వీరనారి మాతంగిని
ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని మేథినీపుర్ జిల్లాలో తమ్లుక్‌కు సమీపంలోని హోగ్లా గ్రామంలో పేద రైతు కుటుంబంలో 1869 అక్టోబరు 19న మాతంగిని జన్మించారు. పేదరికం కారణంగా చదువుకోలేకపోయారు. కట్నకానుకలిచ్చే స్థోమత లేకపోవడంతో 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్‌తో ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవటంతో... 18వ ఏటే పిల్లలు లేకుండా వితంతువుగా మళ్లీ పుట్టింటికి చేరారు ఆమె! తన దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు మాతంగిని! ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేసేవారు. స్వాతంత్య్రోద్యమ పవనాలు దేశమంతటా వీస్తున్న రోజుల్లో... ఉద్యమం పట్ల మాతంగినీ ఆకర్షితురాలయ్యారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని నూలు వడకడం మొదలుపెట్టారు. స్వయంగా తయారుచేసుకున్న ఖాదీ దుస్తులే ఆమె ధరించేవారు. గాంధేయ సిద్ధాంతాలపై ఆమె ప్రదర్శించిన నిబద్ధతను చూసి ఆ రోజుల్లో ఆమెను ‘గాంధీ బుడీ’ (ముసలమ్మ గాంధీ) అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకునేవారు. స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు ఆమె అప్పట్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమ...