నా విజయ రహస్యం
నా విజయ రహస్యం
- స్వామి అర్చనానంద
"విశ్వమత మహాసభల సమావేశ జన సమూహాన్ని 'అమెరికా సోదరీ, సోదరులారా!' అని సంబోధించాను! అంతే! చెవులు చిల్లులు పడేలా రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో ఆ భవ్య భవనం మారుమ్రోగింది. ఆ తరువాతనే నేను ప్రసంగించడం ప్రారంభించాను. అది ముగియగానే ప్రగాఢ భావావేశంతో దాదాపు అలసిపోయి నా స్థానంలో అలాగే కూర్చుండి పోయాను, మరుసటి రోజు వార్తాపత్రికలన్నీ నా ప్రసంగమే సర్వశ్రేష్ఠమైనదని ఘోషించాయి, నా గురించి అమెరికా అంతటా తెలిసిపోయింది. 'వారందరూ అలా స్పందించడానికి కారణమేమిటా?' అని నీవు ఆశ్చర్యపడవచ్చు! నాకేదయినా అద్భుత శక్తి, సిద్ధి ఉండినవా? అని నీవు అబ్బురపడవచ్చు!...ఔను! నీకు ఆ రహస్యం చెప్పేస్తున్నాను. నాలో ఆ 'అద్భుత శక్తి' ఉండినది, ఉన్నదీ. అదేమిటంటే - నా జీవితంలో ఒక్కసారి కూడా కనీసం ఒక్క లైంగిక తలంపును, చెడు ఆలోచనను కూడా నా మనస్సులో ప్రవేశింపనీయలేదు. మనస్సుకు, నా ఆలోచనా శైలికి నేనే ప్రశిక్షణ ఇచ్చాను; మనిషి సాధారణంగా కామ చింతన చెడు సంపర్కంతో వృథా చేసుకొనే మానసిక శక్తుల్ని నేను ఊర్ధ్వముఖంగా ఉన్నత దిశలో ప్రవహింపజేశాను. తత్ఫలితంగా నా మనస్సు, మేధ, సంకల్పం ఎవ్వరూ, - ఏదీ ఆపలేని, ప్రతిఘటించలేని ఒక ప్రచండ ఆత్మశక్తి, ఆధ్యాత్మికశక్తిని సంతరించుకొన్నాయి”..
1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో మహానగరంలో ప్రారంభమైన 'విశ్వమత మహాసభల'లో భారత దేశపు సనాతన హిందూ ధర్మ ప్రతినిధిగా వేదాంత సింహగర్జన చేసి, మూఢ మతాంధుల నక్కజిత్తులను చిత్తుచేసిన భారతమాత భవ్యపుత్రుడు, ఆధ్యాత్మ జ్ఞాన భాస్కరుడు, భారత యువతకు భవితను చూపిన యువనేత - వివేకానంద స్వామీజీ మహాసభల తదనంతరం తన మద్రాసు శిష్యులకు వ్రాసిన అతి విలువైన లేఖలోని అగ్నిశిఖలు ఇవి. పాశ్చాత్య భోగవాదంలో అస్తిత్వమే కోల్పోతున్న జాతికి శాంతి కాంతి రేఖలు ఇవి!
మానవజాతి శ్రేయస్సును, యువకుల ఉజ్జ్వల భవిష్యత్తును మనసారా ఆకాంక్షించి స్వామీజీ ఇలాంటి 'సాధనా రహస్యాలను' ఎన్నింటినో మనందరికీ అందించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, భారత, భాగవత, రామాయణాది మహోన్నత శాస్త్రాలలో ఉన్న శక్తిదాయక, స్ఫూర్తిప్రేరక మహా సంస్కృత మంత్రాలను సులభం, సరళమైన ఆంగ్లభాషలో ఉద్బోధించారు. 'మరణం బిందు పాతేన, జీవనం బిందు ధారణాత్' - 'అత్యంత విలువైన రేతస్సు (వీర్యము)ను వృథా చేసిన మనిషి మరణానికి చేరువవుతాడు. త్యాగం, వైరాగ్యంతో నిండిన తపోశక్తితో పవిత్ర జీవనంతో ఈ రేతస్సును, తనలోనే నిలుపుకొని, ఆత్మ వినిగ్రహం, ఆత్మధ్యాన సాధనలతో రేతస్సును 'ఓజస్సు'గా, ఆధ్యాత్మిక శక్తిగా పరివర్తనం చేసిన సాధకుడు శాశ్వత జీవనం, అమృతత్వం (ఆనందమయమోక్షం) చేరుకొంటాడు' అంటోంది 'అమృత బిందు ఉపనిషత్తు'. -
'తనను తాను పరిపూర్ణంగా పవిత్రునిగా మలచుకున్న ఒక్క వ్యక్తి, పెద్ద మత ప్రచారకుల మహాసమూహం కన్నా అధికంగా విజయాలు సాధిస్తాడు. పవిత్రత, ప్రశాంతత - వీటి సాధనా ఫలంగానే దివ్యశక్తి, స్ఫూర్తితో నిండిన వాణి ఉద్భవిస్తుంది' అని స్వామీజీ బోధించారు.
