగిలింది. వాళ్ల పిల్లలకి ఇది ఒక కథగానే తెలుసు.
ఇప్పుడు కొమ్మద్ది వూరి పేరుతో సినిమా వచ్చింది. గాయాల్ని మళ్లీ గుర్తు చేస్తున్నారని తండ్రిని పోగొట్టుకున్న ఓ వ్యక్తి నాతో ఫోన్‌లో అన్నాడు. అసలు సీమలో ఫ్యాక్షన్ మాయమై చాలా కాలమైంది. సినిమాల్లో మాత్రమే బతికి ఉంది.
గ్లోబలైజేషన్‌తో ప్రపంచం కుగ్రామమయ్యిందో లేదో నాకు తెలియదు గానీ, గ్రామాలే ప్రపంచంగా బతికిన వాళ్లంతా బయటకొచ్చి వేరే ప్రపంచాన్ని వెతుక్కున్నారు. అందరి డిఎన్ ఎలో డబ్బొచ్చి చేరింది. గుండె ఉండాల్సిన చోట రియల్ ఎస్టేట్ దిల్ వచ్చి తిష్టవేసింది.
ఫ్యాక్షన్ ప్రధానంగా రెండు కారణాలతో నడుస్తుంది. డబ్బు, అధికారం, రోడ్డు కాంట్రాక్టులు, సారా వేలం పాటలతో గొడవ మొదలయ్యేది. అటుఇటు అనేక మంది రాలిపోయే వాళ్లు. ఆదాయ వనరులు లేని కాలంలో చిన్నచిన్న విషయాలకు ఘర్షణ పడేవాళ్లు. ఆ ఘర్షణ హింసాత్మకంగా ఉండేది.
రవాణా సాధనాలు పెరిగేసరికి రాయలసీమ నుంచి వెళ్లిన వాళ్లు ప్రపంచమంతా విస్తరించారు. డబ్బు సంపాదించడానికి స్థానికంగా గొడవ పడక్కరలేదని నాయకులు గుర్తించారు. ఒరిస్సా, గుజరాత్, పంజాబ్‌ల్లో కూడా కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. చివరికి కశ్మీర్‌లోని లోయలో కూడా వర్క్ చేశారు. ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ వ్యాపారులు వీళ్లే. మడగాస్కర్‌లో బంగారు గనుల లీజుదారులు వీళ్లే.
డబ్బు ఉంటే అధికారాన్ని కొనవచ్చు. పార్టీ ఏదైనా పనులు జరుగుతాయి. ఇంకా ఎక్కువ డబ్బులుంటే రాజ్యసభ పదవిని కొనుక్కోవచ్చు. డబ్బు కోసం లోకల్ ఫ్యాక్షన్ ఇప్పుడు అవసరం లేదు. వెనుకటికి బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ ఆధారంగా సీమలోని అనేక నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేవి. ఎన్నికల నిర్వహణలో మార్పులు వచ్చేసరికి రిగ్గింగ్ కష్టమైంది. దీంతో ముఠాలు, బాంబుదాడులు తగ్గిపోయాయి.
పోలీసుల అవినీతి, కఠినత్వం కూడా ఫ్యాక్షన్ అంతర్థానానికి ఒక కారణం. స్ర్టిక్ట్‌గా ఉన్న ఆఫీసర్లు కఠినంగా వ్యవహరిస్తే ,అవినీతి అధికారులు ఫ్యాక్షనిస్టులను పిండడం మొదలు పెట్టారు. ఒక దశలో ఫ్యాక్షన్‌ను మోయడం కంటే పోలీసుల్ని, లాయర్లను మేపడమే కష్టమైంది.
నారాయణ, చైతన్యలకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గత 20 ఏళ్లుగా యువకుల్లో ఎలాంటి భావజాలం మొలకెత్తకుండా బొన్షాయ్ మొక్కలుగా తయారు చేసిన ఘనత వీళ్లదే. వీళ్ల వల్ల మొదట నష్టపోయింది కమ్యూనిస్టులు, ఆ తర్వాత ఫ్యాక్షనిస్ట్‌లు.
యూత్ కెరీరిజం వైపు వెళ్లేసరికి కమ్యూనిస్టులకు కార్యకర్తలు కరువయ్యారు. ఫ్యాక్షనిస్టులకు తుపాకులు, కొడవళ్లు మోసేవాళ్లు లేకుండా పోయారు. పల్లెల్లోకి స్కూల్ బస్సులు రావడం మొదలయ్యే సరికి, వెనుకటి తరాల్లో లేని చదువు అనే కాన్సెప్ట్ మొదలైంది. అది ఎలాంటి చదువన్నది వేరే విషయం.
