ఈశ్వరోవాచలు
30 Aug 2022
విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ.
30 Oct 2022
జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే.
శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే...
ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది విశ్వాసం. అంతే.. మరేంలేదు.🤗
21 December 2019
నాలో లేనిది నానుండి ఏదీ వెలువడదు.
నా నుండి వెలువడాలంటే వెలువడాల్సినది నాలో ఉండనక్కరలేదు.
కేవలం ఉన్నట్టు కనబడితే చాలు.
ఇంతకీ ఏంచెప్పానో ఏంటో నాకే తెలియకుండా వెలువడింది..--
02 Nov 2019
జాగరూకత" అంటే ఇంతే
జరిగినవాటినుండి గ్రహించి
జరుగుతున్నవాటితో బేరీజు వేసుకుంటూ
జరగబోయేవాటిని ఊహిస్తూ
జాగ్రత్తపడేలా జాగ్రత్తలు తీసుకోవడమే కాబోలు ---
01 Jul 2022
నేను స్కూల్ చదివేరోజుల్లో మా తెలుగు మాస్టారుగారు మాంచి ఆసక్తితో పాఠం చెబుతుండగా బహుశా ఉక్కపోత కారణం కావొచ్చు.. ఆయన ముఖానికి పట్టిన చెమట ధారాళంగా కారిపోతూ కనబడుతోంది. అది ఆయనకు చికాకుపెడుతోందని గమనించీ మేష్టారండీ మేష్టారండీ మీ ముఖంమీద చెమటంతా కారుతూ గడ్డందగ్గర వేలాడతంది మేష్టారూ.. తుడుచుకోండి అని బుద్ధిమంతుడిలా చేతులుకట్టుకుని లేచి చెప్పేసి కూచున్నాను. అంతే... ఆయన పాఠం చెప్పేవాడల్లా ఆగిపోయి నావంకే చూస్తూ దగ్గరకు వచ్చి నా మెడ వంచి ఒక్క గుద్దుగుద్ది నాలుక మడతపెట్టి వేలు చూపిస్తూ వెళ్ళి మళ్ళీ పాఠం చెబుతున్నారు... ఆయన అలా ఎందుకు కొట్టారో ఎంత ఆలోచించినా నాకు బల్బు వెలగలేదు.. అందునా ఆయన బాగా ఇష్టపడే చురుకైన విద్యార్ధుల్లో నేనుకూడా ఒకడిని... అందరిముందూ అలా నన్ను అవమానించడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఆరోజునుండి ముందువరుసలో కూచోకుండా ఆయన పీరియడ్ అప్పుడు వెనక్కి వెళ్లి కూచుని నా నిరసన తెలియజేసేవాడిని.
ఓరోజు దగ్గరకు పిలిచి అభిమానంగా తల నిమిరి ఒక చిన్న హితోపదేశం చేసారు. కామన్సెన్స్ అనేదొకటుంటుంది. అది తెలుసుకుంటే ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని చక్కగా వివరించి చెప్పారు. పిల్లలందరి ఏకాగ్రత పాఠంపై ఉన్నప్పుడు నీకు నా ముఖంమీద చెమటలు ఎందుకు కనబడ్డాయి. పైగా నువ్వు అలా చెప్పడంవల్ల అప్పటిదాకా ఎవరూ గమనించని అంత చిన్న సంగతిపై అందరి దృష్టీ పడిపోయి విన్న పాఠమంతా డిస్ట్రబ్ అయినట్టేకదా.. పైగా అందరూ నా చెమట ముఖాన్ని చూసి నవ్వుకుంటూ అదొక టాపిక్ లాగా చర్చించుకుంటారు. అందుకే అందరూ చూస్తుండగా వాళ్ళకి హెచ్చరికగా నీవీపుమీద గుద్దాను.. అంతే బాబూ... ఏమీ అనుకోకు.. అమాయకత్వం మంచిదేకానీ కామన్సెన్సుని డామినేట్ చేసేంతగా ఉండకూడదు.. అర్ధమైందా అని సమాధానపరిచాడు.
