🐜 భారం.. 🤔👏👌🙆🤷🧘‍♂️🙂

🐜 భారం.. 🤔👏👌🙆🤷🧘‍♂️🙂
ఓ ఆదివారం ఉదయం ఇంటి ముందు నీరెండకు కూర్చొని కాఫీ త్రాగుతూ సేద తీరుతున్న ఓ సంపన్నుడైన ఆసామి దృష్టి ఒక చీమపై పడింది.. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు.

ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు అతనిని ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన అతనిని, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది..

భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను అధిగమించటం.. అతని కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని అవగతం చేసింది..

కొంత సేపటికి చీమ తన గమ్యం సమీపానికి చేరుకోవడం అతను చూసాడు.. అది ఒక చిన్న రంధ్రం ద్వారా భూగర్భం లోపలకి ప్రవేశించే చీమల నివాసస్థలం, అప్పుడా క్షణంలో అతనికి ఆ చీమ వ్యవహారంలో ఉన్న లోపం స్పష్టంగా అర్థం అయ్యింది..ఆ చీమ తాను ఎంతో జాగ్రత్తగా గమ్యం వరకు తీసుకు వచ్చిన ఆ పెద్ద ఆకును చిన్న రంద్రం ద్వారా లోనికి ఎలా తీసుకెళ్లగలదు? అది అసంభవం. ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టానికోర్చి, శ్రమపడి, నేర్పుగా ఎన్నో అవరోధాలనధిగమించి చాల దూరం నుంచి తెచ్చిన ఆ పెద్ద ఆకును అక్కడే వదలి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది..
తను మోస్తున్న ఆకు భారం తప్ప ఇంకేమి కాదనే ఆలోచన.. సాహసంతో కూడుకున్న ఆ ప్రయాణం మొదలు పెట్టె ముందు ఆ చీమకు రాలేదు.. చివరాఖరికి వేరే మార్గం ఏమి లేక దానిని అక్కడే వదలి ఆ ప్రాణి గమ్యాన్ని చేరుకోవలసి వచ్చింది.. దీని ద్వారా ఆ ఆసామి ఒక గొప్ప జీవిత పాఠాన్ని ఆ రోజు తెలుసుకున్నాడు. ఇది మన జీవితాలలోని 'సత్యతను' కూడా తెలియ చేస్తుంది..

మనం.. మన పరివారం గురించి, మన ఉద్యోగం, మన వ్యాపారం, ధనం ఎలా సంపాదించాలని, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి వాహనంలో తిరగాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి 'ఉపకరణాలు' ఉండాలి ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు చేస్తాము..కానీ చివరికి వాటన్నింటిని వదలి అంతిమముగా 'మృత్యువ'నే 'బిందువు' (full stop..) పెట్టబడడం ద్వారా మన గమ్యమైన 'శ్మశానం' చేరుకుంటాము. మన జీవన ప్రయాణంలో ఎంతో ఆపేక్షగా, ఎంతో భయంగా మనం మోస్తున్న భారమంతా అంతిమంలో ఉపయోగపడదని, మనతో తీసుకెళ్లలేమని మనకు ఇట్టే తెలుసిపోతుంది.. 

మరి మనం మోస్తున్న భారం..అంతా.....???
అందుకే భారాన్ని మర్చిపోండి..ఆ దేవుడు ప్రసాదించిన ఈ విలువైన జీవితాన్ని..మన చుట్టూ ఉన్న ఆనందకరమైన ప్రకృతిని..జీవజాలాన్ని ఎరుకలొ ఉండి..ఆనందించి, ఆస్వాదించండి..మన 'మజిలీ' చేరుకునేలోపే..అనవసర భారాలను..వదిలి.. 'మనం ఎప్పటికీ ఇలాగే, ఇక్కడే ఉండిపోలేమన్న విషయాన్ని..స్మృతిలో ఉంచుకుని జీవితాన్ని ఆనందంగా గడపటానికి..ప్రయత్నిద్దాం...

🤸‍♂️🚴‍♂️🐜🐌🕸️🎭🤹‍♂️💕🌼🌼🌼🦋🙏🙂

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)