అసలు పల్లెల్లో యువకులే లేకపోతే ఫ్యాక్షనిస్టుల వెంట ఎవరు తిరుగుతారు? ఉన్నవాళ్లు చదువుల కోసం వెళితే, లేనివాళ్లు పనుల కోసం హైదరాబాద్, బెంగళూరు, అరబ్ దేశాలకు రోజు కూలీలుగా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లో మేస్ర్తీ పని చేసైనా నాలుగు డబ్బులొస్తాయని అర్థమయ్యేసరికి, పల్లెల్లో ఉండి కొట్టుకు చావడం అనవసరమని యువకులు భావించారు. ఆశ్చర్యమేమంటే పల్లెల్లో ఇప్పుడు ప్రేమ కథలు కూడా లేవు. అందరూ పట్నాల్లోనే ఉంటే ఇక ప్రేమించుకునే వాళ్లు ఎవరు?
సమాజంలో రిలేషన్స్ దెబ్బతినడం, వాల్యూస్ మిస్ కావడం కూడా ఫ్యాక్షనిజాన్ని మాయం చేసింది. ఇపుడు ఎవడికి వాడు బాగా బతికితే చాలనుకుంటారు. అంతేకానీ ఇంకోడి కోసం చచ్చిపోవాలి అనుకోరు. ఫ్యాక్షనిస్టులకి తమ కోసం ప్రాణాలు ఇచ్చేవారు లేకపోవడం ఒక సమస్య అయితే, తమ వెంట ఉన్నవారు నమ్మకస్తుడో కాదో తెలియని స్థితి. కమ్యూనికేషన్ సాధనాలు పెరిగిన ఈ రోజుల్లో ఎవడు కోవర్టో ఆపరేషన్ చేస్తాడో తెలియదు.
ఇక గన్మెన్లను నమ్ముకుని ఫ్యాక్షన్ నడిపే పరిస్థితుల్లో నాయకులు లేరు. ఎందుకంటే ఏదైనా దాడి జరిగనప్పుడు గన్మెన్లే మొదట పారిపోతున్నారు. ఈ మధ్య అరకు లో ఎంఎల్ఎపై దాడి జరిగినప్పుడు గాని, మరోచోట దివాకర్ రెడ్డి పై దాడి జరిగినప్పుడు గాని గన్మెన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం మినహా వాళ్లు చేయగలిగిందేమీ లేదు.
అయినా ఇరవై, ముప్పై వేల జీతానికి పనిచేసే వాళ్లు నాయకులకోసం ప్రాణాలర్పించే స్థితిలో లేరు. ఎందుకంటే ఎవడి ప్రాణం వాడికి గొప్ప. గన్మెన్లు సమయానికి అన్నం తింటున్నారో లేదో కూడా కనుక్కునే ఓపిక కూడా లేని నాయకుల కోసం తుపాకీ ఎక్కుపెట్టి అవతల వాన్ని చంపడమో లేదంటే వాళ్ల చేతుల్లో వీళ్లు చావడమో చేసేంత తెగువ గన్మెన్లలో లేదు.
గన్మెన్లంటే కేవలం అలంకార ప్రాయం తప్ప తేడా వస్తే వాళ్లు తమని కాపాడలేరన్న చేదు నిజం నాయకులకు తెలిసిందే! అలాకాక ప్రాణాలు కాదని ముందుకు పోయే పరిస్థితిలో ఏ నాయకుడూ లేడు. ఈ తలనొప్పులన్నీ ఎందుకని ఫ్యాక్షన్ మానేశారు. ప్రత్యర్థితో ఒప్పందాలు చేసేసుకుంటున్నారు.
క్విడ్‌ప్రోకో పద్ధతిలో వర్క్స్ పంచుకుంటున్నారు. నాయకుల పిల్లలంతా హాయిగా విదేశాల్లో చదువుకుని, డబ్బుతో ఎన్నికలను కొంటూ ఉంటే ఇంకా మన సినిమా వాళ్లు కృష్ణవంశీ అంతఃపురం నాటి భావజాలంతో సినిమాలు తీస్తూ శాంతి కావాలి అంటున్నారు.
మేం ప్రశాంతంగానే ఉన్నాం సార్, మీరే ప్రశాంతంగా లేరు. ఈ సినిమాలో బసిరెడ్డి (జగపతిబాబు) తన కొడుకునే చంపేస్తాడు. 30 ఏళ్లుగా నాకు ఫ్యాక్షన్ గురించి తెల్సు. కొడుకుని చంపిన బసిరెడ్డి గురించి వినలేదు.
ఎందుకు సామీ సీమవాళ్లని అంత క్రూరంగా చూపిస్తారు? మీ సినిమాలు చూస్తే హైదరాబాద్‌లో ఇండ్లు బాడుగకి కూడా ఇయ్యరు. ఈ సీనిమాలో కొన్ని సీన్స్ చాలా బావున్నాయి. కథతో ఎన్ని విభేదాలున్నా ఎన్టీఆర్ నటన బావుంది.
