Black Money "నల్ల ధనం"

 అవినీతి ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ "నల్ల ధనం"

సూపర్ హిట్టు సినిమాలకు అవసరమైన హంగులన్నీ దీన్లో ఉన్నాయి. స్విట్జర్లాండ్ సెట్టింగులున్నాయి. మాఫియా గ్యాంగులున్నాయి. పొలిటికల్ పంచ్ డైలాగులున్నాయి. సామాన్యుడి సెంటిమెంటు కష్టాలున్నాయి. నేతలూ గుత్తేదార్లూ రాసుకుపూసుకు తిరిగే రొమాంటిక్ సీన్లూ ఉన్నాయి. ఇది మన కథ. మనందరి జీవితాల్నీ ప్రభావితం చేసే కథ. సమాజమే వెండితెర అయితే, ఆ సినిమా పేరు- నల్లధనం.


దోపిడీ...!

పచ్చి దోపిడి, నల్లడబ్బు గణాంకాల్ని చూడగానే సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తే నోరెళ్లబెట్టారు.


ఇంతకాలం ఎందుకు కట్టడిచేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పర్యవసానాలను తలుచుకుని తల్లడిల్లిపోయారు పైపైకి ఇదేదో పన్నుల ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలా అనిపించవచ్చు. కుబేరులకు మాత్రమే వచ్చే తలనొప్పి అన్న అభిప్రాయమూ కలగవచ్చు. కాదుకాదు. నల్లదనం అందరి సమస్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరి జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది.


నల్లడబ్బు స్వభావమే నలుపు. నోటు మాత్రం పచ్చగానే ఉంటుంది. బాపూజీ బోసినవ్వుల బొమ్మ తప్పక కనిపిస్తుంది. పైకెత్తి చూస్తే రక్షణరేఖ. కింద రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం, సందేహం అక్కర్లేదు, సర్కారు అచ్చేసిందే


నలుపు-తెలుపు మధ్య ఒకే ఒక్క తేడా.. లెక్క!


లెక్కలకెక్కితే తెలుపు, ఖాతాల్లో కనిపిస్తుంది. ఆదాయపుపన్ను జమవుతుంది.

లెక్కచేయకపోతే నలుపు, పద్దులుండవు, హద్దులు ఉండవు.


రాజాచెల్లయ్య కమిటీ నిర్వచనం ప్రకారం 'వ్యక్తులు కానీ వ్యాపార సంస్థలు కానీ ఉద్దేశపూర్వకంగా ఖాతపుస్తకాల్లో చూపించని మొత్తమే.... నల్లడబ్బు'.


దురదృష్టవశాత్తు, వ్యవస్థలో నలుపు-బలుపు పెరిగిపోయింది. 'గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ' సంస్థ లెక్కల ప్రకారమైతే 1948 నుంచి 2008 దాకా... ఈ అరవై ఏళ్లలో దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు సరిహద్దులు దాటిపోయింది. ఇక దేశంలో చలామణిలో ఉన్న నల్లధనం అంతకంటే ఓ పిసరు ఎక్కువే.


పాతిక లక్షల కోట్లు ఉండవచ్చు. రాంజెఠ్మలానీ, సుబాష్ కాశ్యప్ వంటి మేధావుల ప్రజాప్రయోజన వ్యాజ్యాల పుణ్యమాని నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అత్యున్నత న్యాయస్థానమూ పాల్గొంటోంది.


సుప్రీంకోర్టు కళ్లెర్రజేస్తోంది. సామాన్యుడు కుదేలైపోతున్నాడు. ఆర్థిక వ్యవస్థ అప్రతిష్ఠపాలు అవుతోంది. అయినా, పాలకులు మేలుకోరెందుకు? జాతికి మేలుచేసే చర్యలు తీసుకోరెందుకు? ఎందుకంటే... వాళ్లూ ఆ గూటి పక్షులే. ఆ (సై) తాను ముక్కలే. ఎక్కడ తమ పేర్లు బయటికొస్తాయో అన్న భయం. ఎక్కడ తామున్న కొమ్మ. పుటుక్కున తెగిపడుతుందో అన్న వణుకు.