అప్పటినుండి ఎవరి దగ్గరైనా మనం నోటేస్ చేసే చిన్నచిన్న విషయాలను పెద్దగా పట్టించుకున్నది లేదు. నేనుకూడా అప్పుడప్పుడు ప్యాంటు జిప్పు పెట్టుకోవడం మరిచిపోతుంటాను. షర్టు గుండీలు తప్పుగా పెట్టుకుంటుంటాను. ఒక్కోసారి నడుముదగ్గర ప్యాంటులోపలకి తోసుకున్న బనియన్ ఫ్యాంటుజిప్పు పెటుకోకపోవడంవల్ల బయటకు వచ్చేస్తుంది. బాగా జలుబు చేసినప్పుడు ముక్కులోపల పేరుకున్న చీమిడి కారి కిందపడేలా ఉన్నాకూడా గమనించుకోలేను... ఎవరైనా వాటిని నోటీస్ చేసి చెబుతుంటే వెంటనే అలర్టయ్యి సరిచేసుకుంటాను కానీ ఎందుకో వాళ్ళు నన్ను హేళన చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పరువు తీసేసార్రా బాబూ అనుకుంటూ బాధపడిపోతాను తప్ప వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్న ధ్యాసే కలగదు...
ఇలాంటివి రోడ్డుపై సైడ్ స్టాండ్ వేలాడుతూ కనబడే బళ్ళ విషయాల్లాంటి ప్రమాదకరమైనవి ఐతే పబ్లిక్ లో అందరూ వినేలా ఎలా అరిచి చెప్పినా ఫరవాలేదు. మరి ఈ సిగ్గుకు సంబంధించి కప్పుకునే వస్త్రాలంకరణ విషయమై సిగ్గుగా ఫీలయ్యే విషయాలను పబ్లిక్ లో ఎలా చెప్పగలం.. చెబితే వాళ్ళు పాజిటివ్గా తీసుకునేంత విశాలమైన మనస్తత్వం వాళ్ళకి ఉంటుందా...? వాళ్ళ పరువు బయటపడేయకుండానే వాళ్ళకి ఆ విషయం నోటీసయ్యేలా చేసి సరిచేసుకునేలా చెప్పగల కామన్సెన్స్ వేరేగా ఉంటుంది. చెప్పాలనుకున్నప్పుడు అది పనిచేయాలి. వద్దనుకుంటే ఏ గోలా ఉండదు. మన ఇంట్లోవాళ్ళకి చెప్పినట్టు బయటవాళ్ళకి చెప్పడంవల్ల లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు. ఏమంటారు.. 🤗
16 Dec 2022
ఫోన్లు పని చేస్తుంటాయి కానీ నెట్ సిగ్నల్స్ మనకు కనబడవు.😊
కరెంటు తీగలు కనబడతాయి కానీ వాటిలో ప్రవహించే కరెంటు కనబడదు. 😊
మనం ఊపిరి తీసుకుంటాం కానీ ఊపిరితిత్తులకు అందించే ప్రాణవాయువు కనబడదు. 😊
చెంపమీద ఎవరైనా కొడితే స్పర్శ తెలుస్తుంది. నొప్పి కలుగుతుంది. కానీ అవి కనబడవు. ఎలా ఉంటాయో చూపించమంటే చూపించలేం. 😊
కాబట్టి దేవుడున్నాడు. మనల్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటాడు. కానీ కనబడడు.
అంతే. ఇది ఫిక్స్.. మాటల్లేవ్ మాటాడుకోడాల్లేవ్ 🤗
25 October 2019
అందంగా లేకపోయినా అందంగా కనిపించాలనుకోవడం, ఉన్న అందాన్ని కాదని లేని అనాకారితనాన్ని ప్రదర్శించడం. ఈ రెండూ ఇతరులను ఇంప్రెస్ చేయడానికో మాయబుచ్చడానికో ఐతే ఇక్కడ చాలామంది మాయగాళ్ళున్నట్టే. మనల్ని మనం సంతృప్తిగా చూసుకోవడంలో తప్పు ఉండదు కాబట్టి ఎలా తయారైనప్పటికీ ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోనవసరం లేదు. ఓ చిరునవ్వుతో వారికి సమాధానం ఇవ్వొచ్చు. ఏమంటారు.