త్రివిక్రమ్ డైలాగులు బావున్నాయి. ఆయన కొంత కాలానికి కథకంటే డైలాగుల మీదే ఎక్కువ ఆధారపడతాడేమో అనిపించింది. ఫొటోగ్రఫీ సూపర్. రెండు పాటలు ఓకే. హీరోయిన్ నటన ఓకే. టైటిల్ కోసం ఆమె సీన్స్ సాగదీసినట్టుంది.
ఫ్యాక్షన్‌లో మహిళల బాధ గురించి చెప్పడం కళ్లు తడి చేసింది నిజమే. కన్నీళ్లలో తడిసిపోయి ఎందరో ఆడవాళ్లు జీవించారు. ఫ్యాక్షన్‌లో మహిళలు రెండు రకాలుగా ఉంటారు. భర్తకు తోడుగా ఫ్యాక్షన్ నడిపే వాళ్లు, భర్త ఫ్యాక్షన్‌ను భరిస్తూ భయంతో బతికేవాళ్లు. నిజానికి సమాజంలో మామూలు మగవాళ్లు కూడా భార్యల దగ్గర ఫ్యాక్షనిస్ట్‌లే ఒకప్పుడు.
కాలం మారింది. పల్లెల్లో ఆడవాళ్లు కూడా పిల్లల కోసం తిరగబడుతున్నారు. సినిమాలు ఎప్పుడూ అగ్రవర్ణాలనే గ్లోరిఫై చేస్తుంటాయి. సీమలో ప్రధానంగా రెడ్లు, కొంత కమ్మవాళ్లు ఫ్యాక్షనిస్టులు. కర్నూలు జిల్లాలో బోయ ఫ్యాక్షనిస్టులున్నారు.
కానీ సినిమాలు రెడ్లు, నాయుళ్లు అంటాయ్. కానీ వీరరాఘవ బోయడు అని తీయవు. ఆ పేరు పెడితే డబ్బులు రాలవనే భయం. కానీ ఫ్యాక్షన్‌లో అగ్రవర్ణాలకంటే బీసీ కులాలే ఎక్కువ నష్టపోతాయి. చనిపోయిన రాజు గురించే మాట్లాడుతారు తప్ప ఆ రాజుని కోసం ‘ఒరిగిన నర కంఠాల’ గురించి ఎవరు మాట్లాడుతారు?
సినిమాలో బసిరెడ్డి చనిపోతే, భార్య ఎమ్మెల్యే అవుతుంది. కాకపోయినా ఆమెకు నష్టం లేదు. ఆస్తిపాస్తులుంటాయి. కానీ చనిపోయిన అనేక మంది పేదవాళ్లు భూమిలేని వాళ్లు. వాళ్లు చనిపోతే బతుకు కోసం యుద్ధమే చేయాలి. పిల్లల్ని సాకడానికి కూలి బతుకులు బతకాలి. బీసీ, దళిత కులాల మహిళల కన్నీళ్లు చరిత్రలోకి ఎక్కవు.
సినిమా అనేది ఒక కల్పన. చూడ్డం, చూడకపోవడం మనిష్టం. కానీ సినిమా ఒక ప్రభావితం చేసే సాధనం. అందుకే ఇంత వ్యాసం. మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు నీళ్లు లేవు. మావి మెట్ట భూములు. వానొస్తే పండుతుంది. లేదంటే ఎండుతుంది. నానా సావు సచ్చి పండించిన పంట తీరా ఇంటికొచ్చాలకు ధరలుండవు. రాజకీయ నాయకుల ‘పుణ్యమా’ అని ఇక్కడ పరిశ్రమలు కూడా లేవు.
ఉద్యోగాల కోసం, పనుల కోసం మేము మా పిల్లలు వూళ్లు ఇర్సి దేశాలు పట్టుకుని తిరుగుతున్నాం.
గాయాలు మానిపోయాయి. మమ్మల్ని గెలక్కండి సార్.
అసలు మా పిల్లలకి తుపాకులు, వేట కొడవళ్లు మోసే శక్తి లేదు. అసలే మందులు మాకులు వేసి పంటలు పండిస్తాంటే అవి తిని, వాడికి బందూకు మోసే సత్తువ యాడుంది? ఇపుడు బాంబులు చుట్టేవాడు లేడు, విసిరేవాడు లేడు.
మా తాత కత్తి పట్నాడంటే అది అవసరం.
మా నాయన కత్తి పట్నాడంటే అది వారసత్వం.
నేను కత్తి పట్నానంటే అది పిచ్చి తప్ప మరొకటి కాదు.
మీరు చెప్పింది చాలా పాతకథ. ఎన్టీఆర్ శాంతికోరి 20 ఏళ్లయింది. 50 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ ఉంటే సీమ పల్లెలు ఎట్లా ఉంటాయో ఊహించి సినిమా తీయండి త్రివిక్రమ్ గారూ… కొత్తగా ఉంటుంది.
Comments
Post a Comment