స్వామి వివేకానంద ఏకసంథాగ్రహి, Encyclopedia of Britanica 'విశ్వవిజ్ఞాన సర్వస్వం' గ్రంథాలను చూసి వారి శిష్యుడు, "స్వామీజీ! ఒక జీవితకాలంలో ఈ బృహత్ గ్రంథాలను చదివి ముగించడం. అసాధ్యం కదా!' అన్నారు.
అందుకు స్వామీజీ 'ఏమంటున్నావు? ఈ 25 'సంపుటాల్లో 10 సంపుటాల్ని నేను ఇప్పటికే చదివాను. నీకు ఋజువు కావాలంటే వీటిలో ఏ ప్రశ్నయినా అడుగు' అన్నారు.
శిష్యుడు ఆ గ్రంథాల నుండి అడిగిన ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానాన్ని కచ్చితమైన పదజాలంతో పేజీ నెంబర్ సహా స్వామీజీ చెప్పేశారు.
ఆశ్చర్యంలో తలమునకలవుతున్న శిష్యునితో స్వామీజీ ఇలా అన్నారు - "పన్నెండేళ్ళు ఎవరైనా సరే కచ్చితమైన అస్ఖలిత బ్రహ్మచర్యం పాటిస్తే ఇటువంటి జ్ఞాపకశక్తి సాధ్యమే. అలాంటి వ్యక్తి ఏ విషయమైనా ఒకే ఒక్కసారి విన్నా, చదివినా అలాగే గుర్తుండి పోతుంది. నేను స్వయంగా ఈ సాధన చేశాను. ఎవరైనా ఈ సాధన చేసి ఈ శక్తిని పొందవచ్చు. నీవూ సాధించవచ్చు” 'Is there a greater power than that of purity of Brahmacharya, my boy?' 'పవిత్రతశక్తి కన్నా, బ్రహ్మచర్యశక్తి కన్నా గొప్పశక్తి ఏమైనా ఉన్నదా నాయనా?' అని తన శిష్యులకో లేఖలో స్వామీజీ వ్రాశారు.
నరేంద్రుడు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం కోసం రాత్రిపూట తమ నాయనమ్మ వారింటికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడూ ఏకాంతంగా అతి మధురంగా పాటలు పాడేవాడు. అతని తేజోమయరూపం చూసి, గంధర్వగానం విని ఆ పక్క ఇంటిలో ఉన్న ఓ యువ వితంతువు మోహితురాలై, ఒకరోజు నరేంద్రుని గదిలోనికే వచ్చేసి తన మనస్సును వెల్లడించింది.