కక్కుర్తి నాయకులు. అవినీతి అధికారులు. బాధ్యతలేని వ్యాపారులు, మూడు వ్యవస్థలూ చేతులు కలిపితే, దేశానికి మూడినట్టే! ఎంత పీక్కుతిన్నా ప్రశ్నించేదెవరు? ఎంత తవ్వుకున్నా అడ్డచ్చే దెవరు? ఎంత సొమ్ము సరిహద్దులు దాటించినా, దండించేదెవరు? ఆ దందా... నిరంతరం, నిర్విఘ్నం నిత్యనూతనం


తలా పిడికెడు...


పదివేల రూపాయల ఆదాయపుపన్ను తప్పించుకోడానికి వేయి దొంగ బిల్లులు సృష్టించే మధ్యతరగతి మనిషి నుంచి చార్టర్డ్ విమానాల్లో కోట్లకుకోట్లు విదేశాలకు తరలించే బడాబాబుల దాకా... అంతా ఆ పాపంలో భాగస్వాములే. ఒకరి వాటా వేలల్లో ఉండవచ్చు. ఒకరి వాటా కోట్లలో ఉండవచ్చు. అంతే తేడా! నిజానికిదో గొలుసుకట్టు వ్యవహారం. ఎక్కడో మొదలై, ఎక్కడో తేలుతుంది.


ఆదాయం ఒక స్థాయిని మించాక, సంపాదనలో పదిశాతమో, ఇరవైశాతమో, ముప్పైశాతమో ప్రభుత్వానికి చెల్లించాలంటే చాలామందికి మనసొప్పదు. గొణుక్కుంటారు, సణుక్కుంటారు, అడ్డదార్లు వెతుక్కుంటారు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్ల వంటి వృత్తి నిపుణులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధిని చేపట్టినవారు, ఇళ్ల యజమానులు... మొత్తంగా మధ్యతరగతి జీవుల్లో చాలామంది తమ ఆదాయంలో 30 శాతాన్ని లెక్కల్లో చూపడం లేదని అంచనా. అదంతా నల్లడబ్బే వ్యాపారులదీ అదే బాట. రెండు ఖాతాలతో (ఒకటి... అసలు, ఒకటి... నకిలీ) ఆర్థిక వ్యవస్థ రెండు కళ్లూ పొడిచేస్తున్నారు. లాభాల్ని నల్లరంగు గల్లాపెట్టెలో దాచేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్ట డానికి దొంగ సరుకుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ తప్పించు కోడానికి తప్పుడు దిగుమతి పత్రాలు చూపిస్తున్నారు. అమ్మకం పన్ను వదిలించుకోడానికి కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. భారత్ పారిశ్రామిక ఉత్పత్తిలో పదిశాతానికి పైగా ఎక్కడా నమోదు కావడం లేదు. అదంతా నల్లడబ్బే!


'నా ఛాతీ చీలిస్తే గుండె కాదురా... నిజాయతీ ఉంది!' థియేటర్లో పంచ్ డైలాగ్ పేలుతుంది. అభిమానులు వీరావేశంగా డాన్సు చేస్తారు. హీరోగారికి అంత నిజాయతీ ఉంటే, తనకెంత పారితోషికం ముట్టిందో చెప్పమనండి! ఒక్క హీరోలే కాదు, హీరోయిన్లు, దర్శకులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఎవరూ తమ ఆదాయాన్ని బయటపెట్టరు. తీసుకునేదొకటి, చెప్పేదొకొటి, లెక్కల్లో చూపేదొకటి, ఆ తళుకుబెళుకుల వెనుక బోలెడంత నలుపు ఉంది. ఫ్యాక్షనిస్టుల అక్రమ వసూళ్లు, మాఫియాల రక్త సంపాదన నేరుగా ఇండస్ట్రీలోకే వచ్చేస్తున్నాయి.


అదంతా నల్లడబ్బే.

