శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి సూత్రాలు

శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి సూత్రాలు

పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష - ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు. 

అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి. కైవల్యోపనిషత్తు ఇలా వచిస్తోంది: 

"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."

శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు.

"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం. 
ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే.

"కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."

"నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోర్మెలు దాగి ఉంటాయి. 

ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా? అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది. 

ఆ విధంగా కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొటే, సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి." 

ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. రామకృష్ణుల మనస్సులో కూడా 
అవి మెదలకపోలేదు. ఆయన ఇలా జ్ఞాపకం చేసుకున్నారు:

"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు - ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనస్సును ఇలా ప్రశ్నించాను: 

'నీకు ఏం కావాలి? వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్ప, అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు. భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."

ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక - బద్ధ శత్రువు. ఈ శత్రువును తుదముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని - త్యాగాగ్ని జ్ఞానాగ్ని యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు.

రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు:

"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి, 'ఓ ప్రభూ! ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు.

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)