నంగేలీ వ్యథ...!
‘రొమ్ము పన్ను’కు వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యథ.. !
- డా.జడా సుబ్బారావు
జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు! ప్రముఖుడి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు.గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పనిమీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి. దగ్గు తెరలుతెరలుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసినట్లు జ్ఞాపకాలు ఆమె కళ్లముందు మసకమసగ్గా కదలాడుతున్నాయి. మనసంతా గతకాలపు జ్ఞాపకాలతో చేదుగా అయిపోయింది. చేస్తున్న పనిని ఒక్కక్షణం ఆపి పక్కింటి వైపు చూసింది. ఉండీ లేనట్లుగా ఉన్న గుడిసె ముందు అర్ధనగ్నంగా ఉన్న ఆడవాళ్లూ, వాళ్ల కాళ్లచుట్టూ తిరుగుతూ కొంతమంది చిన్నపిల్లలూ కనిపించారు.
పుష్పవతి అయిన పదకొండేళ్ల పిల్లను పీటమీద కూర్చోబెట్టి కాళ్లకూ, చేతులకూ పసుపు రాస్తున్నారు. ముసలివాళ్లు చిన్నగొంతుతో ఏవో పాటలు పాడుతున్నారు. మొలకు చుట్టిన వస్త్రం తప్ప వాళ్ల ఒంటిమీద ఏ విధమైన ఆచ్ఛాదనా లేదు. పందిరి లేకుండా పెరిగే జాజితీగల్లా జుట్టు ఎలా పడితే అలా గాలికి ఎగురుతోంది. డొక్కల్లో నుంచి ఎముకలు బయటకు పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.
పుష్పవతి అయిన పిల్లవైపు చూసింది నంగేలి. తనకు జరుగుతున్న వేడుక ఏంటో తెలియనట్లు అయోమయంగా అందరివైపూ చూస్తోంది. బురదలో పుట్టిన తామరపువ్వుల్లా మెరిసే కళ్లతో, దేహంలో అప్పుడప్పుడే కొత్తగా పుడుతున్న అవయవాలను చూసుకుంటూ బిడియం కలగలసిన చూపులతో అందరివైపూ చూస్తున్న ఆ పిల్లనలా చూడగానే నంగేలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ వేడుక తర్వాత ఆ పిల్లకు జరగబోయే ‘మర్యాదలు’ ఎంత ఘనంగా ఉంటాయో, వయసు తారతమ్యం మరిచిన తోడేళ్ల గుంపు చేసే దాడి ఆ పసితనం మీద ఎంత దారుణమైన ముద్రవేస్తుందో తలచుకుంటున్న కొద్దీ నంగేలి దేహం కంపించిపోతోంది.
పెళ్లై భర్త ఉన్న తనే నిత్యమూ ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఇష్టంతో పనిలేకుండా అవమానాల కాష్ఠాన్ని భరిస్తోంది. ఇక రేపటి నుంచి ఆ పిల్ల కూడా తమతో పాటే ఈ అవమానాల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. గుండెలోతుల్లోకి గుచ్చుకుపోయే ముళ్లను తొలగించుకుని నవ్వుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎదురుతిరిగితే అవమానాలు భరించాలి. పెళ్లికాకపోతే తల్లిదండ్రుల ముందూ, పెళ్లైతే భర్త ముందూ చేసే అత్యాచారాల్ని సహించాలి. ఊరంతా తిప్పుతూ, కొడుతూ, తిడుతూ, ముఖాన ఉమ్మేస్తూ సాగించే క్రతువులో బలిపశువుగా తలొంచాలి. చిన్నపిల్లలా, పడుచువాళ్లా, ముసలివాళ్లా అనే తేడా లేదు. స్త్రీలైతే చాలు... పాలుతాగిన రొమ్ముల్లో నుంచి పన్నులు రాబట్టడానికి ఎగబడుతుంటారు!
ఆలోచన నుంచి బయటపడి సగం పూర్తైన వెదురుబుట్టను పక్కన పెట్టింది. దాన్ని చూస్తుంటే తనకూ, వెదురు బుట్టకూ తేడా లేదనిపించి దీర్ఘంగా నిట్టూర్చి పైకి లేచి నిలబడింది నంగేలి.
తనవంక నవ్వుతూ చూస్తున్న చిరుకందన్ కనిపించాడు. ఒక్క క్షణం నంగేలి తత్తరపడింది. ‘‘ఎంత సేపయింది వచ్చి’’ అంది అతని వంక చూస్తూ.
