వీరనారి మాతంగిని

ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని మేథినీపుర్‌ జిల్లాలో తమ్లుక్‌కు సమీపంలోని హోగ్లా గ్రామంలో పేద రైతు కుటుంబంలో 1869 అక్టోబరు 19న మాతంగిని జన్మించారు.  పేదరికం కారణంగా చదువుకోలేకపోయారు. కట్నకానుకలిచ్చే స్థోమత లేకపోవడంతో 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్‌తో ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవటంతో... 18వ ఏటే పిల్లలు లేకుండా వితంతువుగా మళ్లీ పుట్టింటికి చేరారు ఆమె! తన దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు మాతంగిని! ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.

స్వాతంత్య్రోద్యమ పవనాలు దేశమంతటా వీస్తున్న రోజుల్లో... ఉద్యమం పట్ల మాతంగినీ ఆకర్షితురాలయ్యారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని నూలు వడకడం మొదలుపెట్టారు. స్వయంగా తయారుచేసుకున్న ఖాదీ దుస్తులే ఆమె ధరించేవారు. గాంధేయ సిద్ధాంతాలపై ఆమె ప్రదర్శించిన నిబద్ధతను చూసి ఆ రోజుల్లో ఆమెను ‘గాంధీ బుడీ’ (ముసలమ్మ గాంధీ) అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకునేవారు. స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు ఆమె అప్పట్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. పలుమార్లు అరెస్టయ్యారు. జైలు జీవితం గడిపారు. కారాగారం నుంచి విడుదలైన వెంటనే మళ్లీ ఉద్యమంలోకి దూకేవారు.

1933లో ఒక రోజు ఆమె జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. ఆ సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ సర్‌ జాన్‌ ఆండర్సన్‌ అక్కడే పర్యటిస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి... అండర్సన్‌ ముందుకు వెళ్లి నల్లజెండా చూపారు మాతంగిని! ‘గవర్నర్‌ గోబ్యాక్‌’ అని నినదించారు. ఈ చర్యకుగాను ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షాకాలంలో ఆమెతో అలుపెరగకుండా పనులు చేయించారు. దీనివల్ల ఆమె శారీరకంగా బాగా శుష్కించిపోయారు.

1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం నాటికి ఆమె వయసు 70 దాటింది. అయినా వెరవలేదు. ఉద్యమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్‌లోని స్థానిక నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న మాతంగిని.. 6వేలమంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ్లుక్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ సమీపానికి చేరుకోగానే పోలీసులు వచ్చిపడ్డారు. ఉద్యమం వీడాలని హెచ్చరిక చేశారు. ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. దీంతో యువరక్తాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో... పోలీసుల లక్ష్యం మళ్లించేందుకు చేతిలో కాంగ్రెస్‌ పతాకంతో, వందేమాతర నినాదంతో శివంగిలా మాతంగిని ముందుకు ఉరికారు. ముందుకొస్తే కాలుస్తామని హెచ్చరిస్తున్నా వినకుండా అలాగే నడిచారు. పోలీసులు కాల్పులు జరిపారు. మాతంగిని శరీరంలోకి ఒక తూటా దిగింది. రక్తం ఎగజిమ్మింది. భరించలేని బాధను దిగమింగుకుంటూ.. వందేమాతరం అని నినదిస్తూ ముందడుగు వేశారు. ఈలోగా రెండో తూటా దిగింది. 73 ఏళ్ల బక్కపల్చటి దేహం కంపించిపోయింది. అయినా ఆమె స్ఫూర్తి తగ్గలేదు సరికదా.. మరింత పెరిగింది. జెండాను మరింత పైకెత్తి, ఇంకా బిగ్గరగా వందేమాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. పోలీసు తుపాకీ నుంచి మూడో తూటా దూసుకొచ్చింది. రక్తం ధారగా కారుతుండగా ఆమె కుప్పకూలిపోయారు. ప్రాణం వదిలినా.. జెండాను మాత్రం ఆమె వదల్లేదు. ఆమె వీరగాథ నాడు ఎందరిలోనో స్ఫూర్తి రగిలించింది. మాతంగిని హాజ్రా ప్రేరణతో స్థానికులు మేథినీపుర్‌లో కొంతకాలం సొంతంగా స్థానిక ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు.

మూలం: Eenadu.net
#AzadiKaAmritMahotsav 
#DekhoApnaDesh

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)