శనీశ్వరుడు - సి అనురాధ

 శనీశ్వరుడు - సి అనురాధ 


కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపరు చదువుతున్న మా అత్తగారు 'ఎవరో చూడవే' అనడంతో వెళ్ళి తలుపు తీశాను. "ఉన్నారా అమ్మా, మీవారు?" అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్త గారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపరు తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.


"ఈరోజు పని కాలేదట. రేపు కచ్చితంగా ఇస్తామన్నారు" నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, “ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు" అన్నారు వెటకారంగానాకు చివుక్కుమనిపించింది. 'మీకెందుకండీ? మా తిప్పలు మావి' అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగలలేదు.


“ఏమిటీ ఈ రోజు టిఫినూ..." సాగదీస్తూ అడిగారు, 

"ఇడ్లీ సాంబారండీ బాబాయిగారూ” అన్నాను.

"ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా. ఏదీ తీసుకురామ్మా, తింటాను” అన్నారు.  చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ “మరీ ఎక్కువ తేకమ్మా, మూడు చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది"


నేనేమీ మాట్లాడకుండా వంటింటి వైపు నడిచాను, ఇడ్లీ తేవడానికి. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు, తినడానికి సిద్దపడుతూ. శుభ్రంగా తిని, చేతులు కడుక్కొని వెళ్తూ "నీ చేతి వంట అమృతమమ్మా" అని ఒక కంప్లిమెంట్ పడేసారు.


“ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండీ. నా గొప్పేమీ లేదు" అన్నాను.

"ఇడ్లీ అంటే ఇడ్లీ ఒక్కటనే కాదమ్మా, చెట్నీ సాంబారూ... ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు, మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాదుకి. లేదంటే రేపు కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది" అంటూ వెళ్ళిపోయారు.


"ఏమిటే వాడికి మర్యాదలు? అప్పిచ్చినంత మాత్రాన అలా అణిగిమణిగి ఉండటమే" మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను.


"అది కాదత్తయ్యా, మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు. వినే వాళ్ళకి గొడవలాగుంటుంది. అది మనకు బాగుండదు కదా" అన్నాను అనునయంగా.


"ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పుచేసి ఎరుగునా? అంతా కాలమహిమే తల్లీ" అంటూ సోఫాలో కూర్చుని వార్తాపత్రికలో మొహం దూర్చారు.


నాకు మూడేళ్ళక్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది... నల్లటి విగ్రహం, తెల్లని బట్టలు, చేతివేళ్ళకు ఎనిమిది ఉంగరాలూ పెట్టుకుని మావారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్యగారు, మావారు. 


ప్రసాదు- ఆయనను సాదరంగా ఆహ్వానించి, “ఈయన నరసయ్యగారని బిజినెస్ మ్యాన్ అమ్మా" అంటూ, నాకూ మా అత్తగారికీ పరిచయం చేశారు.


ఆయన గట్టిగా నవ్వారు. “ఇప్పటివరకూ నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా. తండాల నరసయ్య అనే అంటారు" అంటూ మా అత్తగారి వైపు తిరిగి "నమస్కారమమ్మా" అన్నారు. మా అత్తగారు గమనించనట్టు మావారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు.


అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరు వచ్చారు" అన్నారు మావారు.


"అమ్మ నా మాట కాదనరు- అన్నాడు మీవాడు, కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలీకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం. అందుకే నేనే వచ్చానమ్మా” మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది.


"కాఫీ ఇస్తావా?" అన్నారు మావారు, నావైపు తిరిగి, నేను కాఫీ చేయడానికి వంటింటిలోకి వెళ్ళాను.


ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది, అయన్ని చూస్తే.


కాఫీ తాగుతూ "అయితే ఇద్దరు పిల్లలన్నమాట నీకు" అన్నారు. టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫొటోని చూస్తూ.


అంతా పసిగట్టినట్టు, "బాగుందయ్యా, ముచ్చటైన సంసారం. అనుకూలవతి అయిన భార్యా, అభిమానవతి అయిన అమ్మా" అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారు అనేకంటే మావారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది.


