శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

"తెలుగువెలుగు" పత్రికతో బాలు గారు పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు...
నా జీవితం తెరచిన పుస్తకం. నా గురించి అందరికీ అంతా తెలుసు. ఏదో గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు.. నాకు అది ఇష్టం ఉండదు. నా పేరు ముందర అవి పెట్టి రాయడమూ నచ్చదు. గొప్ప గాయకుణ్ని కాకపోవచ్చు కానీ, నేను మంచి గాయకుణ్ని. సంగీత సాహిత్యాల్లో అభినివేశం లేకపోతే గాయకులు కాలేరు. సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని పాడితేనే ఎవరైనా రాణిస్తారు. అందుకే ఆ దిశగా నన్ను నేను సానబెట్టుకుంటూ వస్తున్నాను. నిజం చెప్పాలంటే అది చాలా అవసరం. ‘పాడుతా తీయగా’ వేదిక మీద కానీ, మరోచోట కానీ అవకాశం వచ్చినప్పుడల్లా పాటల సాహిత్యం గురించి మాట్లాడతాను.. అక్షరం పట్ల నా ప్రేమ అది. ఎక్కువగా చదవడం వల్ల అబ్బిన లక్షణమది.. చదవడం అంటే పుస్తకాలొక్కటే కాదు. వ్యక్తులను చదువుతాను. వారి మాటలను శ్రద్ధగా వింటాను. ఏ సభకు నాకు ఆహ్వానం వచ్చినా రెండు విషయాలు ఆలోచిస్తాను. ఆ సభకు నావల్ల ఏదైనా ఉపయోగం ఉందా.. లేకపోతే అక్కడి నుంచి నేనేమైనా కొత్తవి తెలుసుకోగలుగుతానా అని! అలా వెళ్లినప్పుడల్లా గొప్ప వక్తల మాటలను వింటాను. వాళ్లు మాట్లాడే మంచి విషయాలను ఆకళింపు చేసుకుని పదిమందికీ చెబుతూ ఉంటాను.  

యాభై నాలుగేళ్ల నా గాన ప్రస్థానంలో దాదాపు నలభై ఎనిమిదేళ్లు అసలు తీరిక లేకుండా ఉన్నాను. ఒక రోజులో పది పాటలకు పైగా పాడిన సందర్భాలున్నాయి. గత ఆరేడేళ్లుగా రోజుకు కనీసం ఒక్క పాటైనా పాడుతున్నాను. అంటే, ఇప్పటికీ వృత్తిపరంగా చురుగ్గానే ఉన్నాను. అయితే, ఓ పాట పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుంది. నా గళానికి సరిపోయే శ్రుతులను చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మంచి సాహిత్యం ఉండే పాటలనే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అందరూ మల్లాది, వేటూరి, సిరివెన్నెలలా రాయాలనుకోను కానీ, ఏ పాట సాహిత్యంలోనైనా ఓ పద్ధతి ఉండాలి. అది గమనిస్తాను. అలాగే, అర్థంపర్థం లేని బాణీలు ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఈ కారణాలేవీ వారికి చెప్పను. ‘ఈ పాటను నేను పాడలేనేమోనండీ’ అని చెప్పి తప్పించుకుంటాను. సాహిత్యం లేకపోతే సంగీతం లేదు. ఒక భావాన్ని, సందర్భాన్ని సినిమాలో చెప్పాలన్నప్పుడు ఓ మంచి బాణీతో చక్కటి అక్షరాల మాలికగా కలిపితేనే వినేవాడికి అది అందంగా చేరుతుంది. అందుకే మాటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. 

