టంగుటూరి ప్రకాశం పంతులు
©️ #ఈనాడు
#భవ_భారతదేశం
#DekhoApnaDesh
టంగుటూరి ప్రకాశం పంతులు
నూటయాభై ఏళ్ల క్రితం ఆగస్టు 23న పేదరికంలో పుట్టిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. భర్త దూరమైనా, ధైర్యంతో పూటకూళ్ల వృత్తిని చేపట్టిన ప్రకాశం తల్లి కుమారుణ్ని తీర్చిదిద్దారు. అప్పుడే ఒంగోలు మిషన్ హైస్కూలులో పనిచేసే ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ప్రకాశంలో నటుణ్ని గుర్తించి, స్త్రీ పాత్రలకు బాగుంటారని భావించారు. రుసుము లేకుండా మిషన్ హైస్కూల్లో చేర్పించి, వాత్సల్యం చూపారు. వకీలు అవ్వాలన్న ఆకాంక్ష చిన్నతనం నుంచే నరనరాల్లో నింపుకొని మద్రాసు న్యాయ కళాశాలలో చదివి రెండో శ్రేణి ప్లీడరుగా నమోదయ్యారు. గురువును వదలి ఉండలేక రాజమండ్రిలోనే వృత్తిని చేపట్టారు. గురువుతో పాటు చిలకమర్తి లక్ష్మీనరసింహంతో కలిసి ఓ నాటక సమాజాన్ని స్థాపించి అనేక పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించేవారు. మొదటి నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన ప్రకాశం 27 ఏళ్ల వయసులో మున్సిపల్ కౌన్సిలర్, తరవాత చైర్మన్గా ఎన్నికయ్యారు. స్నేహితుల సహకారంతో 1904లో ఇంగ్లాండ్ వెళ్ళి, బారిస్టర్ పూర్తి చేసి, మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, న్యాయం వైపు నిలబడే లక్షణాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టాయి. బారిష్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా, మద్రాసు లా టైమ్స్ పత్రిక సంపాదకులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పేదల పక్షపాతిగా పేరుతో పాటు డబ్బునూ గడించారు.
వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో ప్రకాశం ధైర్యంగా అనేక సభలకు అధ్యక్షత వహించారు. 1921లో నాగ్పుర్ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఎందరో మహనీయులు తమ వృత్తులను మానేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం కూడా అదే బాటలో నడిచారు. దేశం కోసం వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. నిర్భయంగా వార్తలను అందిస్తూ బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన ఆ పత్రిక ఆంగ్లం, తెలుగు, తమిళ భాషల్లో వెలువడేది. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని నాటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకాశం ముందుండి నడిపించారు. ఆ సమయంలో ప్రభుత్వం కాల్పుల ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటికే ఓ యువకుడు వీరమరణం పొందారు. అతడి భౌతిక దేహాన్ని చూడటానికి వెళ్తున్న ప్రకాశాన్ని సిపాయిలు అడ్డుకున్నారు. ముందుకు వెళితే కాల్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధైర్యముంటే తనను కాల్చమంటూ బ్రిటిష్ తుపాకికి గుండెను చూపి నిలబడ్డారు. వెంటనే తుపాకి నేలను చూసింది, జైజై నినాదాలు ఆకాశాన్ని తాకాయి. ఆ తరవాత 1929 లాహోర్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, రాష్ట్ర అధ్యక్ష పదవికి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గాంధీజీ దండి సత్యాగ్రహానికి చలించిపోయి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, అరెస్టయి జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో కుటుంబం ఆర్ధికంగా చితికిపోయి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చినా ఏ మాత్రం చలించలేదు. 1945లో జైలు నుంచి విడుదలై తెలుగు నాట విస్తృతంగా పర్యటించారు.
భావి తరాలకు ఆదర్శం....:
టంగుటూరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 1946లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా మహాత్ముడి బాటలో అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ ఖైదీల విడుదల, గ్రామస్థుల నుంచి వసూలైన ఉమ్మడి పన్ను తిరిగి పంపకం, 1942 ఉద్యమంలో నష్టపోయిన ఉపాధ్యాయులకు ఉద్యోగాలు, భారత స్వరాజ్య ఉద్యమ జెండాను ప్రభుత్వ భవనాల మీద ఎగురవేయరాదనే నిషేధం రద్దు, హరిజనులకు దేవాలయ ప్రవేశం, పలు జిల్లాల్లో మద్యనిషేధం, ఆహార ధాన్యాల కొనుగోలు, పంపిణీ పథకం లాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాపించడమే కాకుండా గ్రామ సేవకుల శిక్షణా శిబిరం నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధి స్ఫూర్తి నుంచి వచ్చినదే ఫిర్కా అభివృద్ధి పథకం. అందులో పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు ఉద్యోగాలు ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య ఎప్పుడొచ్చినా పోలీసులతో పని లేకుండా స్వయంగా రంగంలోకి దిగేవారు. కార్మికుల సమస్యలను, మత ఘర్షణలను అనేకమార్లు నేరుగా పరిష్కరించారు. 1947లో స్వాతంత్ర్యం రాకముందే అవిశ్వాస తీర్మానం కారణంగా పదవీచ్యుతులయ్యారు. ఆ తరవాత, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితులైన ప్రకాశం 84 ఏళ్ల వయసులో సైతం రాష్ట్రమంతా పర్యటిస్తూ వడదెబ్బకు గురై, 18 రోజులు ఉస్మానియా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి పరమపదించారు. చిన్నతనం నుంచి ఆయన బాధలకు, దుఃఖాలకు కలత చెందలేదు. ఎదిరించి నిలబడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం తప్ప తన సుఖం కోసం పాకులాడలేదు. కుమారుడిగా, విద్యార్థిగా, శిష్యుడిగా, గురువుగా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రతి సందర్భంలో నమ్మిన సిద్ధాంతానికి నిలబడిన ప్రకాశంలోని పట్టుదల, నిర్భీతి, నిష్కపటం, నిష్కళంక వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శనీయం!
మహాత్ముడి బాటలో...:
మహాత్మాగాంధీ అత్యంత నమ్మకంతో తన నిజమైన వారసుడిగా ప్రకాశాన్ని గుర్తించారు. దానికి తగ్గట్టుగానే ఖాదీ, మద్యపాన నిషేధం, హరిజనుల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి, ఫిర్కా పథకం, ఉత్పత్తి, వినియోగదారుల సహకార సంఘాలు తదితర పథకాల ద్వారా మహాత్ముడి ఆలోచనలను అమలు చేసి చూపించారు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా చట్టంలో పంచాయతీ వ్యవస్థకు స్థానం కల్పించేందుకు ఎంతగానో కృషి చేశారు. గ్రామీణ భారత పునాదులపై రాజ్యాంగం ఆరంభం కావాలన్నదే మహాత్ముడి ఆకాంక్ష అని గట్టిగా వాదించారు
Comments
Post a Comment