‘‘రాణీగారి చూపులు దిక్కుల్ని గాలిస్తున్నప్పుడే వచ్చాను’’ అన్నాడు చిరుకందన్. నంగేలిని ఏడిపించడానికి అప్పుడప్పుడూ ఇలా మాట్లాడతాడని ఆమెకు తెలుసు. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడింది.
‘‘దేని గురించో ఆలోచిస్తున్నావు?’’ అన్నాడు. నంగేలి ఏమీ మాట్లాడకుండా పక్కింటివైపు చూసింది. చిరుకందన్ ఆమె మనసు గ్రహించాడు. దగ్గరగా చేరి ‘‘మనకూ ఒక అమ్మాయి ఉంటే బాగుండేది కదా’’ అన్నాడు. అతడి వైపు విస్మయంగా చూసిన నంగేలి ‘‘వొద్దొద్దు... ఆడపిల్లను కని రాబందులకు ఎరవేయడం కంటే పిల్లల్లేకుండా ఇలా ఉండడమే మేలు’’ అంది గుడిసెలోకి నడుస్తూ.
మౌనంగా ఆమెను అనుసరించాడు చిరుకందన్. భర్తకు అన్నం పెట్టి ఎదురుగా ఏమీ మాట్లాడకుండా కూర్చుంది నంగేలి. ఆమె మౌనం చిరుకందన్ భరించలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే బాగుండనిపించింది. కాసేపయ్యాక ‘‘నాకు కూడా జాకెట్ వేసుకోవాలని ఉంది’’ అంది నంగేలి భర్తవైపు చూస్తూ. తింటున్న ముద్ద గొంతులో ఇరుక్కున్నట్లుగా ఉక్కిరిబిక్కిరయ్యాడు చిరుకందన్. ‘‘ఆడదానికి మానం, అభిమానం రెండు కళ్లలాంటివి. ఏ కంటికి శుక్లం వచ్చినా చూపు మందగిస్తుంది. ఏది ఏమైనా నేను జాకెట్ వేసుకుంటాను’’ అంది స్థిరంగా నంగేలి.
‘‘ఎదను కప్పుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా శ్రమను రెట్టింపు చేయాలి. జాకెట్టు వేసుకున్న ప్రతిసారీ ఆ శ్రమను పన్నుగా చెల్లించాలి. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం మంచిదే అయినా ఎదిరించి బతకడం ఎంత కష్టమో తెలిసిన దానివి. నీ నిర్ణయాన్ని నువ్వే పునరాలోచించుకోవాలి’’ అన్నాడు చిరుకందన్.
భర్తవంక బాధగా చూసింది నంగేలి. జాకెట్ ధరించి, పన్ను కట్టలేక వసూలు గుంపు చేతిలో అసువులు బాసిన ఆడవాళ్లు గుర్తొచ్చారు. గేలిచేస్తూ కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పుతుంటే కళ్లల్లో నీళ్లు కళ్లల్లోనే కుక్కుకుని వాళ్లవంక జాలిగా చూడగలిగారే తప్ప ఎదిరించే సాహసం చేయలేకపోయారు. ఎదిరిస్తే తమకూ అదే గతి పడుతుందని తెలుసు. కళ్లముందు పుట్టి పెరిగిన వాళ్లూ, కలిసి తిరిగినవాళ్లూ, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని దుర్భర బతుకులు బతికి మట్టిలో కలిసిపోయారు. ఈ హింసకు కారణమెవరైనా దాన్ని భరించేవాళ్లకే ఆ బాధ తెలుసు.
నంగేలి మనసులో ఆవేదన సుడులు తిరగసాగింది. కాసేపు ఆలోచనలతో సతమతమయింది. ఆ తర్వాత చిరుకందన్‌ను చూస్తూ ‘‘ఇలా ఎంతకాలం?’’ అంది.
‘‘మన బొందిలో ప్రాణం ఉన్నంతకాలం, మనకీ భూమ్మీద నూకలున్నంత కాలం’’ అన్నాడు.
‘‘అంతకుమించి ఏమీ చేయలేమా?’’ అడిగింది నంగేలి.