ఆషామాషీగా పాడకూడదు
పాటల్లోని పదాలను నేను తప్పుగా ఉచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. వాటి గురించి ‘పాడుతా తీయగా’లో లేదా కచ్చేరీల్లోనూ చెబుతుంటాను. ‘ఈ పొరపాటు జరిగింది.. ఆ రోజు నన్ను ఎవరూ సరిదిద్దలేదు’ అంటూ ఇలా పాడకండని పిల్లలకు చెబుతుంటాను. నేనే కాదు నాకంటే పెద్దవాళ్లు పాడిన పాటల్లో కూడా ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. కానీ, వాటిని సరిదిద్దాల్సిన వాళ్లు అప్పట్లో ఎందుకు పట్టించుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గాయకులకు భాషపట్ల అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి.. దాన్ని ఆనందించాలి. ఆ ఆస్వాదనలోంచి పాటను బయటికి తీసుకురావాలి. అప్పుడే ఆ పాట చాలా అందంగా తయారవుతుంది. ఒక పాట కోసం సంగీత దర్శకులు, రచయితలు చాలా కసరత్తు చేస్తారు. అలా పాటంతా సిద్ధమైన తర్వాతే మా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత గాయకులు తమ వంతు కసరత్తు చేసి పాడాలి. ఒప్పుకున్న ప్రతి పాటకూ ఇలాగే న్యాయం చేయాలి. సంగీత దర్శకుడు చిన్నవాడనో లేదా మన పాటకు నటించే వారు చిన్న కళాకారులనో చెప్పి గాయకులు అల్లాటప్పాగా పాడేయకూడదు. మన పాటకు అభినయించేది ఎవరు? అతని ముఖంలో ఏ భావమూ ఉండదు. మనం ఎలా పాడితే ఏంటి అని పాడేసి వెళ్తే అర్థముండదు. శ్రోతలను దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా పోయిన తర్వాత కూడా పాట బతికుంటుంది. దాన్ని వినేవాళ్లకు రసాను భూతిని కలిగించాలి. అప్పుడే గానానికి సార్థకత. సంగీత దర్శకుడు నన్ను నమ్మి పాట ఇచ్చినందుకు తగిన న్యాయం చేశాననే సంతృప్తి మనకుండాలి. ఇష్టం లేకపోతే అసలు ఒప్పుకోకూడదు. 

ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నా!
నా జీవితంలో ‘పాడుతా తీయగా’ ఓ గొప్ప ఘట్టం. దాన్ని ప్రారంభించి ఇరవై ఏళ్లు దాటిపోయింది. దీనికి సంబంధించి రామోజీరావు, బాపినీడు, ఎన్వీ శాస్త్రి గార్లకు నా ధన్యవాదాలు. ‘ఇది నేను చేయలేను.. నా వల్ల కాదు’ అని తప్పించుకుని తిరుగుతున్నప్పుడు వీరు ముగ్గురూ పట్టుబట్టి నాతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. అది నాకెంతో ఉపయుక్తమైంది. అలాగే, ప్రజలకూ చాలా నచ్చింది. చాలామంది పిల్లలు దీంతో పైకి వచ్చారని అంటారు. పిల్లల్లో సహజ నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చానంతే. వాళ్లు నడిచే దారిలో ముళ్లు, రాళ్లు ఉంటే తీసి పక్కన పెట్టాను. వాళ్లను వాళ్లు ఎలా పదును పెట్టుకోవాలో తెలియజేశాను. వీటితో పాటు వాళ్లు పాడుతున్నప్పుడు నేను చేసిన తప్పుల గురించీ బాగా ఆలోచించుకున్నాను. కొన్ని పాటలు వాళ్లలా ఎందుకు పాడలేకపోతు న్నానని అనిపించింది. పిల్లల కృషిని చూసి చాలా ఆనందమేసింది. ‘పాడుతా తీయగా’లో ప్రతిరోజూ కొత్త అనుభవమే.. ప్రతిపూటా కొత్త అనుభూతే. ఈ కార్యక్రమం కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ అభివాదాలు. ముఖ్యంగా మా రాంప్రసాద్‌ సంగీత సాహిత్యాల పర్యవేక్షణ చేస్తుంటాడు. అలాగే, పిల్లలకు తర్ఫీదు ఇవ్వడంతో గతంలో చాలామంది పనిచేశారు. ప్రస్తుతం బి.వి.శ్రీనివాస్‌ శిక్షణ ఇస్తున్నారు. పిల్లలతో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చిక్కల్లా పెద్దలతోటే! తమ బిడ్డల మీద అవ్యాజమైన అనురాగం, నమ్మకం ఉండటంలో తప్పులేదు. కానీ, చేసిన తప్పుల వల్ల ఎవరైనా మధ్యలో వెళ్లిపోవాల్సివస్తే ‘మా పిల్లలకు అన్యాయం జరిగిందండీ’ అంటారు. అలాగే, ‘అసలు ఈ వేదిక మీద మా పిల్లలు పాడితే చాలు అనుకుని వచ్చామండీ’ అంటూ విశాలహృదయంతో చెప్పేవారూ ఉంటారు. ఈ పొగడ్తలు తెగడ్తలన్నింటినీ సమంగానే స్వీకరించాను. ఇందులో పాల్గొన్న పిల్లలందరూ ఇప్పటికీ ఎక్కడున్నా నాతో మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది పిల్లల తండ్రులు అయ్యారు.. తల్లులయ్యారు. చిన్న పిల్లగా వచ్చి పాడి తర్వాత పెళ్లి చేసుకుని తమ పిల్లలను తీసుకొచ్చి పాడించిన వారూ ఉన్నారు. తరం తర్వాత తరం ఇలా వస్తుంటే ఇంతకంటే ఆనందం ఏముంటుందండీ! 

‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో సంగీత వాద్యాలు వాయించే వారు చాలా ఓపికగా పిల్లలతో సాధన చేయిస్తారు. రోజులో ఎనిమిది తొమ్మిది గంటలు వాద్యాల మీదే ఉంటారు. అయినా చిరునవ్వులతో చిన్నారులను ఆశీర్వదిస్తుంటారు. అలాగే, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణుల నుంచి ప్రొడక్షన్‌ మేనేజర్లు, సహాయకుల వరకూ.. డ్రైవర్లు, మాకు ఆప్యాయంగా అన్నం వడ్డించే వారు అందరూ చాలా భక్తిగా పనిచేస్తారు. కార్యక్రమం చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు నేనూ అలాగే వేచిచూస్తున్నాను. ఈ లాక్‌డౌన్‌ లేకపోతే తుది పోటీ జరగాల్సి ఉంది. దాని తర్వాత కొత్త ధారావాహికకు ఎంపికలు జరగాలి. ఇవన్నీ మళ్లీ ఆరంభమయ్యే రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 

రాయాలనిపిస్తుంది కానీ..
ప్రముఖ రచయితలతో చాలామందితో నాకు వ్యక్తిగత పరిచయాలున్నాయి. జంధ్యాల అంటే చాలా ఇష్టం. ఆత్రేయ అత్యద్భుతమైన రచయిత. ఆయనతో పరిచయం ఉంది. సినారె, వేటూరి, సిరివెన్నెల.. వీళ్లందరూ నాకు ఇష్టుల్లో ముఖ్యులు. ఇప్పుడు రాస్తున్న తరంలో రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్‌లతో పాటు మిగిలిన వారూ అవకాశం వస్తే మంచి సాహిత్యం రాయగలిగిన వారే. ఆ అవకాశాలు వాళ్లకు తక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన వాటిని వాళ్లు వృథా చేసుకోవడం లేదు. బాగా రాస్తున్నారు. అలాగే, ఎక్కడైనా ఏదైనా మంచి కవితో, ఖండికో కనిపించిందంటే దాన్ని చదవాలనిపిస్తుంది. చదివాక ఆయా రచయితలకు ఫోను చేసి అభినందించడం నాకు అలవాటు. ఇలా ఎందుకంటే.. నాకు అక్షరమంటే ఇష్టం.. మాట అంటే ఇష్టం.. భాష అంటే ఇష్టం.   

