Geeta Jayanti (Special)
బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైనా. ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు. నీతికథలు చెబుతాడు. ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు. తన అనుభవాలనూ వివరిస్తాడు. కొన్నిసార్లు అలతి పదాలతో, కొన్నిసార్లు కఠిన వాక్యాలతో, కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు. అరుదుగా, ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు. పరమాత్మ ప్రయత్నమూ అలాంటిదే. భగవద్గీత, అనుగీత, ఉద్ధవగీత, జాబలిగీత, బ్రహ్మగీత, అష్టావక్రగీత... ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు. గీతా జయంతి (డిసెంబరు 11) సందర్భంగా సకల గీతల సంక్షిప్త పరిచయం... తస్మాత్ ధర్మమయీ గీతా సర్వజ్ఞాన ప్రయోజికా సర్వశాస్త్ర సారభూతా విశుద్ధాస విశిష్యతే. గీత... ధర్మసారం, జ్ఞానహారం, సకలశాస్త్రాల సమాహారం! *** నేనెవరు? తాను పశువును కానని తెలుసుకున్నాడు. పక్షినీ కానని అర్థం చేసుకున్నాడు. క్రూర మృగాలకంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు. వానరంతో దగ్గరి పోలికలున్న నరుడినని నిర్ధారించుకున్నాడు. మానవుడినని ప్రకటించుకున్నాడు. అంతలోనే మరో ప్రశ్న. నేనంటే ఎవరు? కనిపించే శరీరమా, కనిపించని ఆత్మా?... మనిషి మదిలో అనేక సందేహాలు. అతనెవరు? చరాచర...