‘‘బలవంతుడు బాకు విసిరితే బలహీనుడు ఎంతదూరం పరిగెత్తగలడు? ఎంత దూరం పరిగెత్తినా అదే ఆకాశం... అదే ఆచారం! వాళ్ల భోగాలకోసం బొక్కసాలు నింపడమే మన బతుకులోని పరమార్థంగా మారిపోయింది. మట్టిలో కలిసిన మన పూర్వీకులంతా ఇలా సగం బట్టతోనే బతుకులు గడిపారు. ఈ వివక్ష మనతోనే ఆగిపోవచ్చు. లేదా పేర్లూ, రూపాలూ మార్చుకుంటూ మన జాతిని వెంటాడుతూనే ఉండొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో... నలుగురూ నడిచే దారిలో వెళ్తే తినే బియ్యం గింజలమీద మన పేరు రాసి ఉంటుంది. సొంత దారిలో వెళ్లాలనుకుంటే అవే బియ్యం గింజల్ని మన దేహంపైన చల్లుతారు.’’
భర్తవంక విస్మయంగా చూసింది నంగేలి.
‘‘చావుకీ పన్నుకీ భయపడి ఎంతకాలం తలవంచుతాం! బయటకి వెళ్తే అర్ధనగ్నంగా ఉన్న మా దేహాలపైన వాళ్లు చూపుల శూలాల్ని గుచ్చుతున్నారు. స్త్రీలు ఏ కులంలో పుట్టినా స్త్రీలే! పుట్టిన పసిబిడ్డకు కూడా నలుగురి ముందూ పాలివ్వాలంటే తల్లి ఎంతో సిగ్గుపడుతుంది. అలాంటిది మొలకు చిన్న వస్త్రాన్ని చుట్టుకుని ఎదభాగాన్ని వదిలేయడమంటే బతికుండగానే రాబందులు పీక్కుతిన్నట్లుగా ఉంది. తమ ఎదను కప్పుకోవడానికి ఉన్నత కులాల స్త్రీలకు అనుమతులిచ్చిన రాజులు, కింది కులాల ఆడవాళ్ల రొమ్ములపైన పన్నులు వేసి మనుగడ సాగించడం నీచకరం. నాకోసం కాకపోయినా నా తర్వాతి తరాల విముక్తి కోసమైనా ఏదో ఒకటి చేయాలి’’ నంగేలి మాటల్లో దుఃఖపు సుడులేవో తిరుగుతున్నాయి.
ఏమీ మాట్లాడకుండా చేయి కడుక్కోవడానికి బయటకు వెళ్తున్న భర్తను చూస్తూ కిందకు జారిన చీర చెంగును ఎదచుట్టూ కప్పుకుంది నంగేలి. చేతులకున్న మట్టిగాజులు గలగలమని చప్పుడు చేశాయి. నుదుట పెట్టుకున్న ఎర్రని తిలకం ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది. భుజాల మీదుగా ఎదచుట్టూ పైట కప్పుకోవటం ఆమెకెంతో ఆనందంగా ఉంది. అలా జీవితాంతం ఉండాలంటే- వచ్చే కూలీ మొత్తం పన్నుగా చెల్లించాలి. రోజంతా గొడ్డుచాకిరీ చేస్తున్నా వచ్చే కూలీ తక్కువ. దాన్ని తీసుకెళ్లి పన్నుగా చెల్లిస్తే పూట గడవడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. లోపలికి వస్తున్న భర్తను చూస్తూ ‘‘ఇలా కప్పుకుంటే బాగున్నానా’’ అంది నంగేలి. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన చిరుకందన్‌కు అందం రంగులోనే కాదు, ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది అనిపించింది. ఒక్క క్షణం కన్నార్పకుండా ఆమె వంక చూసి ‘‘కట్టుకున్న వాడిని కనుక కప్పుకుంటే బాగున్నావని అనగలను. కానీ విప్పుకుని తిరగమని రాజాజ్ఞలు చెబుతుంటే మనస్ఫూర్తిగా ఆ మాటెలా అనగలను’’ అన్నాడు. నంగేలి కళ్లు జలపూరితాలయ్యాయి. రెండు కన్నీటిబొట్లు ఆమె చెంపలపై జారాయి.
కప్పుకున్న పైటను కిందికి జారుస్తూ ‘‘ఆ భగవంతుడు స్త్రీలకు మానం, అభిమానం పెట్టకుండా ఉంటే బాగుండేది. భర్తకు మాత్రమే చూపించాల్సిన ఎదభాగాన్ని అందరికీ చూపిస్తూ తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది’’ అంది.
చిరుకందన్ ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె తలను పైకెత్తి బుగ్గలపై కన్నీటిని తుడిచి తల నిమిరాడు.