చిన్నప్పటి నుంచి కొమ్మూరి సాంబశివరావు రచనలంటే బాగా అభిమానం. రాసింది అపరాధ పరిశోధన నవలలే అయినా ఆయన రాసే భాష చాలా చాలా ఇష్టం. చలం భాషా ధోరణి.. ఆ పదాల పోహళింపు కొమ్మూరిలో కనిపించేది. అలాగే ముళ్లపూడి వెంకట రమణ భాష కూడా అద్భుతం. ఇటీవల కాలంలో అంత బాగా రాస్తున్న వ్యక్తి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఓ వాణిజ్య సినిమాలో అందమైన సంభాషణల ద్వారా ప్రేక్షకుల చప్పట్లు కొట్టించుకునే రచయిత ఆయన. తను మొదటిసారి సంభాషణలు రాసిన సినిమా సభను నిర్వహించడానికి రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చాను. ‘‘సినిమా సంభాషణలకు సంక్షిప్తత ప్రాణం. అంత సంక్షిప్తతలోనూ భావాన్ని బలంగా చెప్పడంలో ఆత్రేయ, ముళ్లపూడి, జంధ్యాల తర్వాత నాకు నచ్చిన వ్యక్తి ఈ అబ్బాయి. కొత్త రచయిత అయినా చాలా బాగా రాశాడు’’ అని త్రివిక్రమ్‌ గురించి చెప్పాను. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఇప్పుడు తన భాషతో అద్భుతాలు చేస్తున్నారు. అలాగే, వాణిజ్య చిత్రాలను సైతం మంచి విలువలతో తీస్తున్న ఇంద్రగంటి మోహన్‌కృష్ణ అన్నా అభిమానమే. అవసరాల శ్రీనివాస్‌ చక్కగా నటిస్తాడు.. మంచి రచయిత కూడా. తనికెళ్ల భరణి అక్షరప్రజ్ఞ ఉన్నవారు. మిథునంలో ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. భరణి రచనలంటే నాకు చాలా మక్కువ. యండమూరి వీరేంద్రనాథ్‌ రచనా శైలి కూడా కట్టిపడేస్తుంది. శ్రీరమణ కూడా చాలా బాగా రాస్తారు. ముళ్లపూడి ‘కానుక’ హృదయాన్ని కరిగించే కథ. దాన్ని ఎవరైనా లఘుచిత్రంగా తీయాలన్నది నా కోరిక. వాళ్ల అబ్బాయి ప్రయత్నిస్తానన్నారు. అది తెరకెక్కితే బాగుంటుంది. పాటలు, కథలు నాకూ రాయాలనిపిస్తుంటుంది. కానీ, గొప్పగా రాసేవాళ్లు చాలామంది ఉన్నారు కదా అనిపించి మళ్లీ ఆగిపోతుంటాను. వ్యాసాల్లాంటివి రాసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి రాస్తుంటాను. భయభక్తులతో రాస్తాను.

మనకు లేదే ఆ అభిమానం!
ఎన్నో భాషల్లో పాడాను. సాధ్యమైనంత వరకు ఆ భాషలోని అందాన్ని.. ఆ ఉచ్చారణను ఆకళింపు చేసుకుని పాడతాను. దాని కోసం ఎక్కువ శ్రమపడతాను. ఈ మధ్య కాలంలో నా కచ్చేరీలు చాలా తక్కువ జరిగింది ఆంధ్ర, తెలంగాణల్లోనే. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కచ్చేరీలు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ హీరో పాట, ఆ కవి పాట, ఈ సినిమాలోని పాట అని కాకుండా మంచి పాట ఏదైనా వింటారు. వాళ్లకు భాష పట్ల ఉన్న అభిమానం చూస్తే ముందు గుండె పొంగుతుంది. ఆ తర్వాత ఈర్ష్య వేస్తుంది.. తెలుగు మీద మనకు లేదే ఇలాంటి అభిమానం అని! వాళ్లలో కొంత వీరాభిమానం ఉండవచ్చు. అది వేరే విషయం. కానీ, భాష పట్ల వాళ్ల తాపత్రయం, దాన్ని మాట్లాడే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. కన్నడిగులు, మలయాళీలు ఏదైనా సభలో మాట్లాడుతున్నారంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇంగ్లీషు వినబడుతుంది. అలాగే, తమిళనాడులో వైరముత్తు లాంటి గొప్ప కవులు ఎంత స్పష్టమైన భాష మాట్లాడతారో రాజకీయ నాయకులు కూడా తమిళంలో అంతే స్పష్టంగా మాట్లాడతారు. మనవాళ్లు మాట్లాడుతున్నప్పుడు కానీ, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని పత్రికల్లో వచ్చే వార్తలు కానివ్వండి.. చూస్తే ఇంగ్లీషు మాటల్లోంచి తెలుగు పదాలను ఏరుకోవాల్సి వస్తుంది. నాకు చాలా బాధగా ఉంటుంది. తెలుగువారికి తమ సొంత భాష మీద విముఖత ఎందుకు? ఇప్పుడు సినిమాల భాష కూడా మారిపోయింది. ఏదైనా అడిగితే తర్కం కూడదంటారు. సినిమాలో పాటకు తర్కం ఉందా? ఆయా పాత్రలు ఎదురెదురుగా ఉండి ఉద్వేగంతో పలికే సంభాషణలను నిత్య జీవితంలో వింటామా? లేదు కదా. సినిమాలో కాస్త నాటకీయత ఉంటుంది. ఓ బక్కపల్చటి కథానాయకుడు యాభై మందిని కొట్టి కనీసం జుట్టు కూడా రేగకుండా బయటికి వస్తున్నప్పుడు తర్కం గురించి ఆలోచిస్తున్నామా? మరి భాష గురించి అలా అనడమేంటి? ‘అవుద్ది, పోద్ది, గొట్టంగాడు, తొక్క..’ ఇలాంటి పదాలను వాడాల్సిన అవసరం లేదు. మంచి మాటలు మాట్లాడించవచ్చు. పాత రోజుల్లో పాత్రలను బట్టి ఎక్కడైనా కొంచెం యాసపెట్టారే కానీ, హాస్యనటులతో కూడా మంచి భాషే పలికించేవారు. ఇప్పుడు దానికి దూరమై పోతున్నాం. ఏదైనా అడిగితే పాతవాళ్లకిదో చాదస్తం అంటారు.