మావారు తిరిగి వచ్చాక, మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. "ఎక్కడ దొరికాడురా ఈ శనీశ్వరుడు? వాణ్ణి చూస్తేనే భయమేస్తోంది. వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలూ వద్దు, పాడూ వద్దు, లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకుని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేమి అనుభవం ఉందని? అయినా నా మాట ఏనాడు విన్నావు? నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా?" చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


అప్పటి నుంచి ప్రతినెలా ఆరో తేదీ వస్తే మా క్యాలెండర్లో తేది చూసుకోవలసిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవమిస్తానంటే- మాముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గరివాళ్ళ ద్వారా తెలిసింది.


ఒకసారి మా దగ్గరి బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం,  అక్కడికి నరసయ్యగారు కూడా వచ్చారు. మావారిని నరసయ్యకు పరిచయం చేసిన మావారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్యగారి దగ్గర తీసుకున్నాడట. అతను నరసయ్యని తప్పించుకుని తిరగసాగాడు. నరసయ్యగారు అతన్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకుని నిలదీశారు. రాత్రి"ఏమయ్యా, డబ్బు ఎప్పుడిస్తావు? కనబడినప్పుడల్లా మాయమవుతున్నావే? 'డబ్బులు తీసుకునేదాకా ఓడ మల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న' అన్నట్లుంది నీ వ్యవహారం" అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. 


“ప్రసాదుకు నాకంటే ముందే, నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా, అతన్ని అడగవేం?" అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన “ప్రసాదు నా బంధువోయ్. ప్రసాదు భార్య నాకు కూతురి వరస" అంటూ దులిపేశారు.


నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుండి నరసయ్యగారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది. బాబాయిగారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను 'అమ్మాయీ' అంటూ, పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ, మావారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ, మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. 'వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.


తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరికాస్త గట్టిపరిచింది. ఒకసారి నేనూ మా అత్తగారూ ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి, మా అత్తగారి కుడిచెయ్యి ఫ్రాక్చరయ్యింది. ఆసుపత్రిలో ఉన్న మాకు పదివేలు తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్యగారు. అడగకుండా ఆదుకున్నందుకు మావారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండీ. అయినా సరే, వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు.

******

రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మావారి వ్యాపారాలలో ఏమీ మార్పులేదు. నష్టాలు లేవు కానీ లాభాలబాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే ఆరో తేదీ వచ్చిపోయింది. తర్వాత ఏడు, ఎనిమిది కూడా వచ్చి పోయాయి. "శనీశ్వరుడు ఇంకా రాలేదే... కొంపతీసి పోయాడా ఏమిటి?" అన్నారు మా అత్తగారు. "ఛ, ఊరుకోండి. మన అప్పు కోసం ఆయనను చంపేస్తామా ఏమిటి?" అన్నాను నేను.


"ఆయనే మేలమ్మా. వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మున ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు" అన్నారు మావారు. మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మావారికి. వాళ్ళబ్బాయి మాట్లాడాడు… “నాన్నగారు, బాత్రూంలో కాలుజారి పడ్డారు. తుంటి ఎముక విరిగింది. ఆసుపత్రిలో ఉన్నారు. మీరేదో ఇవ్వాలట... గుర్తుచేయమన్నారు” అని మావారు వెంటనే “డబ్బులు ఈరోజే ఖాతాలో వేస్తాను. నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను. రెండు మూడు రోజుల్లో వస్తాను. రాగానే నాన్నగార్ని కలుస్తాను" అంటూ తన సానుభూతి తెలియజేసి, ఆరోజే ఖాతాలో డబ్బు జమ చేసి తిరుపతి వెళ్ళిపోయారు.


"పోనీ, మనం వెళ్ళి చూసి వద్దామా?" మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. "బుద్ధుందే నీకు, అసలు ఎలా అడుగుతావే నన్ను?" అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకుకంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు.