‘‘చూడు నంగేలీ... పాలకులు విషం చిమ్మే పాముల్లాంటివాళ్లు. అదనుచూసి కాటేస్తారు. మనలాంటి విధివంచితులు చెదలాంటి వాళ్లు. కుప్పలు కుప్పలుగా పుడుతుంటారు, చస్తుంటారు. ప్రపంచం తీరే అంత... కాటేసే పాముల్ని వదిలేసి చెద పురుగుల్ని చంపడం పైనే రాజుల దృష్టి ఉంటుంది. రాజ్యాల మనుగడ ఆధారపడి ఉంటుంది. నా ముందో నాలుగ్గోడల మధ్యో నీకు నచ్చినట్టుగా ఉండు. గుమ్మం బయటకెళ్తే మాత్రం నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకు. ఎందుకంటే అది వాళ్లకు గర్వంలా, అహంభావంలా కనిపిస్తుంది...’’ అన్నాడు చిరుకందన్.
‘‘మనసులో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకోడానికే ఇంత భయపడుతున్నాం. గుండెలమీద ఏ ఆచ్ఛాదనా లేకుండా అందరి ముందూ తిరగాలంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా’’ అంది నంగేలి.
‘‘మనిషిగా గుర్తించని చోట మానాభిమానాల ప్రసక్తి ఎందుకు? అయినా నువ్వొక్కదానివే కాదుగా... కింది కులాల్లో పుట్టిన ఆడవాళ్లంతా అలాగే చేస్తున్నారు. బతుకుతూ చస్తున్నారు. జుట్టూ, గెడ్డం పెరిగాయని మగవాళ్లంతా ‘తలక్కరం’ (పెరిగిన జుట్టు, గెడ్డం మీద విధించే పన్ను) కడుతుంటే, ఆడవాళ్లంతా ‘ములక్కరం’ చెల్లిస్తున్నారు. ఇదేంటని అడిగితే అమానుషాలు జరుగుతుంటాయి. నోరిప్పితే సమాధులు మొలుస్తుంటాయి. కళ్లముందు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా గుడ్డోళ్లుగా బతికితేనే ఈ దేశంలో మన కన్ను శాశ్వతంగా మూతపడకుండా ఉంటుంది’’ అన్నాడు చిరుకందన్.
‘అటువంటి దేహం ఉన్నా ఒకటే పోయినా ఒకటే’ నంగేలి మనసు లోలోపలే ఉడికిపోసాగింది. భర్త మాటలతో సమాధాన పడలేకపోయింది. అందరూ స్త్రీలే... అయినా కులాన్నిబట్టి హెచ్చుతగ్గులు, అంతస్తుల్ని బట్టి హెచ్చుతగ్గులు, అవయవాలను బట్టి హెచ్చుతగ్గులు... తన కళ్లముందే తన జాతివాళ్లంతా ఎదను కప్పుకోకుండా మానాన్ని బహిర్గతం చేయడం నంగేలికి రుచించట్లేదు. నిమ్నకులాల స్త్రీలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ అర్థంలేని పన్నులు వసూలు చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. తన బతుకు ఏమైనా సరే... జాకెట్ వేసుకోవాల్సిందే. చన్నుల మీద పన్నులు వేసి ఆనందిస్తున్న పాలకులకు గుణపాఠం నేర్పాల్సిందే!
ఆమెలో ఏదో పట్టుదల...!
* * *
మర్నాడు ఉదయమే లేచి పెందలకడే పనంతా పూర్తి చేసుకుంది నంగేలి. చిరుకందన్ పనికి వెళ్లగానే గుడిసెలోకి వెళ్లి తడికె దగ్గరగా వేసుకుంది. తెల్లటి వస్త్రాన్ని తీసుకుని ఎదనిండుగా కప్పుకుని అద్దం ముందు నిలబడింది. సగం పగిలిన అద్దంలో రెండు ప్రతిరూపాలుగా కనిపిస్తున్న తన దేహాన్ని చూసి మురిసిపోయింది. బయటకి వచ్చి తడిక దగ్గరగా వేసి పొలం పనికి బయలుదేరింది.