ఎందుకు ఆ వ్యర్థపదాలు?
పొద్దున్నే లేవగానే దినపత్రిక చదువుతాను. ఆ క్రమంలో ఎక్కడో ఒకచోట కొన్ని తప్పులు కనిపిస్తాయి. అవి ముద్రారాక్ష సాలు కావు.. రాసినవాళ్లు చేసిన తప్పులు. వాటి గురించి ఇక్కడ చెన్నైలో ఉండే సంబంధిత పత్రిక మిత్రులకు ఫోను చేసి ఇది ఇలా ఉండకూడదంటాను. అంబులెన్స్‌ అని రాస్తుంటారు. నిజానికది య్యాంబ్‌ లెన్స్‌. ఆ ఉచ్చారణ మనకు లేదు కాబట్టి కనీసం ‘అ’కి దీర్ఘమన్నా పెట్టాలి. అలాగే స్టేడియాలు అని రాస్తూంటారు. చక్కగా ‘మైదానాలు’ అని తెలుగులో రాయవచ్చు. ఇంగ్లీషులో అయితే స్టేడియం ఏకవచనం అయితే బహువచనం స్టేడియా. స్టేడియమ్స్‌ అనకూడదు. అలాగే, టీవీ వార్తలు వింటున్నప్పుడు కూడా ‘అధికారం’లో ధకు కదా ఒత్తు ఉండేది. వార్తలు చదివేవారు ‘కా’కి ఇస్తారు. అలాగే, ఎవరూ ‘పశ్చిమం’ అని సక్రమంగా అనరు. పచ్చిమం.. పచ్చిమ గోదావరి జిల్లాలో అని అంటుంటారు. ఎందుకు వీటిని ఎవరూ సరిదిద్దరు? అలాగే, మాటలకు నాటకీయత జోడించడం కూడా బాగుండదు. వార్తలు చదివేవాళ్లు కూడా వాళ్ల గాత్రాలను ఏదో కృతకంగా మార్చుకుని చదవడం నాకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆయా సంస్థల్లో నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే ‘ఇలా ఉంటే.. అంటే బాగుంటుందేమోనండీ’ అని చెబుతుంటాను. కొంత మంది దీన్ని అధిక ప్రసంగమనుకోవచ్చు. బాధ్యతగా భావించి తప్పులు సరిదిద్దుకున్న వారూ ఉన్నారు. అలాగే, మాట్లాడేటప్పుడు ఒక సందర్భం లేకుండా ఒక విషయంలోంచి మరో విషయంలోకి వెళ్లిపోతుంటారు. ‘మరి’ అనే పదాన్ని ఎంత మంది ఎన్ని విధాలుగా వాడుతుంటారో తెలియదు. ‘మరి ఇవాళ్టి సంగతులు.. మరి మన ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను.. మరి ఆయన ఏమన్నారంటే..’- ఈ మరి ఏంటో నాకు అర్థం కాదు. అలాగే, ‘వారిని కలవడం జరిగింది’, ‘మాట్లాడటం జరిగింది’, ‘అందజేయడం జరుగుతుంది’ అంటుంటారు. కలిశాను, మాట్లాడాను, అందజేస్తాం అంటే సరిపోతుంది కదా. ఇలాంటి వ్యర్థ పదాలన్నింటినీ ఉపహరించుకోవాలి.  