అప్పుడప్పుడు నాలోని అనాకారితనమే నాకు చాలా అందంగా తోస్తుంది. ఎవరికోసమో నన్ను నేను తయారు చేసుకోను....🤗😊😎
23 Aug 2022
రాజకీయాలపట్ల నాకు అంత ఆసక్తి లేదని చెప్పేది ఎందుకంటే.. వాటిగురించి ఎడతెగని డిస్కషన్స్ పెట్టుకోవడం నాకు నచ్చిచావదని. ఓవరాల్ గా అన్నిపార్టీల పంథాలలో కొంచెం అటూఇటూగా వేరుగా కనబడుతున్నప్పటికీ ఒకే లక్ష్యంవైపు పోతుంటాయనేది నాకు ఏర్పడిపోయిన నమ్మకం.
09 Nov 2022
తూనీగని చూసే హెలికాప్టర్ తయారు చేసి ఉంటారనేది నా మూఢనమ్మకం. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కలు రౌండుగా తిరుగుతాయి. తూనీగేమో రెక్కలు పైకీకిందకీ ఆడిస్తుంది. సో.. నాది మూఢనమ్మకమే.😏
08 Oct 2020
అద్దంలో బయటున్నది మాత్రమే కనబడుతుంది. మనలోపలి మనసుకూడా కనబడితే బాగుండు. ఎవరెలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో చూసుకోవచ్చు.
30 Apr 2020
చెప్పడానికి ఏమీ మిగల్లేదు. గత రెండున్నర సంవత్సరాలుగా ఏదోటి చెబుతూనే వచ్చా. కొత్తగా చెప్పాలంటే కొత్తగా ఆలోచించే కొత్త జీవితం కావాలేమో.
16 Nov 2022
గరికపాటివారిని ప్రసంగం చేస్తుండగా అనేకమార్లు గమనిస్తుంటాను. ఆధ్యాత్మిక ప్రవచనాలలో ఆయన మిగతా ప్రవచనకారులకు కాస్త భిన్నంగా ప్రవచించే శైలితో ఆధ్యాత్మికను ఆచరించేవారినేగాక నాస్తికహేతువాదం వైపు ఆలోచనలు చేస్తుండే నాలాంటి మధ్యేవాదులనుకూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారని అర్ధమైంది. ఒక్కోసారి ఈయన ఇలా తమ సంప్రదాయ జీవనానికి విరుద్ధంగా అనిపించేలా ప్రవచనాలు చెబుతుంటాడుకదా.. మరి సంప్రదాయ మూఢత్వంలో మునిగితేలిపోయే కమ్యూనిటీస్ ఈయన ప్రవచనాలను ఎలా చూస్తారో అని. వితంతువులు పూజలకూ పునస్కారాలకూ పనికిరారా అనే సందేహానికి బదులుగా ఆయన బోధించిన ప్రవచనం నాకు బాగా నచ్చింది. అలానే మరికొన్ని మూఢత్వం వదిలి అభ్యుదయంవైపు మరల్చేవిధంగా ఆయన ప్రవచనాలు కనిపిస్తుండేవి. అవి కంటబడినప్పుడల్లా ఫరవాలేదు ఈయన మరీ అంత ఛాందసుడు కాడేమోలే కాస్త పనికొచ్చే ముచ్చట్లే బోధిస్తున్నాడు అనిపించేది. ఆ భావన ఏర్పడిపోవడంతో అప్పుడప్పుడు ఆయన ప్రవచనాలలో దొర్లే మనువాద పోకడలను అంతగా పట్టించుకోదగ్గవిగా అనిపించేవి కావు.