రోజూ నడిచే దారే అయినా ఆ రోజెందుకో ఆ దారి నంగేలికి కొత్తగా ఉంది. దారి వెంట నడుస్తున్న మిగతా స్త్రీలందరూ నంగేలి వంక కొత్తగానూ, వింతగానూ మెరిసే కళ్లతోనూ చూడసాగారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు నంగేలి. ఆత్మనూనతను జయించాలన్న ఆత్మవిశ్వాసమేదో ఆమె అడుగుల్లో ప్రతిఫలించసాగింది ఉత్సాహంగా నడుస్తున్న నంగేలి ఎదురుగా కనిపించిన పన్ను వసూలు చేసే అధికారిని చూసి ఒక్క క్షణం పాటు తడబడింది. పైనుంచి కిందకీ, కిందనుంచి పైకీ చూస్తూ పాములా బుసకొడుతున్న అతణ్ణి పట్టించుకోకుండా అడుగు ముందుకేసింది.
‘‘ఏయ్... ఆగు... నువ్వు చేస్తున్న పనేమిటో నీకు తెలుస్తోందా?’’ గర్జించాడతను.
‘‘మీ విధానాల మీద నిరసన ప్రకటిస్తున్నాను.’’
‘‘అందుకు పన్ను చెల్లించాలి. ఒక్కోసారి ప్రాణాల్ని కూడా ఫణంగా పెట్టాలి.’’
‘‘ఏ జాతిలో పుట్టినా స్త్రీకి ప్రాణంకంటే మానమే విలువైనది’’ అంది నంగేలి.
‘‘నువ్వు రాజాజ్ఞను ధిక్కరిస్తున్నావు. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలి.’’
‘‘రాజాజ్ఞలు ప్రజల్ని రక్షించాలి. బలహీనుల్ని దోచుకుంటూ స్త్రీల మానాల్ని హరించకూడదు’’ చెప్పి ముందుకు కదిలింది నంగేలి.
పన్ను వసూలు అధికారి అహం దెబ్బతింది. ‘ఇంతకింతా అనుభవిస్తావ్’ అని మనసులో అనుకుని... ‘‘సాయంత్రం ఇంటికి వస్తాను. నువ్వు చేస్తున్న పనికి పన్ను ఎంత చెల్లించాలో అక్కడే చెబుతాను’’ అన్నాడు వికృతంగా నవ్వుతూ.
నంగేలి వెనక్కి చూసింది. అతని చూపుల్లో నిద్రలేచి బుసలు కొడుతున్న కోరికల అగ్నిగుండాలు కనిపించాయి. మాటువేసి మట్టుబెట్టే పెద్ద పులి నిశ్శబ్దం తాండవించింది. ‘దేహం నాది కాదు’ అనుకుంటే పన్ను రద్దవుతుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తే ఊపిరి ఆగిపోతుంది! నంగేలి ఆలోచనలు ముళ్లకంచెలో చిక్కుకున్న వస్త్రపు చెంగులా చీరుకుపోతున్నాయి.
* * *
సూర్యుడు పడమటి కొండలవైపు నడక సాగించాడు. పెద్దగా మాట్లాడుకుంటూ గుంపును వెంటేసుకుని వస్తున్న పన్నుల వసూలు అధికారిని చూడగానే పల్లె గడపల్లో కలవరం బయల్దేరింది. అమాయకుల ముఖాల్లో ఆందోళన తొంగిచూసింది. వాళ్ల అడుగుల ధాటికి పైకిలేస్తున్న ధూళి కళ్లల్లో పడకుండా చేతుల్ని అడ్డు పెట్టుకుంటూ వాళ్లు వెళ్తున్న వైపు చూడసాగారు.
నంగేలి గుడిసె ముందు ఆగి తడికెమీద దబదబమని కొడుతూ ‘‘నంగేలీ... బయటకురా’’ పిలిచాడు అధికారి.
తడికె తెరిచి బయటకి చూసింది నంగేలి. జింకను వేటాడ్డానికొచ్చిన పులుల గుంపులా కనిపించారు.చేయి ముందుకు చాపి ‘‘పన్ను డబ్బులు...’’ గర్జించాడు అధికారి.
‘‘ఒక్క నిమిషం’’ లోపలికి వెళ్లబోయింది నంగేలి.
‘‘అప్పుడేనా... రొమ్ములు పట్టి చూడాలి కదా, కొలత వెయ్యకుండా ఎంత పన్ను కట్టాలో ఎలా తెలుస్తుంది’’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ.
అధికారితో వచ్చిన కళ్ల జతలన్నీ కోరికతో కాలిపోతూ నంగేలి దేహం వైపు దృష్టి సారించాయి. అవమానం, ఆక్రోశం, అసహ్యభావన... అన్నీ కలగలసిన వైరాగ్యమేదో ఆమెను నిలువునా దహించసాగింది. గుండె గట్లను దాటుకుని కళ్లల్లో పొంగి ప్రవహిస్తున్న బాధను పంటి బిగువున భరించింది. ఏదో చేయాలన్న కోపం వేడివేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయటకు రాసాగింది. ఏమీ చేయలేని నిస్సహాయత పదునైన కత్తిగా మారి గుండెల్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లుగా అనిపించింది.
