ధీరవాణి

సత్సంబంధాలు నెలకొల్పండి

ఏ వ్యక్తీ, ఏ జాతీ ఇతరులను ద్వేషించి మనజాలదు. మన మేధావులు 'మ్లేచ్ఛ' అనే శబ్దాన్ని సృష్టించి ఇతరులతో కలసిమెలసి జీవించటం ఏ రోజున మానివేశారో ఆనాడే భారతదేశ పతనం ప్రారంభమైంది. కనుక మనం ఆ స్థితి నుంచి బయటపడగలగాలి.

ఒక వ్యక్తిగాని, జాతిగాని ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, తామే గొప్పవారమని, తమ మతం మరియు తమ ఆచారవ్యవహారాలు మాత్రమే శ్రేష్ఠమైనవని భావించి ఏకాకి జీవనాన్ని ఏర్పరచుకుంటే అది ఆ వ్యక్తికి, జాతికి పతనకారణమవుతుంది.

పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధర్మాన్ని అలవరచుకోండి. భారతదేశం తిరిగి తన పూర్వ ఔన్నత్య శిఖరాలను అధిరోహించాలంటే తనకున్న పారమార్ధిక సంపదను ఇతర జాతులకు అందుబాటులో ఉంచగలగాలి. ఆయా జాతుల సంపదను మనకు అవసరమైన మేరకు స్వీకరించటానికి సంసిద్ధంగా ఉండాలి. “వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అట్లే ప్రేమతత్వమే జీవికకు చిహ్నం, ద్వేషభావన మరణ సదృశ్యం." కనుక విశాలహృదయులై ఉన్నత శిఖరాలు అధిరోహించండి. మీ జాతికే కాక, యావత్ప్రపంచానికీ ఆదర్శప్రాయులవుతారు. ఎల్లలెరుగని ప్రేమమయ సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం.

అప్పుడు మాత్రమే భారతదేశం తన సముద్ధరణను కండబలంతో కాకుండా, ఆత్మశక్తితో సాధిస్తుంది. చేతిలో విధ్వంసక పతాకాన్ని చేబూనకుండా శాంతియుత పతాకాన్ని చేబూని సముద్ధరణ సాధించగలుగుతుంది.

మత పతాకంపై శాంతి సందేశం

ప్రపంచంలో ప్రజలందరూ ఒకే మతాన్ని అనుసరిస్తూ ఒకే మూసలో పోసిన నైతిక ప్రమాణాల్ని ఆమోదించడం దురదృష్టకరమైన పరిణామం. అలా జరిగినప్పుడు మతపరమైన, ఆధ్యాత్మికపరమైన ప్రగతి నశిస్తుంది. మన మత సత్యాలే ఉత్కృష్టమైనవనీ, వాటినే ప్రజలందరూ అనుసరించాలనీ ఆకాంక్షించడం విరమించాలి. ఒకే ప్రపంచ మతాన్ని వ్యవస్థీకరించి, ఆ ధర్మాల్ని, విధానాల్ని అనుసరించాలనే విశ్వాసం నుండి ప్రజల్ని విముఖుల్ని చేయాలి.

మనం ఇతర మతస్థులపట్ల సహనం ప్రదర్శించటమే కాదు వారిని అభిమానించి అక్కున చేర్చు కోవాలి. ఆ భావనే, ఆ సత్యమే సర్వమతాలకూ ప్రాణ ప్రతిష్ఠాపన మంత్రం కావాలి.

ఎవరినీ నిరసించవద్దు. తోటి వారికి చేయూత నీయగల్గితే మంచిదే. లేకుంటే చేతులు జోడించి వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ వారి త్రోవన వారిని పోనీయి. అంతేకానీ తోటి వారిని అభిశంసించడాల్లో మన శక్తిని వృథా చేయకూడదు.

మానవులందరి గమ్యం ఒకే ఒక సత్యాన్ని తెలుసు కోవడమే! మధ్యలో మనం కల్పించుకొన్న విభేదాలు ఊహామాత్రాలే! విభిన్న మతవిశ్వాసాల వల్ల ప్రజలకు మేలే కలుగుతుంది. ఏ విశ్వాసమైనా, వ్యక్తిని మతపరమైన జీవన విధానంలో ఇమిడ్చి మంచిని పెంచుతుంది, కానీ కీడు చేయదు. అంతేకాదు మత విధానాలు ఎన్ని ఎక్కువుంటే సమాజానికి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వాటి వలన వ్యక్తుల్లో దైవ ప్రవృత్తి పెరిగే అవకాశాలు బాహుళ్యంగా లభిస్తాయి.

క్రైస్తవుడు, హిందువు కానక్కరలేదు. బౌద్ధమతస్థుడిగా మారనవసరం లేదు. అలాగే హిందువుగానీ, బౌద్ధుడుగానీ క్రైస్తవునిగా మారవలసిన అవసరం లేదు. ఏ మతస్థుడైనా పరమతం యొక్క ప్రధానాంశాల్ని జీర్ణించుకొని, తన ప్రత్యేక విశ్వాసాలను సంరక్షించుకోవాలి. తన పురోభివృద్ధి ప్రమాణాన్ని తన మార్గంలో అనుసరిస్తూ, ఆత్మవికాసాన్ని సాధించుకోవాలి.

పవిత్రత, నిర్మలత్వం, దాతృత్వం ఇవి ప్రపంచంలో ఏ మతానికీ పరిమితం కాదు. ప్రతి మతంలోను సర్వోత్కృష్టులైన స్త్రీ పురుషులు ఉద్భవించారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తన మతం మాత్రమే గొప్పదనీ, అది మాత్రమే సజీవంగా వర్థిల్లుతుందనీ, మిగతా మతాలు నశిస్తాయనీ కలలు కంటే, అతని మూర్ఖత్వానికి మనం జాలిపడాలి. అలాంటి వారి కనువిప్పు కొరకు ప్రతి మత కేతనంపైనా 'సహకరించు- నిరోధించకు', స్వీకరణ మాత్రమే వినాశంకాదు', 'సామరస్యం, శాంతి మాత్రమే, వ్యతిరేకత కాదు' అనే నినాదాల్ని ప్రస్ఫుటంగా లిఖించవలసి వుంటుంది.

ఎప్పటికైనా విశ్వానికంతటికీ ఒకే మతం అంటూ ఉండడం తటస్థిస్తే అది దేశ, కాల పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. అలాంటి మతాన్ని మనం ప్రజల ముందు ఉంచగలిగితే అసహనానికీ, పరమత ద్వేషానికీ స్థానముండదు. భగవంతుని అనంత తత్త్వమే మతాలన్నిటి యొక్క సమాహారం.

©️: ధీరవాణి
👁️‍🗨️👌🔖♻️@🌳

Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

బెండమూరి లంక - వంశీకృష్ణ

రామాయణ దృక్పథం