రాజకీయ అవినీతి... అన్ని అవినీతులకూ మూలపుటమ్మ! స్విస్ బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న కారునలుపు కరెన్సీలో సగానికి పైగా రాజకీయ నాయకులదే. ఆ నోటే కనుక మాట్లాడగలిగితే, బోనెక్కి సాక్ష్యం చెప్పగలి గితే... వీళ్లకు శిక్ష ఖరారుచేయడానికి లక్ష సంవత్సరాల క్యాలెండర్లు తయారుచేయాలి. ఆ దుర్మార్గపు కథలు వినలేక, ఉరికొయ్య కూడా కొయ్యబారిపోతుంది. కాంట్రాక్టులు ఇవ్వడానికో రేటు, అంచనా విలువ పెంచడా నికో రేటు, ఖర్మగాలి ప్రాజెక్టు కూలిపోతే కేసుల నుంచి కాపాడటానికో రేటు... ఆ వసూళ్లకు అంతే లేదు, నేతల అవినీతి దాహంలా.


అదంతా నల్లడబ్బే!

ఎన్నికల సమయంలో అయితే, నల్లడబ్బు మురుగునీటిలా ప్రవహిస్తుంది. పారిశ్రామిక వేత్తలు పన్నులెగ్గొట్టి దాచుకున్న సొమ్ములో కొంతభాగం విరాళాల రూపంలో నేతల చేతికి వచ్చేస్తుంది. ఎన్నికల కమిషన్కు చూపించే అసలు లెక్కలకు... వందల రెట్లు, వేలరెట్లు ప్రచారానికి ఖర్చవుతుంది. ఏ పార్టీకీ మినహా యింపు ఇవ్వాల్సిన పన్లేదు. ఏ నాయకుడికీ వీరతాళ్లు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులదాకా. ఆ మురికిని ఇష్టంగా పూసుకునేవారే. వీళ్లా నల్ల కట్టల్ని కట్టడిచేసేది? విదేశీ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొచ్చేది? పునాదులు కదిలి పోవూ? అందుకే, ఏవో తూతూ మంత్రపు ప్రకటనలు చేస్తారు. అదిగో ఇదిగో అంటూ ఐదేళ్ల నాటకం కొనసాగిస్తారు. ఆతర్వాత వచ్చేవాళ్లు ఆ పాటే అందుకుంటారు.


చేతిలో ఫైలు. చక్కని ఇంగ్లీషు. ఎప్పుడో సివిల్ సర్వీసు పరీక్షలు రాసినప్పుడు బట్టీ పట్టిన గాంధీ, నెహ్రూ కొటేషన్లను ధారాళంగా ఉపయోగిస్తుంటారు. ఒంటి మీద ఒక్క మరకా లేని శుభ్రమైన సూటేసుకుంటారు. కానీ, మనసంతా మురికే నేతల నుంచి అంటు కుంది కొంత వ్యాపారవేత్తలు అంటించింది కొంత. స్వయం పాపం కొండంత. ఆ సొమ్మును బంధువుల ద్వారా మిత్రుల ద్వారా రియల్ ఎస్టేటుకు మళ్లిస్తున్నారు, కాంట్రాక్టులు చేయిస్తున్నారు. వాటా ఎక్కువైతే, నేరుగా స్విస్ బ్యాంకే! ఉన్నతాధికారుల జోరు అలా ఉంటే, కిందిస్థాయి సిబ్బంది తీరు మాత్రం వేరుగా ఉంటుందా?


బీరువాల్ని బద్దలుకొడితే చాలు, గుట్టలు " గుట్టలుగా నోట్ల కట్టలే. దాన్ని స్వాధీనం చేసుకోడానికి, అవినీతి నిరోధకశాఖ అధికారులు 'ట్రాలీలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి.


అదంతా నల్లడబ్బే!

ఇక, రాయతీలకు సంక్షేమ కార్యక్రమాలకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నాయి. ఎంపీలూ ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులూ ఉండనే ఉన్నాయి. అందులో రూపాయికి పదిహేనుపై సలు మాత్రమే లబ్దిదారులకు చేరుతోంది. మిగిలిన మొత్తమంతా... నేతలూ అధికారులూ దళారులే మింగేస్తున్నారు.