ఏదో చేయాలి... ఈ డేగ చూపుల నుంచీ, ఉక్కు పిడికిళ్ల నుంచీ శాశ్వతంగా విముక్తి పొందడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి. ఇన్నేళ్లుగా భరిస్తున్న శారీరక, మానసిక రంపపుకోతకు ఈనాటితో సమాధి కట్టాలి. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ అధికారి ముందుకు వచ్చింది నంగేలి.
తనివితీరా తడిమి చూసి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవాలని ఎదురుచూస్తూ చుట్టూ ఉన్న గుంపును చూసి మీసాన్ని మెలేశాడు అధికారి.
ఎదపైనున్న వస్త్రాన్ని విప్పినట్లే విప్పి ఒక్క ఉదుటున గుడిసె లోపలికి వచ్చి తడిక వేసేసింది నంగేలి. ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఆ అధికారి బిత్తరపోయాడు. చుట్టూ చేరి చూస్తున్న వాళ్లముందు తల కొట్టేసినట్లయింది. దవడలు బిగుసుకున్నాయి. కోపంగా తడిక మీద కొట్టాడు.
కాసేపటికి తడిక తెరుచుకుని బయటకి వచ్చింది నంగేలి. ఆమె చేతుల్లో అరిటాకు, అందులో రక్తంతో నిండిన రెండు మాంసం ముద్దలు కనిపించాయి. కొండనుంచి దూకుతున్న జలపాతాల్లా ఆమె వక్షోజాల నుంచి స్రవిస్తున్న రక్తధారల్ని చూసి పన్ను వసూలు గుంపు భీతిల్లిపోయింది.
ఆ దృశ్యాన్ని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డుపెట్టుకుంటూ పారిపోతున్న వాళ్లను పిలుస్తూ ‘‘బాబూ... రండి... వీటికోసమేగా వచ్చింది. తీసుకెళ్లి కొలత వేయండి. వచ్చిన డబ్బులతో మీ రాజ్యానికి రత్నాల తొడుగూ, మీ రాజుకి ముత్యాల గొడుగూ పట్టండి. ఇన్ని దారుణాలకు సాక్షిగా ఉన్న ఆ దేవుడికి రక్తాభిషేకం చేయించండి. విభజించి పాలిస్తూ ఆడదాన్నీ మానాన్నీ అభిమానాన్నీ అర్ధనగ్నంగా నిలబెట్టి పన్నులు వసూలు చేస్తున్న మీ రాజుకి ఇవి నా బహుమతిగా చెల్లించండి. అమ్మ పాలు తాగి పెరిగిన మీరు రాక్షసుల్లా మారకండి. కొంచెం మానవత్వాన్ని చూపించండి. ఎదను కప్పుకున్నందుకు ఏడుస్తూ పన్ను కడుతున్న మా దయనీయ బడుగుజాతి స్త్రీల మానాభిమానాలతో ఆడుకునే దాష్టీకాన్ని ఆపమని చెప్పండి...’’
నేలకు వాలిన మహావృక్షంలా పడిపోయింది నంగేలి. ఎదనుండి పొంగి దేహమంతటా వ్యాపిస్తున్న రక్తం- చుట్టూచేరిన స్త్రీల కళ్లల్లో ఎరుపుజీరగా మారింది. ములక్కరానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించేలా చేసింది. నంగేలి త్యాగాన్ని చరిత్రలో లిఖితం చేసింది. భార్యపై అవ్యాజమైన ప్రేమతో ఆమె చితిలోకి దూకి ప్రాణత్యాగం చేసిన మొదటి ‘పతీ సహగమనాన్ని’ నమోదు చేసింది.
* * *
(18వ శతాబ్ది ప్రారంభంలో- కేరళలోని ట్రావెన్కోర్ సంస్థానాధీశులు విధించిన అసంబద్ధమైన, అమానవీయమైన ‘రొమ్ముపన్ను’కు వ్యతిరేకంగా చైతన్యగళాన్ని వినిపించి ప్రాణత్యాగం చేసిన ‘నంగేలి’ వ్యథ... ఇది చరిత్ర చెప్పిన కథ...!)
Comments
Post a Comment