అంతర్ముఖుడు కావాలి


ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.  ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు. 

ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.
ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ, ఒక సందేహం అతడిని పీడించింది. నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు. 

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.  అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.

మానవ సేవే మాధవ సేవ 
వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి! 

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)