కులప్రస్తావనలతో వివాదాలలో చిక్కుకున్నప్పుడు క్షమాపణలు చెప్పి తన వెర్షన్ ఏదో చెప్పుకుని కన్విన్స్ చేయడంతో పొరపాట్లనేవి మానవ సహజం కాబట్టి పోనీలే అనుకునేవాడిని. నెమలి సంపర్కం విషయంలో చేసిన ప్రవచనం ఆయనలో దాగిన అసలైన అజ్ఞానాన్ని బయటపెట్టినప్పటికీ .. సరే. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వాస్తవం వేరేదైనప్పటికీ ఒక మంచి ఉద్దేశం బోధించేందుకు తప్ప మరోటి కాదులే అనిపించడంతో అది అవాస్తవమని నిరూపించదగినదైనప్పటికీ సమర్ధించుకుని ఆయన పాండిత్యం పట్ల గౌరవం చూపి ఉంటాం.
ఇలా అనేకమార్లు ఏ సందర్భం చూసినా ఆయనను వెనకేసుకొచ్చేవైపే మొగ్గు చూపతుండిపోతున్నాను తప్ప తప్పులు కనబరుస్తున్నా ఒక్కమారుకూడా వ్యతిరేకంగా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నామో నాకు అర్ధం కాలేదు. నింపాదిగా ఆలోచిస్తే అవగతమయ్యింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా ఆయన బోధించిన కొన్ని మంచి మాటల ప్రభావం మనసులో బలమైన ముద్ర వేసేయడంతో ఆయన బోధించే తప్పుడు ప్రవచనాలలోకూడా మనకు తెలియని లోకకాంక్షను కోరే ఏదో పరమార్ధం దాగి ఉంటుందనే అపభ్రంశపు భావన ఉండిపోవడమే కారణం అని అర్ధమైంది.
మహిళల వస్త్రధారణతోపాటు స్వేచ్ఛ విషయంలో తొలుత ఒక సగటు పురుషస్వభావంలో ఉన్నవాడిగా ఆయన మాటలను పూర్తిగా సమర్ధించేలానే అనిపించింది. ఇది నా తప్పు కాకపోవచ్చు. ఆయన తప్పుకూడా కాకపోవచ్చు. తరాలనుండి సంక్రమిస్తూ వస్తున్న పురుషాధిపత్య పితృస్వామిక మనువాద భావజాలపు కండిషనింగ్ ప్రభావం అని కాస్త లోతుగా ఆలోచిస్తే తప్ప అసలు విషయం బోధపడలేదు. ఈ కండిషనింగ్ ప్రభావం కేవలం పురుషులకు మాత్రమే ఉంటుందని అనుకోకూడదనికూడా అర్ధమైంది. మహిళా స్వేచ్ఛ హక్కులు అనే మాటలు వినబడిన ప్రతీ సందర్భంలోనూ వాటిని వ్యతిరేకించే కండిషనింగ్ ప్రభావితులలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఉండటం మనం గమనించవలసిన ముఖ్య విశేషం.
అఫ్కోర్స్.. గరికపాటి ఒక్కరే మొదటివాడుకాదూ చివరివాడుకూడా కాదు. మహిళలను కించపరిచే ఉద్దేశం కలిగి ఉన్నవారికి తనొక్కడే బ్రాండ్ అంబాసిడర్ కాడని తెలుసు. బట్.. సమాజాన్ని తన ప్రవచనాలద్వారా ప్రభావితం చేస్తూ అవి విని ఆచరించేలా చేయడంలో తనవంతు ప్రముఖమైన పాత్రవహిస్తున్నవాడిగా తన లోపాలను తనకు తెలియజేయడమేగాక తద్వారా ఆ భావజాలంలో కండిషనింగ్ చేయబడుతున్న మిగతా ప్రభావితులకుకూడా ఒక హెచ్చరికగానూ గుణపాఠంగానూ అభ్యంతరాలు వినిపిస్తూ తగిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకతను చాటిచెప్పదలిచిన మహిళా అభ్యుదయవాదులకు సంపూర్ణ మద్దతు తెలుపవలసిందే..
ఈ శ్వ రం
👁️🗨️👌🔖♻️@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment