గణేశ్‌ శంకర్‌ విద్యార్థి (గాంధీకి మార్గదర్శకుడు; భగత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చినవాడు)

జాతీయోద్యమానికి గాంధీజీ మార్గదర్శకుడైతే... ఆయనకే దారి చూపించాడో పాత్రికేయుడు. అంతేకాకుండా భగత్‌సింగ్‌కు ఆశ్రయం ఇచ్చి... హిందు-ముస్లింల ఐక్యత కోసం ఆరాటపడి... చివరకు ఆ అల్లర్లలోనే అసువులు బాసిన అరుదైన అమరవీరుడు గణేశ్‌ శంకర్‌ విద్యార్థి!

విద్యార్థి మరణంపై గాంధీజీ యంగ్‌ఇండియా పత్రికలో ఉద్వేగంగా స్పందించారు. ‘అహో! ఎలాంటి మరణం అది? ప్రతి ఒక్కరూ అసూయపడేది. గణేశ్‌ శంకర్‌ విద్యార్థి చిందించిన రక్తం హిందూ-ముస్లింల బంధాన్ని సిమెంటులా పటిష్ఠం చేస్తుందని నమ్ముతున్నాను. ఆయన మరణం పాషాణహృదయాలను కరిగిస్తుందనుకుంటున్నాను. సంక్లిష్ట పరిస్థితుల్లో మనందరికీ ఆయనో ఉదాహరణ’’ అంటూ రాశారు గాంధీజీ.

గణేశ్‌ శంకర్‌ విద్యార్థి! 1890 అక్టోబరు 26న అలహాబాద్‌ దగ్గర్లో జన్మించిన గణేశ్‌ శంకర్‌ విద్యార్థి ఆర్థిక కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. కానీ పత్రికా వ్యాసంగంపై మక్కువ ఉండేది. గదర్‌ ఉద్యమ నేత పండిత్‌ సుందర్‌లాల్‌ పత్రిక ‘కర్మయోగి’లో వ్యాసాలు రాసేవారు. తర్వాత కాన్పుర్‌కు మారి తానే సొంతగా ప్రతాప్‌ అనే వారపత్రిక స్థాపించారు. స్వాతంత్య్రోద్యమం గురించే కాకుండా... భారతీయ సమాజంలోని అసమానతలు, అవలక్షణాల గురించి కూడా రాసేవారు గణేశ్‌. ఆ సమయంలో కాన్పుర్‌ జాతీయోద్యమానికి కీలకంగా ఉండేది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. దీంతో కార్మికుల సమస్యలు, రాయ్‌బరేలీ రైతుల కష్టాల గురించీ గణేశ్‌ ప్రజల దృష్టికి తీసుకొచ్చేవారు. జాతీయోద్యమం కేవలం ఇంగ్లిష్‌ చదువుకున్న ఉన్నతవర్గాలకే పరిమితం కాకుండా... సామాన్యులకూ చేరువకావాలని భావించేవారు. గాంధీని కలిసిన తర్వాత నేరుగా జాతీయోద్యమంలోకి దూకారు గణేశ్‌. కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటున్నా తన పత్రికతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం మాత్రం మానలేదు. ఫలితంగా ఐదారుసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

గాంధీజీ బాటలో పయనించినా... విప్లవకారులతోనూ సత్సంబంధాలు కొనసాగించిన గణేశ్‌ విద్యార్థి... ప్రశ్నించటం మానలేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలనూ నిలదీసేవారు. ‘‘ఒకవేళ భారత్‌కు స్వాతంత్య్రం వస్తే అదెవరి కోసం? తెల్లవారి స్థానంలో మన దొరలు వస్తారా?’’ అంటూ... వ్యక్తిగత స్వేచ్ఛ కోసం నినదించేవారాయన.

లాహోర్‌ కేసు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన భగత్‌సింగ్‌కు కొద్దిరోజులు కాన్పుర్‌లో గణేశ్‌ విద్యార్థి ఆశ్రయమిచ్చారు. అంతేగాకుండా తన పత్రిక ప్రతాప్‌లో భగత్‌సింగ్‌ భావాలను, వ్యాసాలను ప్రచురించారు. మరో విప్లవవీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌, కాంగ్రెస్‌ నేత జవహర్‌లాల్‌ నెహ్రూల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు.

‘విభజించు పాలించు’ విధానంలో భాగంగా హిందూ-ముస్లింల మధ్య బ్రిటిష్‌ వారు పెట్టిన చిచ్చుపై గణేశ్‌ ప్రజల్ని చైతన్యం చేయటానికి ఎక్కువగా ప్రయత్నించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సైతం చేతులెత్తేసిన చోట తాను వెళ్లి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించేవారు. ‘మసీదుల ముందున్న మైదానాల్లో రామ్‌లీలా ఉత్సవాలు జరుపుకొనే మనం ఇలా కొట్లాడటమేంటి? ఇదంతా బ్రిటిష్‌వారి కుట్ర’ అంటూ పత్రికలో రాశారు. కానీ ఇవన్నీ చెవిటివాడి ముందు శంఖమూదినట్లే అయ్యాయి.

లాహోర్‌లో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారనే విషయం తెలియగానే యావద్దేశం ఊగిపోయింది. కాన్పుర్‌లో శాంతియుత ప్రదర్శనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. కానీ ఆ ప్రదర్శనలో ఓ అపశ్రుతి చోటు చేసుకొని అది కాస్తా హిందూ-ముస్లిం అల్లర్లకు దారితీసింది. బ్రిటిష్‌ పోలీసులే ఇందుకు కారణమని తర్వాత తేలింది. పోలీసుల నిర్లిప్తత కారణంగా వందల మంది మరణించారు. ఆ సమయానికి కరాచీలో ఉన్న గణేశ్‌ విద్యార్థి ఉన్నపళంగా కాన్పుర్‌కు బయల్దేరి వచ్చారు. వీధివీధి తిరుగుతూ ఇరువర్గాలనూ సముదాయించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి బాగో లేదని స్నేహితులెంత వారించినా ఆయన ఆగలేదు. ఆ క్రమంలో 1931 మార్చి 25న.. ఓ వీధిలో అల్లర్లను అడ్డుకోవటానికి వెళ్లిన 40 సంవత్సరాల ఆయన్ను మూకలోని ఒకరు కత్తితో పొడిచి హత్య చేశారు.

స్వాతంత్య్రానంతరం సంబరాల్లో పాల్గొనకుండా మతకల్లోలాలను చల్లార్చటానికి కోల్‌కతాకు వెళ్లటం ద్వారా గణేశ్‌ చూపిన బాటనే అనుసరించారు గాంధీజీ!

సేకరణ: Eenadu.net

Comments

Popular posts from this blog

Gandhi- My Experiments with Truth (ఆత్మకథ లేక సత్యశోధన)

Geeta Jayanti (Special)

Mahatma Gandhi మహాత్మా గాంధీ (తొలిచూపు))