తొలి అమరజీవి జతీంద్రనాథ్‌ దాస్‌

తొలి అమరజీవి జతీంద్రనాథ్‌ దాస్‌ గారికి నా నివాళులు: 

1904లో కోల్‌కతాలో జన్మించిన జతీంద్రనాథ్‌ దాస్‌ ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. మహాత్ముడి పిలుపుతో 17వ ఏటనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న జతీంద్ర అనుశీలన్‌ సమితి అనే విప్లవవాద బృందంలో చేరారు. కోల్‌కతాలో బీఏ చదివేటప్పుడు రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటున్నాడనే నెపంతో మైమెన్‌సింగ్‌ సెంట్రల్‌ జైలు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో పెట్టారు. ఆ జైలులో పరిస్థితులకు నిరసనగా 21రోజులు జతీంద్ర నిరాహార దీక్ష చేయటంతో జైలు సూపరింటెండెంట్‌ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత దేశంలోని ఇతర విప్లవకారులతో జతీంద్రకు సంబంధాలు ఏర్పడ్డాయి. భగత్‌సింగ్‌ తదితరుల కోసం బాంబు తయారీకి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 1929 జూన్‌ 14న జతీంద్రను మళ్లీ అరెస్టు చేసి... లాహోర్‌ కుట్రకేసులో ఇరికించి లాహోర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులున్నదీ అక్కడే!

ఆ జైలులో కూడా తెల్లఖైదీలు, భారతీయుల మధ్య వివక్షను, జైలులో దారుణమైన పరిస్థితులను నిరసిస్తూ, రాజకీయ ఖైదీల హక్కుల కోసం జతీంద్ర ఆమరణదీక్షకు దిగాడు. తొలుత పట్టించుకోని జైలు అధికారులు పరిస్థితి చేయి దాటకుండా బలవంతంగా తినిపించే ప్రయత్నం చేశారు. కానీ, తను లొంగలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో భయపడ్డ జైలు అధికారులు జతీంద్రను విడుదల చేయాలని నిర్ణయించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుదలకు పోయి అందుకు నిరాకరించింది. కావాలంటే బెయిల్‌ ఇద్దాం.. అంటూ ప్రతిపాదించింది. లక్ష్యం సాధించకుండా దీక్ష విరమించేందుకు జతీంద్ర అంగీకరించలేదు. ఫలితంగా... 63 రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం సెప్టెంబరు 13న జతీంద్రనాథ్‌ అమరుడయ్యాడు. ఈ వార్త తెలియగానే లాహోర్‌ జైలు వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అంత్యక్రియలు కోల్‌కతాలో చేద్దామని నిర్ణయించారు. అమరుడి పార్థివదేహాన్ని తీసుకు రావటానికి సుభాష్‌చంద్రబోస్‌ 6వేల రూపాయలు పంపించారు. లాహోర్‌ నుంచి రైలులో బయలుదేరితే.. ప్రతి స్టేషన్‌లోనూ ఆపటమే... అంతా భోరున విలపిస్తూ నివాళులర్పించటమే! కాన్పుర్‌లో నెహ్రూ, అలహాబాద్‌లో కమలానెహ్రూ రైలునాపి జతీంద్రకు అంజలి ఘటించారు. కోల్‌కతా హౌరా స్టేషన్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ స్వయంగా వెళ్ళి పార్థివదేహాన్ని స్వీకరించారు. రైల్వేస్టేషన్‌ నుంచి శ్మశానవాటిక దాకా కోల్‌కతా అంతా జనసంద్రంతో నిండిపోయింది. సుమారు 6లక్షల మంది ప్రజలు ఆ రోజు జతీంద్ర అంతిమయాత్రలో పాల్గొన్నారని బ్రిటిష్‌ ప్రభుత్వం అంచనా వేసింది! అంతమందిని చూసి అదిరిపోయిన బ్రిటిష్‌ పాలకులు ఆ తర్వాత మరే విప్లప వీరుడు చనిపోయినా వారి మృతదేహాలను బంధువులకు అప్పగించలేదు.

మూలం: Eenadu.net 
సవరణ: ఆనాభాశ్యా
#AzadiKaAmritMahotsav 
#DekhoApnaDesh

Comments

Popular posts from this blog

Geeta Jayanti (Special)

బెండమూరి లంక - వంశీకృష్ణ

రామాయణ దృక్పథం