🌳 వృక్షం - రాజు - పాదుకలు 🙏

🌳 వృక్షం - రాజు - పాదుకలు 🙏

ఒకానొకప్పుడు ఒక ఋషి మరియు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. 

శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. "ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." "ఏమిటా కోరిక గురువు గారూ" తన శిష్యుడు అడిగాడు దానికి "తాను చక్రవర్తి అయి ఈ జన్మలోనే భూమండలాన్ని ఏలాలని చెబుతాడు." 

దానికి శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? ". దానికి "అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా". "అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది". ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు.

ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

సంవత్సరం తరువాత. శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 

గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." "అంటే.." అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 

శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 
చేశాడు శిష్యుడు.

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)