అదంతా నల్లధనమే!

అంతర్జాతీయ ఆయుధ వ్యాపారం, రక్షణ సామగ్రి కొనుగోలు వంటి వ్యవహారాల్లో గప్ చుప్స్ ఎవరిశాతాలు వారిఖాతాలో పడిపో తుంటాయి. ముంబయి, ఢిల్లీ విమానాశ్రయాల నుంచి ప్రత్యేక విమానాల్లో నోట్ల మూటలు విదేశాలకు తరలిపోతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఏటా స్విట్జర్లాండుకు వెళ్తున్నవారి సంఖ్య లక్షపైమాటే. వాళ్లంతా ఆటవిడుపుకే వెళ్తున్నారని ఎందుకనుకోవాలి?


నిజానికి, పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్నవారిలో 74 శాతం మంది నయాపైసా కూడా విదిలించడంలేదని అరవింద్ విర్మానీ అనే నిపుణుడు తేల్చి చెప్పాడు. అంటే, ఆ ఆదాయమంతా అక్షరాలా నల్లడబ్బే! నిఘా పెంచడం ద్వారా, ఆదాయపన్ను చట్టాల్లో లోపాల్ని సరిచేయడం ద్వారా దేశీయమైన నల్లధనాన్ని కొంతవరకు కట్టడిచేయవచ్చు. అన్నిటికంటే ముందు విదేశాలకు తరలుతున్న నల్లడబ్బును వెనక్కి తీసుకువస్తే సగం తీవ్రత తగ్గినట్టే.  


నల్లడబ్బు అన్ని విధాలా మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రవాహం అధికంగా ఉన్న రియల్ఎస్టేట్, స్టాక్మార్కెట్ వంటి రంగాల్లో బూమ్ బుడగలే ఎక్కువ. చెత్త షేర్లు కూడా కళకళలాడతాయి. ఎందుకూ పనికిరాని స్థలం కోట్లు పలుకుతుంది. ఆ వాపును చూసి బలుపనుకుంటే, సామాన్యుడు సర్వనాశనమై నట్టే! చలామణిలో ఉన్న మొత్తంలో సగానికి సగం నల్లడబ్బే అయినప్పుడు, సర్కారు ఖజానాకు సగానికి సగం ఆదాయం తగ్గిపోయి నట్టే. ఆ మేరకు సంక్షేమ కార్యక్రమాలు మందగించినట్టే. బడ్జెట్లో లోటు పెరుగుతుంది. బుద్ధిగా కట్టే సామాన్యులకు పన్నుపోటు ఎక్కువవుతుంది. కరెన్సీ ప్రవాహం పెరిగి ద్రవ్యోల్బణం అధికం అవుతుంది. ధరలకు రెక్కలొస్తాయి. ఉన్నవారికీ లేనివారికీ మధ్య అంతరం పెరిగిపోతుంది. నిరుపేదల్లో అసంతృప్తి ఎక్కువవుతుంది. అది ఏ వేర్పాటు వాదానికో దారితీయవచ్చు.