ఓ మధుర ప్రయాణం
జూన్‌ నాలుగో తేదీతో డెబ్బై అయిదో సంవత్సరంలోకి అడుగుపెట్టాను. కానీ, నాకు అలా అనిపించదు. నేను చాలా కుర్రవాణ్ని అనుకుంటాను. అంతే చలాకీగా పనిచేసుకుంటూ వెళ్తాను. గత మూడేళ్లుగా పుట్టినరోజు నాడు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం’ అని పెట్టి వివిధ రంగాల్లో గొప్పవాళ్లని సన్మానిస్తున్నాను. కరోనా వల్ల ఈ ఏడాది ఆ వేడుక చేయలేకపోయాను. ఈ భయాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వచ్చాక ఆ కార్యక్రమాన్ని నెల్లూరులోనే చేస్తాను. అలాగే, ఆ ఊళ్లో మా నాన్నగారి ద్వారా మాకు సంక్రమించిన ఇల్లు ఉంది. దాని విలువలో తోబుట్టువులకు ఎంతెంత భాగం ఇవ్వాలో ఇచ్చేసి ఆ ఇంటిని నేను తీసుకున్నాను. దాన్ని సంగీత వేద పాఠశాల నిర్వహణ కోసం కంచి కామకోటి పీఠానికి కానుకగా ఇచ్చాను. ఆ ఇంట్లో కొన్ని మార్పుచేర్పులు చేసి వారికి అతి త్వరలో అందజేద్దామనుకున్న సమయంలో ఈ కరోనా ఇబ్బంది వచ్చింది. ఓ రెండు మూడు నెలల్లో ఇది సమసిపోయిన తర్వాత వాళ్లకు కావల్సినట్టుగా మార్పులు చేసి అందజేస్తాను. 

ఇన్నేళ్ల నా ప్రస్థానంలో గానంతో పాటు ఓ నిబద్ధతతో అరవై సినిమాలకు సంగీతం అందించాను. స్థాయికి తగ్గిన పాట అని ఎవరూ అనుకోని పాటలు చేశాను. ఆ సంతృప్తి ఉంది. ‘మయూరి’ చిత్రంతో పాటు బాలచందర్‌ నిర్మించిన ‘శిఖరం’కు సంగీతం అందించడం గొప్ప ఘట్టాలు. అలాగే, మిథునంలో నటించడమూ గర్వకారణమే. నాతో కలిసి పనిచేసి.. సంగీత వాద్యాలు వాయించిన వారు ఇవాళ గొప్ప సంగీత దర్శకులు అయ్యారు. ఇళయరాజా నుంచి మణిశర్మ వరకూ చాలామంది చాలా గొప్ప స్థాయిలకు చేరుకున్నారు. నాతో పనిచేసిన వారి పిల్లలూ మంచి సంగీత దర్శకులయ్యారు. హారిస్‌ జయరాజ్‌ వాళ్ల నాన్నగారు జయరాజ్‌ నా దగ్గర గిటారు వాయించేవారు. ఇవాళ ప్లూట్‌ నవీన్‌ చాలా పేరు సంపాదించుకుని ముంబైలో ఉంటున్నాడు. అతను నా వాద్య బృందంలో పనిచేశాడు. శివమణి కూడా పనిచేశాడు. ఏఆర్‌ రహమాన్‌ కుడిభుజం శ్రీనివాస్‌మూర్తి నా బృందంలో ఉండేవాడు. ఇలా ప్రముఖులైన వారు ఉన్నారు. వాళ్లందరూ నన్ను ఆ మర్యాదతోనే చూస్తున్నారు. వాళ్లతో ప్రయాణం చేయడం.. ఇంకా పాడగలిగే శక్తిని నాకు ఆ భగవంతుడు ప్రసాదించడం. ఇంతకు మించి నాకింకేం కావాలి! 
      
సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! 

శివకుమార్, చెన్నై
తెలుగువెలుగు

#ఎస్పీబాలసుబ్రహ్మణ్యం
#SPBalasubrahmanyam

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

UNO & It's Associations Declared Days

రామాయణ దృక్పథం