భగవద్గీత యోగాల ఉపోద్ఘాతం
భగవద్గీత యోగాల ఉపోద్ఘాతం
1-అర్జునవిషాద యోగము:- 47
అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
2. సాంఖ్య యోగము:- 72
ఇది గీతలోని త్తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరిస్తాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరిస్తాడు.
3. కర్మ యోగము:-43
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును.
4. జ్ఞాన యోగము:-42
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు.
5. కర్మసన్యాస యోగము:-29
కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు.
6. ఆత్మసంయమ యోగము:-47
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి.
7. విజ్ఞాన యోగము:-30
భగవంతుడు అన్నింటిలో నేనే ఉన్నాను అంటూ వివరిస్తాడు. తన కంటే ఉత్తమమైన లేదా అని వివరిస్తాడు
8.అక్షరపరబ్రహ్మ యోగము:-28
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
9. రాజవిద్యారాజగుహ్య యోగము:-34
ఇది పవిత్రమైన జఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది.
10.విభూతి యోగము:-42
సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు భగవానుని తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి.
11. విశ్వరూపసందర్శన యోగము:-55
అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. అందుకై కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ప్రస్తుతించెను.
12.భక్తి యోగము:-20
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను.
13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:-35
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
14.గుణత్రయవిభాగ యోగము:-27
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను.
15.పురుషోత్తమప్రాప్తి యోగము:-20
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
16. దైవాసురసంపద్విభాగ యోగము:-24
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను.
17.శ్రద్దాత్రయవిభాగ యోగము:-28
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
18.మోక్షసన్యాస యోగము:-78
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
Comments
Post a Comment