యువ నరేంద్రుడు, ఆమెతో ఇలా అన్నాడు. - 'అమ్మా! నీవు నాకు తల్లితో సమానురాలివి. తుచ్ఛమైన ఈ పశువాంఛలను త్యాగం చేసి భగవంతుణ్ణి స్మరించు, పవిత్రంగా జీవించు! మృత్యువు ఏ క్షణంలోనైనా ఈ శరీరాన్ని కబళిస్తుంది. దానికి ఏ సాధనలు చేసి ఎదురు నిలుస్తావు? దానికి సిద్ధమయ్యావా? దైవచింతన చేయి, విషయ చింతన తల్లీ!' అని నమస్కరించాడు. వదిలివేయి
ముప్ఫై ఏళ్ళ వయస్సులోని నవ యువసన్న్యాసి, తేజోమయ దివ్య భవ్యమూర్తి స్వామి వివేకానంద దివ్యాకర్షణకు అమెరికాలో అందరూ శిరస్సు వంచారు. ఓ కోటీశ్వరురాలైన సుందర యువతి స్వామీజీ అపార జ్ఞాన సంపదకు, తేజస్సుకు మోహితురాలై 'స్వామీజీ! మిమ్మల్ని వివాహమాడాలని అనుకుంటున్నాను' అని అడిగింది. 'ఎందుకమ్మా నీకా ఆలోచన?' అన్నారు స్వామీజీ. 'మీ ధీశక్తి, మీ జ్ఞానసంపద, మీ వాగ్ధాటి, ధైర్యసాహసాలు, తేజస్సు అపారమైనవి. అనన్య సామాన్యమైనవి. కాబట్టి మిమ్మల్ని పెళ్ళాడితే మీ వంటి ఒక గొప్ప పుత్రునికి తల్లిని కావచ్చు. మీ లాంటి ఒక్క కొడుకు నాకు కావాలి స్వామీ!' అని ఆ సుందరీమణి సమాధానమిచ్చింది. వెంటనే స్వామీజీ ఇలా అన్నారు - 'అమ్మా! నా వంటి మహాజ్ఞాని, మేధావికి జన్మనిచ్చి, అతడు నా అంతటి గొప్ప వాడు కావాలంటే నీవు ఇంకా 30 ఏళ్ళు వేచి ఉండవలసి వస్తుంది. ఈలోగా ఏమైనా జరిగితే నీ కోరిక తీరకనూ పోవచ్చు. అంత ప్రయాస ఎందుకమ్మా! నేనే నీ ఎదురుగా ఉన్నాను. ఇప్పుడే, ఇక్కడే నన్నే నీ పుత్రునిగా స్వీకరించు తల్లీ!' అని నిజంగా ఆమెకు కొడుకుగా నమస్కరించారు. ఆ కోటీశ్వరురాలు ఈ పవిత్రతా మూర్తిని చూసి తన తప్పును మన్నించమని వేడుకొంటుంది. వివేకానందుని విజయ రహస్యమిదే!
మనమంతా గొప్పవాళ్ళం కావాలని కలలు కంటూ ఉంటాం. వివేకానంద స్వామీజీలా మనమూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాలనీ, ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయాలనీ, గౌరవ మన్ననలు పొందాలని ఆశిస్తాం, ఆకాంక్షిస్తాం. చరిత్ర పుటల్లో మన పేర్లు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడాలనీ, శాశ్వత కీర్తి ప్రతిష్ఠలు రావాలనీ మనసారా కోరుకొంటాం. సహజమే! కానీ, దానికి అత్యవసరమైన మూల్యం - పరిపూర్ణ పవిత్రత, కఠోరమైన సంపూర్ణ బ్రహ్మచర్యం, త్యాగం, వివేకం, వైరాగ్యం, మనోనిగ్రహం, సర్వమహిళామూర్తుల పట్ల మాతృభావం! ఈ మూల్యం చెల్లించడానికి మాత్రం మనం సుతరామూ సిద్ధంగా లేము!
'This life is a great chance! Do not go for glass beads leaving the mine of Diamonds!.... Life is shortl Give it up to a great cause.' - 'ఈ జీవితం ఒక గొప్ప వరం, మహా అవకాశం! నీలో వజ్రాల గని (సాక్షాత్తు భగవంతుడే) నిక్షిప్తమై ఉండగా, దానిని వదలి బయటి గాజు పెంకుల (బాహ్య ఇంద్రియ సుఖాల) కోసం వెంపర్లాడవద్దు!... జీవితం అల్పమైనది? ఈ అల్ప జీవితాన్ని ఒక మహోన్నతమైన ఆదర్శం కోసం సమర్పించు!" ఈ వివేకానంద స్ఫూర్తి మంత్రం మనల్ని సన్మార్గంలో, పవిత్రతా పథంలో నడిపించు గాక!
Comments
Post a Comment