నలుపు-తెలుపు

నానాగడ్డీ తిని సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి మన నాయకులూ సినీతారలూ వ్యాపారవేత్తలూ విదేశీ బ్యాంకుల్లో పోగేస్తారు. అక్కడే ఎందుకంటే? నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది? ఎన్ని కొంపలు కూల్చావు? ఎన్ని అడ్డదార్లు తొక్కావు? ...అని మాటవరసకైనా అడగరు. ఇవ్వగానే, కళ్లకద్దుకుని తీసుకుంటారు. ఖాతా వివరాలూ గోప్యంగా ఉంచుతారు. ఆయా దేశాల చట్టాలు అందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. లగ్జంబర్గ్, లీటెన్స్టీన్, చానల్ ఐలండ్స్, బహమాస్... లెక్కాపత్రంలేని డబ్బును డిపాజిట్లుగా స్వీకరించడానికి కాచుకుని ఉంటాయి. కొన్ని చిన్నాచితకా దేశాలకూ ద్వీపాలకూ ఇదో ప్రధాన వ్యాపారం. స్విట్జర్లాండ్ అయితే, గడ్డికరిచే నేతలకు స్వర్గధామమే. స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2006 నాటికే... మన భారతీయులు 66 లక్షల కోట్లు అక్కడ పోగేసుకున్నారు. దాన్ని తెల్లగా మార్చేసుకో డానికీ దొడ్డిదార్లున్నాయి. విదేశీ సంస్థాగత ముదుపర్ల (ఎఫ్ఎఐ) రూపంలో మన దేశంలో పెట్టుబడులు పెడతారు. ఆతర్వాత దాన్నే ఏ బినామీ పేరు మీదో నష్టానికి అమ్మేసుకుంటారు. ఇంకే ముంది, అంతా మిరుమిట్లుగొలిపే తెలుపే! మౌలికవనరులు, రియల్ఎస్టేట్, స్టాక్మార్కెట్, కమోడిటీ మార్కెట్ తదితర రంగాల్లో జరుగుతున్నది అదే. గత ఏడాది ఎఫ్ఎఐల రూపంలో వచ్చిన పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా? లక్షా ముప్ఫై వేలకోట్లు! ఇదోరకమైన ఆర్థిక ప్రదక్షిణ. ● Kako JORJER 98898... మళ్లీ వెళ్లినచోటికే వచ్చేస్తుంది. వాటివెనక ఎవరున్నారన్నది సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖలకు తెలియంది కాదు. ఆ ముగ్గురే... నేతలు, అధికారులు, వ్యాపారవేత్తలు.


ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఏం చేస్తున్నావు?... అని ఎవరడిగినా 'చేయడానికేముంది' అనే చెబుతుంటాడు. గోపీచంద్ 'అసమర్థుని జీవయాత్ర' కథానాయ కుడు. మన పాలకులూ ఆ అసమర్థుని అంశే! కాకపోతే, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, కాస్త లౌక్యంగా జవాబిస్తారు. కమిటీలు వేస్తున్నాం, ఒప్పందాలు చేసుకుంటున్నాం, అధ్యయనాలు చేస్తున్నాం... అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ అరవై ఏళ్లలో ఒరిగిందేం లేదు. ఒకటిరెండు కమిటీలు, ఆరేడు స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకాలు, అంతర్జాతీయ ఒప్పందాల పేరుతో కాలయాపనలు తప్పించి... జరిగిందేం లేదు!


అమెరికా, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ఒకప్పుడు బ్లాక్మనీ సంక్షోభంలో కూరుకుపోయినవే. కానీ అక్కడి పాలకులు కాస్త చిత్తశుద్ధితో వ్యవహరించారు. కరెన్సీ ప్రవాహాన్ని కట్టడిచేశారు. అమెరికా ప్రభుత్వం 'మా పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలు బహిర్గతం చేసి తీరాల్సిందే' అంటూ స్విస్ బ్యాంకును దబాయించేసింది.


చివరికి, బ్యాంకువాళ్లు దిగిరాక తప్పలేదు. దాదాపు 3,500 కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. మనవాళ్లకు అంత ధైర్యం ఉందా? బలహీన ప్రభుత్వాలు, బ్లాకుమెయిలింగ్ భాగస్వాములు, రబ్బరు స్టాంపు పాలకులు... ఎవరి దయాదాక్షిణ్యాల తోనో నెట్టుకొస్తున్న అధినేతలు పార్లమెంటు లోనే మాట్లాడలేరు. ఇక, అంతర్జాతీయ వేదికలమీద నోరువిప్పుతారా?


వెనక్కి తెప్పిస్తే...


