శనీశ్వరుడు - సి అనురాధ
శనీశ్వరుడు - సి అనురాధ కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపరు చదువుతున్న మా అత్తగారు 'ఎవరో చూడవే' అనడంతో వెళ్ళి తలుపు తీశాను. "ఉన్నారా అమ్మా, మీవారు?" అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్త గారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపరు తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. "ఈరోజు పని కాలేదట. రేపు కచ్చితంగా ఇస్తామన్నారు" నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, “ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు" అన్నారు వెటకారంగానాకు చివుక్కుమనిపించింది. 'మీకెందుకండీ? మా తిప్పలు మావి' అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగలలేదు. “ఏమిటీ ఈ రోజు టిఫినూ..." సాగదీస్తూ అడిగారు, "ఇడ్లీ సాంబారండీ బాబాయిగారూ” అన్నాను. "ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా. ఏదీ తీసుకురామ్మా, తింటాను” అన్నారు. చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ “మరీ ఎక్కువ తేకమ్మా, మూడు చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది" నేనేమీ మాట్లాడకుండా వంటి...