నాకు వెళ్లామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోనుచేసి ఎలా ఉందని అడిగాను. ఫర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మావారి క్యాంపు రెండుమూడు రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తియ్యలేదు... బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మావారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆయన కాలం చేసినట్టు. మావారు చాలా బాధపడ్డారు, ఆయన ఆఖరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 


పదిహేను రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికొచ్చాడు. "లోపలికి రండి" అన్నారు మావారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను.


"రాకూడదండీ, ఉమ గారిని పిలుస్తారా?" అన్నాడు గుమ్మం బయటే నిలబడి."ఉమా! ఉమా!" మావారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. "ఈ కాలంలో కూడా ఏమిటండీ, ఫర్వాలేదు, రండి లోపలికి" అంటున్నారు మావారు. 


మావారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మావారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు.


అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ "ఇలా జరగాల్సింది కాదు" అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చుని మా మాటలు మౌనంగా వింటున్నారు.


“మా నాన్నగారు ఈ కవర్ మీకిమ్మన్నారు” అంటూ ఒక పెద్ద కవరు ఇచ్చాడు. మావారు అందుకుని నా చేతికిచ్చారు. అందుకుని టీపాయ్ పైన పెట్టాను.


"మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి" అతని గొంతు బొంగురుపోయింది.


"ఆయన చివరి కోరిక..." పెదవులను బిగపట్టాడు.

"బాధపడకండి, ఏం చేస్తాం? కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి" నా ఓదార్పు.


"నాకు ఉమ లాంటి కూతురుంటే బాగుండేదిరా, 'కడుపు చూసి అన్నం పెడుతుంది' అని ఎప్పుడూ అంటుండేవారు." నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.


"ఎన్నోసార్లు చెప్పాం... 'ఈ వ్యాపారం వద్దు నాన్నా, మాతోపాటు వచ్చి ఉండండీ' అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా" అనేవారు.


కాసేపు నిశ్శబ్దం మామధ్య రాజ్యమేలింది. కాసేపాగి లేచి నిలబడ్డాడు. మా అత్తగారి వైపు తిరిగి "నమస్కారమమ్మా” అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు.


అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చారు. "కవర్లో ఏముందే" అంటూ కవర్ నా చేతికిచ్చారు- తీసి చూడమని. 


మావారు అందుకుని కవర్లో ఉన్నవి బయటకు తీశారు. ఇంటి దస్తావేజులు. ఆశ్చర్యంతో మా అందరి నోళ్ళూ తెరుచుకున్నాయి. వాటితో ఒక కాగితం, మరో కవరూ జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మావారు. అది ఉత్తరం. దాన్ని నా చేతిలో పెట్టారు- చదవమన్నట్టు.


ప్రసాదుకు, ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ ఉత్తరం నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలీదు కదా! నీ గురించి తెలుసుకునే నీకు అప్పు ఇచ్చాను. మంచితనం అన్నివేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు, ఎంతెంత డబ్బు ఇచ్చినదీ అంతా రాసి ఉంచాను. ఎప్పటికైనా పోవలసిన వాడినే. నేను పొయ్యాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకుని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను. నీ అప్పుల నియంత్రించడం కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి- అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. 


'వడిగల గుర్రం కంటే వేగం- వడ్డీ రేటు' అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది.  నీ వ్యాపారాలకూ, అత్యాశకూ దాన్ని బలి చేయవద్దు. అనుకూలవతి అయిన భార్య ముచ్చటైన పిల్లలు... ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు, జీవితం చేయి జారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ-అదీ కొన్నాళ్ళేలే. తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి పత్రాలు జాగ్రత్త. జీవితాన్నీ సంసారాన్నీ జాగ్రత్తగా చూసుకో. బతికినా... చచ్చినా... నీ శ్రేయోభిలాషినే. ఇట్లు నరసయ్య.


ఉత్తరంతో పాటు, నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్ళుధారలై ప్రవహిస్తున్నాయి. మావారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మా అత్తగారు, "శనీశ్వరుడు పోతూ... పోతూ... మంచి చేస్తాడంటారు, ఇదేనేమో, పాపం, మంచివాడే” అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు.



Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

రామాయణ దృక్పథం

బెండమూరి లంక - వంశీకృష్ణ