,


విదేశాల్లో మూలుగుతున్నదంతా జనం 'సొమ్మే. కడుపుకొట్టి ఒకరు, కాంట్రాక్టుల పేరుతో ఒకరు, వాటాల ముసుగులో ఒకరు... ఆ పెద్దలంతా గద్దల్లా తన్నుకెళ్లారు. నయాపైసా వదలకుండా ఊడ్చుకు రావాల్సిందే. దాంతో ఏం చేయాలన్నది. తర్వాత నిర్ణయించుకోవచ్చు. విదేశీ రుణాలు తీర్చుకోవచ్చు. మన అప్పుల కంటే ఆ మొత్తం పదమూడు రెట్లు ఎక్కువ. నలభైఅయిదు కోట్లమంది నిరుపేదలకు తలా లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చినా... ఆ బతుకులు బాగుపడిపోతాయి. దాని మీద వచ్చే నామమాత్రపు వడ్డీతోనే వార్షిక బడ్జెట్ నడిచిపోతుంది. ఆ డబ్బునే కనుక మౌలిక సదుపాయాల కల్పనకు మళ్లిస్తే, లక్షల కిలోమీటర్ల రోడ్లు వేసుకోవచ్చు. కొత్త రైల్వే లైన్లు ప్రారంభించవచ్చు. ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. పారిశ్రామిక రంగమూ బాగుపడుతుంది. ఎంతోమంది బడుగు రైతులను రుణవిముక్తులను చేయవచ్చు. ఆత్మహత్య ఆలోచనలు రాకుండా కాపాడుకో వచ్చు. ప్రతి గ్రామానికీ నాలుగు కోట్ల చొప్పున కేటాయిస్తే... పల్లెలు సకల సౌకర్యాలకూ నెలవులు అవుతాయి. 'ఆ డబ్బే కనుక వస్తే... భారత్ సంపన్నదేశాల జాబితాలో చేరడం ఖాయం' అంటారు. 'హూ ఓన్స్ ద సీబీఐ' రచయిత బి.ఆర్.లాల్. ఆ మాత్రం తెగిస్తే... ఆ నల్ల డబ్బు యజమానులు బతికినంత కాలం కుళ్లికుళ్లి చస్తారు. అంతకు మించిన శిక్ష అక్కర్లేదు. భవిష్యత్తులో ఇంకెవరూ ఆ సాహసం చేయలేరు.


ఇదంతా అసాధ్యమేం కాదు. కాస్త చొరవ, కాస్త చిత్తశుద్ధి ఉంటే చాలు. ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి తెచ్చి, స్విస్ బ్యాంకింగ్ చట్టాల్ని సవరిస్తే సరిపోతుంది. అంతెందుకు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దుర్ఘటన తర్వాత... అమెరికా ఒత్తిడి కారణంగా స్విట్జ ర్లాండ్ ప్రభుత్వం తీవ్రవాదుల స్విస్ ఖాతాల్ని స్తంభింపజేసింది. మాదక ద్రవ్యాల వ్యాపారుల లావాదేవీల మీద నిఘా ఉంచింది. ఫెర్డినాండ్ నార్కోస్ దాచుకున్న 28 వేల కోట్ల రూపాయ లను ఫిలిప్పీన్స్కు తిరిగి ఇప్పించింది. నియంత అబాచా దోచుకెళ్లిన 20 వేల కోట్ల రూపాయలను నైజీరియాకు పంపించింది. బెనజీర్, జర్దారీల ఖాతా నుంచి కూడా పాక్ ఖజానాకు డబ్బులు వెళ్లాయి. అయినా చిన్నాచి తకా దేశాలు కూడా బ్యాంకుల్ని నిలదీసి నల్ల డబ్బు వసూలు చేస్తుంటే, మన పాలకులు మాత్రం ఆ సంగతి ఎత్తితేనే తోకముడిచేస్తున్నారు.


నల్లడబ్బు అంకెలు పెరిగాయంటే, అవినీతి రంకెలేస్తోందనే అర్థం. ఆ రెండూ ఉన్న చోట... అధిక ధరలు, నిరుద్యోగం, అవ్యవస్థ రాజ్యమేలుతుంటాయి. ఏడేడుతరాలకు సరిపడా దాచుకోవాలన్న, దోచుకోవాలన్న తపన ఏ విపరిణామాలకు దారితీస్తుందో చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది. తాజాగా హోస్నీముబారక్ ఉదంతమూ నిరూపించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దిద్దుబాటు చర్యలు ఇప్పటికీ లోపిస్తే ఈజిప్టులో జరిగిందే మన దగ్గరా జరగవచ్చు!


అపుడిక... కరెన్సీ కట్టల్ని దాటించడం కాదు, నేతలే సరిహద్దులు దాటాల్సి ఉంటుంది- జనాగ్రహాన్ని తప్పించుకోడానికి, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వారికి, చరిత్రే గుణపాఠాలు నేర్పుతుంది.

—-------------

ఆర్డర్ ఆర్డర్ 

(న్యాయస్థానాల అక్షింతలు)


“మీకు ఆ వ్యక్తులెవరో తెలుసు, ఎక్కడ దాచుకున్నారో తెలుసు. అయినా, ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారు. ఏవో ఒప్పందాల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారి మీద మీరు తీసుకున్న చర్యలేమిటో చెప్పండి చూద్దాం”


“అంత డబ్బు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరికి తెలుసు... ఆయుధాల వ్యాపారం ద్వారా కావచ్చు. స్మగ్లింగ్ ద్వారా కావచ్చు. మాదకద్రవ్యాల రవాణా ద్వారా కావచ్చు. అంతకంటే ఘోరమైన ఇంకేదో మార్గం ద్వారా కావచ్చు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం"


"నల్లధనం... చాలా తీవ్రమైన సమస్య. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. తూతూమంత్రంగా అఫిడవిట్లు దాఖలు చేస్తోంది... “


"విదేశాల్లోని నల్లధనాన్ని వెలికి తీయాలంటే, శుష్క వాగ్దానాలూ ప్రకటనలూ సరిపోవు. మళ్లీ మరో మహాత్మా గాంధీ లేదంటే భగత్ సింగ్ పుట్టాలి. నల్లధనాన్ని వెలికితీసే సాహసం చేస్తే దేశం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సమస్యల్ని పరిష్కరించవచ్చు.”

—-------------

దొంగల బ్యాంకు!

వాచీలూ చాక్లెట్లూ అమ్ముకుని బతికే స్విట్జర్లాండు ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల జాబితాలో రెండో సానంలో ఉందంటే, అందుక్కారణం... స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ ప్రవాహమే! నల్లడబ్బు సగానికి సగం మనదే కాబట్టి, పరోక్షంగా మనం స్విట్జర్లాండును పోషిస్తున్నట్టే. ఇక్కడ మింగను మెతుకులేదు కానీ, అక్కడ మాత్రం సంపంగి నూనెలు! 'మీ డబ్బూ మీ ఇష్టం. ఎవర్నయినా దోచుకోండి. ఎంతైనా దాచుకోండి. చచ్చినా మీ పేర్లు బయటపెట్టం. ఆ పూచీ మాది' అన్న నిబంధనతో బ్యాంకులు నడపాలనే (పాడు) ఆలోచన స్విట్జర్లాండ్కు ఎందుకొచ్చిందో తెలుసుకోవా లంటే... చరిత్రలోకి వెళ్లాలి.


రెండు ప్రపంచయుద్దాల్లోనూ స్విట్జర్లాండ్ తటస్థంగానే ఉంది. ఇరు వర్గాలతోనూ సత్సంబంధాలు కొనసాగిం చింది. ఆ చొరవతోనే ఓ బ్యాంకును ప్రారంభించింది.


యుద్దాల బరిలో లేని దేశం కాబట్టి, సొమ్ము సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో...అటుపక్కవారూ ఇటుపక్కవారూ పోటీపడి దాచు కున్నారు. శత్రుదేశాల వారికి తమ ఆర్థిక పరిస్థితి తెలిస్తే ఎలా? అన్న అనుమానాన్ని వదలగొట్టడానికి... ప్రత్యేకంగా చట్టాలు చేసింది ఆ దేశం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత... అంతర్జాతీయ రాజకీయాల్లో, పారిశ్రామిక వాతావరణంలో ఎన్నో మార్పులొచ్చాయి. అవన్నీ స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థకు కలిసొచ్చాయి. ఇంకేముంది..అవినీతి నేతలు, అక్ర మాల అధికారులు, మాదకద్రవ్యాల వ్యాపారులు..అడ్డదారి సంపన్నులంతా స్విట్జర్లాండ్ దారిపట్టారు.


—-------------

క్షమిస్తాం...రండి!


సుప్రీం కళ్లెర్రజేస్తోంది. ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలూ కాస్త ఆలోచిస్తున్నట్టే కనబడుతున్నారు. ఏదో ఒకటి చేయకపోతే పరువుపోయేలా ఉందని కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే మరోసారి స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. 'బాబ్బాబూ! ఈ ఒక్క అవకాశం ఇస్తాం! మీ ఆదాయాన్ని బహిర్గతం చేసి, ఉన్నదంతా తెల్లగా మార్చేసుకోండి' అంటూ సర్కారు వారు ఓ ప్రకటన జారీ చేస్తారు. స్పందించాలనుకునేవారు స్పందిస్తారు. కొంత జరిమానా చెల్లిస్తారు. తేలిగ్గా తీసుకోవాలనుకునేవారు తేలిగ్గానే తీసుకుంటారు. ఇప్పటికీ ఈ పథకాన్ని ఆరుసార్లు ప్రకటించారు. చివరగా, 1997లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు. మొత్తం 33 వేల కోట్ల నల్లడబ్బు బయటికొచ్చింది. నిజానికి మార్కెట్లో ప్రవహిస్తున్న లెక్కకందని సొమ్ముతో పోలిస్తే ఇది తక్కువే. ఇలాంటి పథకాలు నిజాయతీగా పన్ను కట్టే సామాన్య పౌరుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయన్న విమర్శా ఉంది. కాకపోతే, ఎంతోకొంత నల్లధనాన్ని అరికట్టామన్న సంతృప్తి పాలకులకు మిగులుతుంది. ఖజానాకూ కాస్త ఆదాయం వస్తుంది.


—-------------

అంకెలు...రంకెలు!


1948 నుంచి 2008 దాకా భారత్ నుంచి తరలివెళ్లిన నల్లధనం రూ.20 లక్షల కోట్లు. ఈ మొత్తం మనమంతా గగ్గోలుపెడుతున్న 2జీ స్కాము కంటే చాలా ఎక్కువ!


* ఆర్థిక సరళీకరణ తర్వాత నల్లధనానికి రెక్కలొచ్చాయంటారు ఆర్థికవేత్తలు. ఆ పాపభారంలో యాభైశాతం 1991 తర్వాత పుట్టుకొచ్చిందే.


* భారతీయ కుబేరుల స్విస్ బ్యాంకు నిల్వలు రూ.66 లక్షల కోట్లు. ఆ వరుసలో మన వెనకాలే నిలుచున్న దేశాలివి... రష్యా (రూ.22 లక్షల కోట్లు), బ్రిటన్ (రూ. 18 లక్షల కోట్లు ), ఉక్రెయిన్ (4.5 లక్షల కోట్లు), చైనా (4 లక్షల కోట్లు).


* పదేళ్ల క్రితం... అంటే 2000లో స్థూల జాతీయోత్పత్తిలో నల్లధనం వాటా 23 శాతం ఉండేది. 2006 నాటికి అది 25.6 శాతానికి పెరిగింది. ఈ తొమ్మిదేళ్లలో మనదేశ సమాంతర ఆర్థిక వ్యవస్థ జీడీపీలో 24 శాతంగా ఉంది.


* మార్కెట్ ఊపు చూస్తుంటే, ఈ ఏడాది భారతీయులు వేయి టన్నుల బంగారాన్ని కొనబోతున్నట్టు అంచనా. ఆ విలువ దాదాపు 50 వేల కోట్లు. వజ్రాల కోసం మరో ఆరువేల కోట్లు ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇందులో డెబ్భై అయిదు శాతం, నల్లధనానికి పచ్చరూపమే! ధర పడిపోతుందన్న భయం లేదు. ఓమూలన దాచేసుకోవడమూ పెద్ద కష్టం కాదు. 





Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

రామాయణ దృక్పథం

బెండమూరి లంక - వంశీకృష్ణ